ఆ మూడు అంశాల చుట్టూనే యూపీ ఎన్నికల రాజకీయం | Construction of Sri Krishna Temple in Mathura key Issue in UP Elections | Sakshi
Sakshi News home page

UP Assembly Elections: మూడు అంశాల చుట్టూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల రాజకీయం

Published Sat, Jan 1 2022 6:31 AM | Last Updated on Sat, Jan 1 2022 6:39 AM

Construction of Sri Krishna Temple in Mathura key Issue in UP Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ప్రచార హోరులో అయోధ్య రామమందిర నిర్మాణం, వారణాసి కాశీ విశ్వనాధ ఆలయ అభివృధ్ధితో పాటు కొత్తగా మథురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం కీలక అంశంగా మారింది. పురాతన ఘాట్‌లు, ఐకానిక్‌ దేవాలయాలు, శ్రీకృష్ణుని యొక్క అనేక కథలు, విభిన్న సంస్కృతులతో మేళవించి యమునా నది ఒడ్డున ఉన్న మథుర, బృందావనాల్లో ఆలయ నిర్మాణాలే తమ తదుపరి అజెండా అని కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార భారతీయ జనతా పార్టీ ప్రచారం మొదలు పెట్టడంతో దీని చుట్టూ యూపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓ అడుగు ముందుకేసిన స్థానిక లోక్‌సభ ఎంపీ, సినీ నటి హేమమాలిని మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్‌ను కోరడం, పశ్చిమ యూపీలోని ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగానే పోరాడుతుండటంతో శ్రీకృష్ణుడి ఆలయం చుట్టూతే ఇక్కడి రాజకీయం ప్రదక్షిణలు చేస్తోంది.  

ఇప్పటికే మథురలో రాజుకున్న చిచ్చు 
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, కొన్ని సంస్థలు మథుర భూవివాద అంశాన్ని లేవనెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 25న స్థానిక మథుర కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఇందులో శ్రీకృష్ణ జన్మ స్థలానికి 10.9 ఎకరాలు, పక్కనే ఉన్న 2.5 ఎకరాలు షాహీ ఈద్గా మసీదుకు చెందేటట్లుగా 1968లో ఒప్పందాలు జరిగాయని, అయితే వాటిని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. 16వ శతాబ్దంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ భూమిలో ఈద్గాను నిర్మించాడని పిటిష¯న్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే ఇటీవల అఖిల భారత హిందూ మహాసభ మథురలోని షాహీ ఈద్గా మసీదులో పాదయాత్ర నిర్వహించి, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో అక్కడ ప్రభుత్వం భద్రతను పెంచడంతో పాటు 144 సెక్షన్‌ విధించింది. అనంతరం కొద్ది రోజులకే యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అయోధ్య, కాశీ మందిరాల తర్వాత తమ తదుపరి నిర్మాణం మథురలోనే అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సైతం రాజకీయ వేడిని సృష్టించాయి. అనంతరం ఎంపీ హేమమాలిని మథురలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో ఈ వేడి కొనసాగుతూనే ఉంది.  

యోగి తాజా వ్యాఖ్యలతో మరింత హీట్‌.. 
ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో తొలిసారి మథుర ఆలయనిర్మాణంపై యోగి ఆదిత్యనా«థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమ్రోహాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన యోగి, ‘అయోధ్య, వారణాసిల మాదిరిగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బృందావన్‌ నగరాలకు దేవాలయం వస్తుంది. దానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాం. మోదీ ఆ పని ప్రారంభించారు. ఇక కాశీలో శివుని గొప్ప నివాసం రాబోతోంది. అలాంటప్పుడు మథుర, బృందావనం ఎలా మిగిలిపోతాయి?’అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం తమ తదపరి అజెండా అని చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పుడే రాజకీయ దుమారం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఏఐఎంఎంఐలు స్పందించాయి. మళ్లీ మతపరమైన ఎజెండాతో బీజేపీ ఓట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని, ప్రజలకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరల తగ్గింపుపై మాట్లాడటం మానేసి, మతపర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించాయి.  

మథురకు ఎందుకంత ప్రాధాన్యత?
ప్రస్తుత ఎన్నికల్లో మథుర ఆలయ నిర్మాణం తెరపైకి తేవడానికి రాజకీయ ప్రాధాన్యం చాలా ఉంది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు పశ్చిమ యూపీలో 76 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మథుర ఒకటి. 2017 ఎన్నికల్లో 76 స్థానాలకు బీజేపీ 66 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 4, బీఎస్‌పీ 3, కాంగ్రెస్‌ రెండు, రాష్ట్రీయ్‌ లోక్‌ దళ్‌ ఒకచోట నెగ్గాయి. ఇటీవలి రైతు చట్టాల నేపథ్యంలో పశ్చిమ యూపీలో బీజేపీ వ్యతిరేకత పెరిగింది. చట్టాలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ ఓ వర్గంలో ఆవేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తిరిగి తమ ప్రాభల్యాన్ని నిలబెట్టుక్కోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ మథుర ఆలయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. యోగి ఆదిత్యనా«థ్‌ను మథుర నుంచి పోటీ చేయాలని డిమాండ్‌లు పెట్టించడం ద్వారా ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఇప్పటికే కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మథురలో పర్యటించిన యోగి, కృష్ణ జన్మస్థాన్‌ పరిసర ప్రాంతాన్ని మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించే పవిత్ర స్థలంగా ప్రకటించారు. ఈ ప్రకటన మంచి స్పందన రావడంతో ఆయన ఆలయ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement