'క్యాలెండర్ గర్ల్స్' రివ్యూ
టైటిల్: క్యాలెండర్ గర్ల్స్
జానర్: డ్రామా
తారాగణం: ఆకాంక్షపూరి, అవనీ మోది, కైరా దత్, రుహి సింగ్, సత్రూపా పైనె
దర్శకత్వం: మధుర్ బండార్కర్
సంగీతం: మీట్ బ్రోస్ అంజన్, అమాల్ మాల్లిక్
నిర్మాత: బండార్కర్ ఎంటర్టైన్మెంట్
బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాస్ మాసాలా ఎంటర్టైన్మెంట్స్ వెంట పరుగెడుతుంటే, రియలిస్టిక్ సినిమాలు తీసే సాహసం చేస్తున్న ఒకే ఒక్క దర్శకుడు మధుర్ బండార్కర్. చాందినీ బార్, పేజ్ 3, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, హీరోయిన్ ఇలా ఇప్పటివరకు అన్నీ గ్లామర్ ఇండస్ట్రీ చాటున ఉన్న చీకటి కోణాల్ని తెరకెక్కిస్తూ వచ్చిన మధుర్, మరోసారి క్యాలెండర్ గర్ల్స్‌తో అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. హీరోయిన్ ఫెయిల్యూర్‌తో నిరాశపడ్డ మధుర్ అభిమానులు క్యాలెండర్ గర్ల్స్‌తో సంతృప్తి చెందారా.. రివ్యూలో చూద్దాం.
కథ:
తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా గ్లామర్ ఇండస్ట్రీలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు మధుర్ బండార్కర్. సినిమా ప్రారంభంలోనే ఐదుగురు అమ్మాయిలు క్యాలెండర్ గర్ల్స్‌గా పరిచయం అవుతారు. ఎన్నో కష్టాల తరువాత ఆ స్ధాయికి వచ్చిన ఆ అమ్మాయిలు ఒక్కరాత్రిలో స్టార్స్‌గా మారిపోతారు. ఆ తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వాళ్లు ఎలాంటి తప్పటడుగులు వేశారన్నదే మిగతా కథ. కథాపరంగా కొత్తదనం లేకపోయినా కథనంలో చాలా కొత్తదనం చూపించిన మధుర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
లీడ్ రోల్స్లోనటించిన వారంతా కొత్తవారు కావడంతో వారి గురించి మాట్లాడుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. అయితే గ్లామర్ డాల్స్‌గా మాత్రం ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో కూడా గుర్తుపట్టగలిగే నటీనటులు ఎవరూ లేకపోవటం, పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలు కూడా కనిపించకపోవడంతో నటనపరంగా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక సినిమా అంతా డైరెక్టర్స్ మూవీగా సాగుతుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ మధుర్ బండార్కర్ తన మార్క్ ఉండేలా చూసుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో తన గత సినిమాల ఛాయలు ఎక్కువగా కనిపించటం ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. హరి వేదాంతం సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మీట్ బ్రోస్ అంజన్, అమాల్ మాల్లిక్ల సంగీతం ఆశించిన స్ధాయిలో వర్కవుట్ కాలేదు. చాలా సందర్భాల్లో పాత మ్యూజిక్ వింటున్న ఫీల్ కలిగించారు.
విశ్లేషణ:
తన గత సినిమాల మాదిరిగానే రియలిస్టిక్ అప్రోచ్‌తో మధుర్ బండార్కర్ తెరకెక్కించిన క్యాలెండర్ గర్ల్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మధుర్ బండార్కర్ గత సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపించటం, గే డిజైనర్స్, మేనేజర్స్, కార్పొరేట్స్ లాంటి పాత్రలు రెగ్యులర్‌గా మధుర్ సినిమాల్లో కనిపించే పాత్రలు కావటంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. తన గత సినిమాలతో పోలిస్తే రచయితగా మాత్రం బెస్ట్ అనిపించాడు మధుర్ బండార్కర్. హీరోయిన్ సినిమాతో పోలిస్తే క్యాలెండర్ గర్ల్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా ఫ్యాషన్ స్థాయి సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోవచ్చు.
ప్లస్ పాయింట్స్
రియలిస్టిక్ అప్రోచ్
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ టేకింగ్
స్టార్స్ లేకపోవటం
మ్యూజిక్
ఓవరాల్‌గా క్యాలెండర్ గర్ల్స్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకునే డ్రామా ఫిలిం