mathura krishna temple
-
షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాలో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్వేను పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు కూడా అంగీకరించింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ శుక్రవారం షాహి మసీద్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ట్రస్ట్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పిటిషన్ రూపంలో సవాల్ చేయాలని సూచించింది. దీనితో పాటు దీనిపై ట్రస్ట్ వేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. -
ఆ మూడు అంశాల చుట్టూనే యూపీ ఎన్నికల రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచార హోరులో అయోధ్య రామమందిర నిర్మాణం, వారణాసి కాశీ విశ్వనాధ ఆలయ అభివృధ్ధితో పాటు కొత్తగా మథురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం కీలక అంశంగా మారింది. పురాతన ఘాట్లు, ఐకానిక్ దేవాలయాలు, శ్రీకృష్ణుని యొక్క అనేక కథలు, విభిన్న సంస్కృతులతో మేళవించి యమునా నది ఒడ్డున ఉన్న మథుర, బృందావనాల్లో ఆలయ నిర్మాణాలే తమ తదుపరి అజెండా అని కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార భారతీయ జనతా పార్టీ ప్రచారం మొదలు పెట్టడంతో దీని చుట్టూ యూపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓ అడుగు ముందుకేసిన స్థానిక లోక్‌సభ ఎంపీ, సినీ నటి హేమమాలిని మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్‌ను కోరడం, పశ్చిమ యూపీలోని ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగానే పోరాడుతుండటంతో శ్రీకృష్ణుడి ఆలయం చుట్టూతే ఇక్కడి రాజకీయం ప్రదక్షిణలు చేస్తోంది. ఇప్పటికే మథురలో రాజుకున్న చిచ్చు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, కొన్ని సంస్థలు మథుర భూవివాద అంశాన్ని లేవనెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్ 25న స్థానిక మథుర కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇందులో శ్రీకృష్ణ జన్మ స్థలానికి 10.9 ఎకరాలు, పక్కనే ఉన్న 2.5 ఎకరాలు షాహీ ఈద్గా మసీదుకు చెందేటట్లుగా 1968లో ఒప్పందాలు జరిగాయని, అయితే వాటిని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ భూమిలో ఈద్గాను నిర్మించాడని పిటిష¯న్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ఇటీవల అఖిల భారత హిందూ మహాసభ మథురలోని షాహీ ఈద్గా మసీదులో పాదయాత్ర నిర్వహించి, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో అక్కడ ప్రభుత్వం భద్రతను పెంచడంతో పాటు 144 సెక్షన్ విధించింది. అనంతరం కొద్ది రోజులకే యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అయోధ్య, కాశీ మందిరాల తర్వాత తమ తదుపరి నిర్మాణం మథురలోనే అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సైతం రాజకీయ వేడిని సృష్టించాయి. అనంతరం ఎంపీ హేమమాలిని మథురలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో ఈ వేడి కొనసాగుతూనే ఉంది. యోగి తాజా వ్యాఖ్యలతో మరింత హీట్.. ప్రస్తుత ఎన్నికల సీజన్లో తొలిసారి మథుర ఆలయనిర్మాణంపై యోగి ఆదిత్యనా«థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమ్రోహాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన యోగి, ‘అయోధ్య, వారణాసిల మాదిరిగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బృందావన్ నగరాలకు దేవాలయం వస్తుంది. దానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాం. మోదీ ఆ పని ప్రారంభించారు. ఇక కాశీలో శివుని గొప్ప నివాసం రాబోతోంది. అలాంటప్పుడు మథుర, బృందావనం ఎలా మిగిలిపోతాయి?’అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం తమ తదపరి అజెండా అని చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పుడే రాజకీయ దుమారం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఏఐఎంఎంఐలు స్పందించాయి. మళ్లీ మతపరమైన ఎజెండాతో బీజేపీ ఓట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని, ప్రజలకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపుపై మాట్లాడటం మానేసి, మతపర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించాయి. మథురకు ఎందుకంత ప్రాధాన్యత? ప్రస్తుత ఎన్నికల్లో మథుర ఆలయ నిర్మాణం తెరపైకి తేవడానికి రాజకీయ ప్రాధాన్యం చాలా ఉంది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు పశ్చిమ యూపీలో 76 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మథుర ఒకటి. 2017 ఎన్నికల్లో 76 స్థానాలకు బీజేపీ 66 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 4, బీఎస్పీ 3, కాంగ్రెస్ రెండు, రాష్ట్రీయ్ లోక్ దళ్ ఒకచోట నెగ్గాయి. ఇటీవలి రైతు చట్టాల నేపథ్యంలో పశ్చిమ యూపీలో బీజేపీ వ్యతిరేకత పెరిగింది. చట్టాలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ ఓ వర్గంలో ఆవేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తిరిగి తమ ప్రాభల్యాన్ని నిలబెట్టుక్కోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ మథుర ఆలయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. యోగి ఆదిత్యనా«థ్‌ను మథుర నుంచి పోటీ చేయాలని డిమాండ్లు పెట్టించడం ద్వారా ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఇప్పటికే కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మథురలో పర్యటించిన యోగి, కృష్ణ జన్మస్థాన్ పరిసర ప్రాంతాన్ని మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించే పవిత్ర స్థలంగా ప్రకటించారు. ఈ ప్రకటన మంచి స్పందన రావడంతో ఆయన ఆలయ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మసీదు తొలగింపు పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరున్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మధుర జిల్లా కోర్టు శుక్రవారం స్వీకరించింది. ఇదే అంశంపై గత నెలలో విచారణకు మధురలోని సివిల్ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపేందుకు జిల్లా జడ్జి సాధనా రాణి థాకూర్ అంగీకరించారు. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేశారు. కాగా మధుర శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రదేశంలో కట్ర కేశవ్ దేవ్ దేవాలయానికి చెందిన 13 ఎకరాల స్థలంలో 17వ శతాబ్దంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’ అయితే శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని 1968లో మధుర కోర్టు ఆమోదించింది. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్.. ఈద్గా ట్రస్టు మేనేజ్మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్లో ఆరోపించారు. మొగల్ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆరోపించారు. కాగా శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి షాహీ ఈద్గాహ్ మసీదు ఆక్రమణను తొలగించాలనే అంశంపై మధురలోని సివిల్ జడ్జి కోర్టులో సెప్టెంబర్ 30న పిటిషనర్ విష్ణు జైన్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ కేవలం భక్తుడైనంత మాత్రాన భగవంతుడి తరపున కోర్టులో కేసు వేయడానికి అధికారం లేదని చెబుతూ పిటీషన్‌ను కొట్టివేసింది. -
ప్రపంచంలోనే ఎత్తయిన ఆలయం!
ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఎత్తయిన ఆధ్యాత్మిక ప్రదేశం అంటే... ఇప్పటివరకు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు దానికంటే కూడా ఎత్తయిన ఓ సరికొత్త ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గల బృందావనంలో సిద్ధమవుతోంది. బృందావన్ చంద్రోదయ మందిర్ అనే ఈ ఆలయం పూర్తయితే దాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవని చెబుతున్నారు. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షస్నెస్) కట్టిస్తున్న ఈ ఆలయంలో ఒక థీమ్ పార్కు కూడా ఉంటుంది. భూకంపం వచ్చినా చెక్కు చెదరకుండా దీని నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇన్‌జెనియస్ స్టూడియో, స్ట్రక్చరల్ కన్సల్టెంటు త్రాన్టన్ తోమశెట్టి ఈ ఆలయానికి డిజైన్ సమకూర్చారు. మొత్తం 700 అడుగుల ఎత్తు ఉండే ఈ భవనంలో 70 అంతస్తులు ఉంటాయి. ఇందులో చిన్నపిల్లలు ఆడుకోడానికి వీలుగా పార్కు రెయిడ్లు, యానిమెట్రానిక్స్, లైట్ అండ్ సౌండ్ షో, వ్రజ మండల్ పరిక్రమ షోలు, లేజర్ షోలు కూడా ఉంటాయని ఆలయ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహదాస్ చెప్పారు. మొత్తం 70 అంతస్తులు ఎక్కడానికి వీలుగా ఒక కాప్స్యూల్ లిఫ్టు ఉంటుంది. అంత ఎత్తు నుంచి నగరాన్ని చూడటం కూడా సందర్శకులకు మంచి అనుభూతిగా ఉంటుంది. ఇక సౌండ్ అండ్ లైట్ షో అయితే పిల్లలు, పెద్దలందరికీ కూడా చాలా అపురూపంగా ఉంటుందని అంటున్నారు. కృష్ణుడు బృందావనంలో కొలువు దీరినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా చుట్టూ బృందావనం లాగే వాతావారణం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ దాదాపు 30 ఎకరాల కృత్రిమ అడవి ఉంది. ప్రస్తుతం ఆలయానికి 180 అడుగుల లోతున పునాదులు వేస్తున్నారు. మొత్తం 511 కాలమ్‌లు వేస్తున్నామని, ఈ పనులు వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతాయని నారాయణ దాస్ చెప్పారు. పునాదికే అన్నాళ్లు పట్టిందంటే.. ఇక మొత్తం ఆలయం పూర్తయ్యేసరికి ఇంకా చాలా కాలం పట్టేలాగే ఉంది.