పదేళ్ల చిన్నారి.. పోలీసులతో లెక్కలు చెప్పించింది!
పదేళ్ల వయసున్న ఓ చిన్నారి.. తనకు లెక్కలు రావట్లేదంటూ పోలీసులను సాయం చేయమని కోరింది. ఆ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పెట్టగా, ఓహియో పోలీసు అధికారి ఒకరు దానికి స్పందించారు కూడా. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సంభాషణను ఆమె తండ్రి స్క్రీన్షాట్లు తీసి ఫేస్బుక్లో పెట్టగా, అది ఒక్కసారిగా వైరల్ అయ్యింది. లీనా డ్రేపర్ (10) తనకు లెక్కలకు సంబంధించిన ఓ ప్రశ్న సమస్యగా మారిందని ఓహియో పోలీసు శాఖకు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా తెలిపింది. మీరు నాకు సాయం చేయగలరా అని కూడా కోరింది.
అనుకోకుండా ఈ పోస్ట్ చూసిన ఓ అధికారి.. ఐదో తరగతి చదువుతున్న ఆ పాపకు సాయం చేయాలనుకున్నారు. (8+29) x 15 అనే సమస్యను ఎలా పరిష్కరించాలో లెఫ్టినెంట్ బీజే గ్రబర్ ఆమెకు తెలిపారు. ఆయన స్పందించడంతో లీనా ఊరుకోలేదు. (90+27) + (29+15) x 2 అనే లెక్కను ఎలా చేయాలో చెప్పమని మళ్లీ అడిగింది. ముందుగా మొదటి బ్రాకెట్లోవి కలపాలని, తర్వాత రెండో బ్రాకెట్లోవి కలపాలని, ఆ రెండింటినీ కలిపి రెండుతో గుణకారించాలని ఆయన వివరించారు. వీళ్లిద్దరి సంభాషణల స్క్రీన్ షాట్లను లీనా తండ్రి మోలీ డ్రేపర్ స్క్రీన్ షాట్లు తీసి ఫేస్బుక్లో పెట్టారు. ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటున్నందుకు థాంక్స్ అని కూడా చెప్పారు. ఈ పోస్ట్‌ను మూడు వేల మంది షేర్ చేయగా, 27వేల మందికి పైగా లైక్ చేశారు.