Matrimonial site
-
Hyderabad: మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అసలేం చేశాడంటే?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: మాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం నమోదు చేసుకున్న మహిళలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, డీఐ వెంకటరమణలతో కలిసి వివరాలు వెల్లడించారు. జిల్లా కందుకూరు మండలం నెడనూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి (38) 2011లో కల్వకుర్తికి చెందిన మహిళతో వివాహం జరిగి గొడవలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మ్యాట్రిమోనీలో శ్రీనాథ్ అనే పేరుతో పేరు నమోదు చేసికున్నాడు. భారత్ మాట్రిమోనీలో విడాకులు తీసుకున్న ఓ మహిళ రెండవ పెళ్లి కోసం నమోదు చేసుకోగా ఆమె ప్రొఫైల్‌ను సేకరించాడు. ఆమెకు ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఒక సారి నేరుగా కలుద్దామని చెప్పాడు. వచ్చే సమయంలో నగలతో పాటు వస్తే ఫొటో తీసుకుని తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లి చేసికుంటానని నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆ మహిళ ఈ నెల 7న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాత్రి ఇన్ హోటల్‌కు వచ్చారు. రెడీ అయ్యే ముందు వాష్ రూమ్‌కు వెళ్లి ఫ్రెష్అప్ కావాలని చెప్పాడు. దీంతో ఆమె వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును తీసుకుని హోటల్ నుంచి పరారయ్యాడు. నిందితున్ని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివిధ కేసుల్లో నిందితుడు.. ► ఇదే విదంగా నిందితుడు మోహన్‌రెడ్డి షాదీ డాట్ కామ్‌లో గౌతమ్‌రెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని ఓ మహిళను నమ్మించాడు. ఆమెకు నమ్మకం కలిగిన తర్వాత ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు. ► మరో మాట్రిమోనీలో విజయరెడ్డి పేరుతో పేరు నమోదు చేసికుని రూ.9లక్షలు తన అకౌంట్లో వేసుకున్నాడు. ► కల్వకుర్తిలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ 10వ తరగతి చదువుతున్న బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలు జైలుకు వెళ్లివచ్చాడు. ► కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తన బంధువుకే కారు పేరుతో రూ.4.50లక్షలు మోసం చేశాడు. మాదాపూర్‌లోని హాస్టల్లో ఉంటూ రూ.70వేల విలువ చేసే ల్యాప్‌టాప్ తదితర వస్తువులను దొంగతనం చేశాడు. ► చైతన్యపురిలో మరో హాస్టల్లో రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్ దొంగతనం చేశాడు. ఇలా పలు కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నాడు. -
వారెవ్వా ఓనరు..ఫిదా చేశావ్ గురూ! ఏం చేశాడో తెలిస్తే!
బెంగళూరు: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనలు చిన్నా, పెద్ద సంస్థల్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా దిగ్గజ కంపెనీలు ఖర్చులను నియంత్రించుకునే పనులను ఇప్పటికే మొదలు పెట్టాయి. ఇక నిధులను సమకరించుకోవడంలో స్టార్ట్ప్ కష్టాలను సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, భూస్వామి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి సంస్థ (స్టార్టప్)లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. దీనికి సంబంధించిన కథనం ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. వివరాళ్లోకి వెళ్లితేఏఐ పవర్డ్ మ్యారేజ్ యాప్ ‘బెటర్‌హాఫ్’ కో-ఫౌండర్, సీఈవో పవన్ గుప్తా ఈ కథనాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ చాలా కష్టంగామారిపోయిన ప్రస్తు సమయంలో ఊహించని ఇన్వెస్టర్ నాకు దొరికాడు అంటూ తన ఇంటి యజమాని సంభాషణల స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. సుశీల్ కుమార్ అనే ల్యాండ్ లార్డ్ తన ఇంట్లో ఉంటున్న వ్యక్తి నిర్వహిస్తున్న ‘బెటర్‌హాఫ్’ అనే మ్యారేజ్ బ్యూరో స్టార్టప్ కంపెనీపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించాడు. ఏకంగా 10 వేల డాలర్లు (రూ. 8 లక్షలు) ఎలా పెట్టుబడి పెట్టాడు. ఈ విషయాన్ని పవన్‌తో వాట్సాప్ ద్వారా షేర్ చేసుకున్నారు. నిజాయితీగా పెట్టుబడి పెడుతున్నా అంటూ పవన్ వెంచర్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ , మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానంటూ అభినందలు తెలిపారు. దీంతో నెటిజన్లు యజమాని ఔదార్యంపై ఫిదా అవుతున్నారు. In a tough business landscape, I found an unexpected investor in my landlord. He recently invested $10K in my startup @betterhalfai. Truly amazed by the entrepreneurial spirit everyone in Bangalore shows. Silicon Valley of India for a reason. #peakbengalurumoment pic.twitter.com/IfzUn0lPkl — Pawan Gupta (@pguptasloan) June 2, 2023 -
నిన్నే పెళ్లాడతానంటూ మ్యాట్రిమోనీలో పరిచయం.. లేడి డాక్టర్‌ను నమ్మించి..
మాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చానని, లక్షల యూరోలు తీసుకువస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, ట్యాక్స్ కడితే తాను వచ్చి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో మహిళా డాక్టర్ ఏకంగా రూ.19 లక్షలు జమ చేసింది. ఆ తరువాత నెంబర్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తిరువొత్తియూరు(తమిళనాడు): మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై కోవైకి చెందిన మహిళా డాక్టర్‌కు రూ.19.60. లక్షలు టోకరా వేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్ వరుని కోసం మాట్రిమోని వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. అవి చూసి ఓ యువకుడు, తన పేరు యుసాన్ సియాన్ అని వైద్యురాలికి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండులో శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్లు నమ్మించాడు. ఇందుకు సహకారం అవసరమని కోరారు. పైగా తాను ఇక్కడ సెటిల్ అయ్యాక భారతీయ యువతిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు. తాను భారతదేశానికి వచ్చిన సమయంలో కలుస్తానంటూ నమ్మించాడు. అనంతరం ఇద్దరూ సెల్‌ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల లక్ష యూరోలతో వచ్చాడు.. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో ఫోన్ చేయించాడు. ఆమె డాక్టర్‌తో మాట్లాడుతూ.. యుసాన్ సియాన్ తన తల్లితో ఢిల్లీ వచ్చారని వివరించింది. అతని సెల్‌ఫోను మరమత్తులకు గురైనట్లు చెప్పింది. లక్ష యూరో డాలర్లు తీసుకుని వస్తున్నారని, అది భారతదేశపు కరెన్సీలో రూ.82.51 లక్షలకు సమానమని వివరించింది. దాన్ని మార్చడానికి, వారు నివాసం ఉండడానికి, విమాన టికెట్, పన్ను చెల్లించడానికి మొత్తము రూ. 19,59,920 కట్టాలని, యుసాన్ సియాన్ నేరుగా కలిసి నగదు తిరిగి ఇస్తారని తెలిపింది. ఈ మాటలు నమ్మిన కోవై మహిళా డాక్టర్ వారు చెప్పిన అకౌంట్‌కు రూ.19,59,920లను డిపాజిట్ చేశారు. దీని తరువాత వారు ఫోన్లో మాట్లాడలేదు. ఆ తరువతా అనుమానం రావడంతో ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళా వైద్యురాలు కోవై కార్పొరేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
మ్యాట్రిమోనిలో బయోడేటా.. పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసం
సత్తెనపల్లి: పెళ్లి పేరుతో మహిళను భార్యాభర్తలు మోసగించిన సంఘటన ఇటీవల వెలుగుచూసింది. భర్త పరారీలో ఉండగా, భార్యను సత్తెనపల్లి రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ అబ్బూరులోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు రెండో వివాహం నిమిత్తం ఇటీవల మ్యాట్రిమోనిలో తన బయోడేటా పెట్టింది. ఈ బయోడేటా చూసిన కార్తీక్ అనే వ్యక్తి తన అమ్మ వాళ్లది తెనాలి అని, ఉద్యోగం రీత్యా చెన్నైలో పనిచేస్తున్నానని, తనకు బాగా నచ్చావని మాటలు కలిపి రోజూ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని భరోసా కల్పిచాడు. కొద్దిరోజుల తరువాత తన కుటుంబానికి చెందిన ఆస్తులు నోట్ల రద్దు సమయంలో విక్రయించామని, వచ్చిన కోట్ల రూపాయల నగదు బ్యాంకులో ఉందని నమ్మించాడు. పెద్ద మొత్తం కావడంతో లెక్కలు చెప్పాలంటూ ఆ నగదును ఐటీ అధికారులు నిలిపివేశారని, ప్రస్తుతం అది చెన్నై కోర్టులో ఉందన్నాడు. ఐటీ అధికారులకు కొంత నగదు చెల్లించాలని, నీవద్ద ఉంటే అప్పుగా ఇస్తే తిరిగి మళ్లీ ఇస్తానని చెప్పాడు. అది నమ్మి తెలిసిన వారి వద్ద నుంచి బ్యాంకు ఉద్యోగి రూ.32 లక్షలు కార్తీక్ మేనత్త బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసింది. రోజులు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోగా, సాకులు చెప్పి తప్పించుకుంటుండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఉద్యోగి తెనాలి వెళ్లి విచారించగా అసలు విషయం బట్టబయలైంది. కార్తీక్ అసలు పేరు మహరాజ్ జానీరెక్స్ అని, అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలియడంతో మోసపోయానని గ్రహించింది. కార్తీక్ తన మేనత్త అని పరిచయం చేసి ఇచ్చిన బ్యాంక్ ఖాతా నంబరు అతని భార్యది కావడంతో ఆమె వెంటనే తెనాలి పోలీసులను ఆశ్రయించింది. తెనాలి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. నమ్మించి మోసం చేసిన కార్తీక్, అతని భార్య మహరాజ్ ప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్ పరారీలో ఉండగా, అతని భార్య మహరాజ్ ప్రియను అరెస్టు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు గతంలో కూడా అనేక మందిని మోసం చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా ఇచ్చిన నగదు తిరిగి రాకపోతే తనకు చావే శరణ్యమంటూ బ్యాంకు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
మ్యాట్రీమోనిలో పరిచయం.. మూడు వారాల చాటింగ్.. ఆ తరువాత..
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): మ్యాట్రీమోనిలో ఫేక్ ఐడీ, ఫేక్ ఫోటో పెట్టి ఓ యువతిని మోసం చేసిన నిందిదితునిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన యువతి (28) ప్రైవేట్ ఉద్యోగి. ఓ మ్యాట్రీమెని వెబ్సైట్లో ఆంథోనీ సి వర్మ అనే యువకుడి ప్రొఫైల్ చూసి నచ్చింది. అతను ప్రొఫైల్‌లో యూకేలో మెడికల్ కోర్సు చదువుతున్నట్లు ఉండటంతో అతన్ని సంప్రదించింది. ఇద్దరూ సుమారు మూడు వారాల పాటు వాట్సప్‌లో సందేశాలు పంపడం, ఫోన్లో మాట్లాడడం చేశారు. సెప్టెంబర్‌లో తాను ఇండియాకు వస్తున్నానని, రాగానే నగరానికి వచ్చి నిన్ను కలుస్తానని నమ్మబలికాడు. సదరు యువతిని నీ అడ్రస్ చెప్పు యూకే నుండి ఖరీదైన పార్సల్స్, 25 వేల పౌండ్స్ పంపుతాను అని చెప్పడంతో యువతి అడ్రస్ చెప్పింది. కొన్ని రోజులకు యువతికి ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుండి మెయిల్ చేస్తున్నామని, మీకు పార్సల్స్ వచ్చాయి పార్సల్స్ తీసుకోవాలంటే కొంతమేర నగదు చెల్లించాలని కోరడంతో యువతి పలు మార్లు తనఖాతా నుండి మొత్తం 93,250 రూపాయలు బదిలీ చేసింది.నగదు ఆ తరువాత యువకుడి నుంచి స్పందన లేకపోవడం, మ్యాట్రిమోనిలో కూడా ఆంథోనీ ప్రొఫైల్, ఐడీ అంతా తప్పు అని నిర్ధారించుకుని మొసపోయినట్లు గ్రహించి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నయవంచకుడు; రాజకుటుంబం పేరుతో యువతులకు వల
బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో మైసూరు రాజకుటుంబం బంధువునని ప్రొఫైల్స్ పెట్టుకుని యువతులను పెళ్లి పేరుతో నమ్మించి రూ.40 లక్షలు స్వాహా చేసిన సిద్ధార్థ్ అనే వంచకున్ని వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు స్మార్ట్ ఫోన్లు, పలు బ్యాంకుల డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దేవరాజ్ తెలిపారు. తన పేరు సిద్ధార్థ్ అరస్ అని, అమెరికాలో ఐటీ ఇంజనీరునని ప్రొఫైళ్లు పెట్టుకున్నాడు. ఆంగ్లం, స్పానిష్ మాట్లాడుతూ యువతులను బుట్టలో వేసుకుని ఏదో కారణంతో వారి నుంచి భారీగా డబ్బు గుంజడం ఇతని నైజం. పలువురు ఫిర్యాదు చేయడంతో మైసూరు జిల్లాలో అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు టోపీ.. ఏకంగా రూ.50 లక్షలు గోవిందా!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. ఈ మాట్రిమోనియల్ ఫ్రాడ్‌లో బాధితురాలి నుంచి దఫదఫాలుగా రూ.50 లక్షలు వసూలు చేశారు. ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు వివరాల్లోకి వెళ్తే... నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భర్త చనిపోయారు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని భావించిన ఆమె ఈ మేరకు భారత్ మాట్రిమోని సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని చూసిన సైబర్ నేరగాడు డాక్టర్ విజయానంద్ పేరుతో ఆమెను సంప్రదించాడు. వివాహం చేసుకుంటానంటూ చెప్పాడు. దీనికోసం తాను ఇటలీలో ఉన్న ఆసుపత్రిని విక్రయించి, భారత్‌కు వచ్చి స్థిరపడటానికి నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. తాను ఖరీదైన గిఫ్ట్‌లను బహుమతిగా పంపిస్తున్నానని నమ్మబలికాడు. వీటిని సంబంధించిన కొన్ని ఫొటోలను సైతం వాట్సాప్‌లో పంపాడు. దీంతో ఆమె ఇదంతా నిజమని నమ్మింది. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల పేరుతో బాధితురాలికి ఫోన్ వచ్చింది. మీ పేరుతో ఇటలీ నుంచి గిఫ్ట్ వచ్చిందంటూ అవతలి వారు చెప్పారు. అందులో యూరోలతో పాటు బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించామన్నారు. వాటిని క్లియర్ చెయ్యాలంటూ కొన్ని పన్నులు కట్టాలని ఆమెతో చెప్పారు. వీరి మాటలు నమ్మిన యువతి నుంచి రకరకాల ట్యాక్సుల పేరుతో దాదాపు రూ.50 లక్షలు వివిధ ఖాతాల్లో డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆపై వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది నైజీరియన్ల మోసంగా అధికారులు భావిస్తున్నారు. చదవండి: చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు -
అమ్మాయితో వీడియో కాల్.. లైవ్‌లో దుస్తులిప్పి..
బెంగళూరు : మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని గుడ్డిగా నమ్మి మోస పోయాడో యువకుడు. వీడియో కాల్లో దుస్తులిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. బెంగళూరు, హులిమావుకు చెందిన 33 ఏళ్ల అంబిత్ కుమార్ మిశ్రాకు కొద్దిరోజుల క్రితం మాట్రిమోనియల్ సైట్ ద్వారా శ్రేయ అనే యువతి పరిచయమైంది. తానో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని, ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేస్తున్నానని ఆమె చెప్పింది. అంబిత్‌ను పెళ్లి చేసుకోవాలన్న కోరికను ప్రకటించింది. దీంతో ఇద్దరూ ఫోన్ ద్వారా తరచూ మాట్లాడుకునే వారు. ఫిబ్రవరి 7వ తేదీన వాట్సాప్ వీడియోకాల్ చేయాల్సిందిగా శ్రేయ, అంబిత్‌ను కోరింది. దీంతో అతడు వీడియో కాల్ చేశాడు. మొదట ఇద్దరి ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. ( మాయమైపోతున్న మనిషి! ) ఆ తర్వాత ఆమె తన దుస్తులు మొత్తం తొలగించి నగ్నంగా అతడి ముందు నిలబడింది. అంబిత్‌ను కూడా దుస్తులు తీసేయమని కోరింది. ఆమె చెప్పినట్లుగానే అతడు దుస్తులు తీసేశాడు. దీన్నంతా వీడియో రికార్డింగ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో అదే రోజు 20 వేల రూపాయలు చెల్లించాడు. ఆమె అంతటితో ఆగలేదు. డబ్బుకోసం మళ్లీ, మళ్లీ ఇబ్బంది పెట్టసాగింది. ఈ నేపథ్యంలో అంబిత్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రేయపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నగరంనుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు. -
మాట్రిమోని డాక్టర్ అలా దొరికిపోయాడు
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): మాట్రిమోనియల్ సైట్లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి యువతులను మోసగించిన యువకుడిని సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లా సింగరేణి సూర్యా తండాకు చెందిన బానోతు సాయినాథ్ అలియాస్ సాయినాథ్‌రెడ్డి కరీంనగర్లో డాక్టర్ పనిచేస్తున్నానని చెప్పి మాట్రిమోనియల్ సైట్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. ఆ ప్రొఫైల్‌ను గమనించిన విశాఖకు చెందిన ఇద్దరు యువతులు అతనితో పరిచయం ఏర్పరుచుకున్నారు. వారిని పెళ్లి చేసుకుంటానని సాయినాథ్ నమ్మించాడు. తనకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి ఓ యువతి నుంచి రూ.1.05లక్షలు, మరో యువతి నుంచి రూ.50వేలు తన అకౌంట్లో వేయించుకున్నాడు. తర్వాత సాయినాథ్ అందుబాటులోకి రాకపోవడంతో యువతులు మోసపోయామని గ్రహించి గతేడాది ఆగస్టు 22న ఒకరు, డిసెంబర్ 9న మరొఒకరు సైబర్ క్రైం పోలీస్ సేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయినాథ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విచారణలో మరిన్ని మోసాలు వెలుగులోకి.. ఈ మేరకు నిందితుడిని విచారించగా విచారణలో హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని మోసగించి రెండు లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్టు తెలిపారు. అదే విధంగా బెంగళూరుకు చెందిన మరో యువతి నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు తేలిందన్నారు. -
నేరాలను గుర్తించేందుకు సెబీ వినూత్న వ్యూహాలు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడే వారిని గుర్తించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అన్ని మార్గాల్లో నుంచి సమాచారం సేకరిస్తోంది. తాజాగా ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైభవ్ ధడ్డా అనే ట్రేడరు ఆనుపానులను ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా గుర్తించింది. వైభవ్‌తో పాటు అతని కుటుంబం క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది. వివరాల్లోకి వెడితే ఫిడిలిటీ గ్రూప్‌లో పనిచేస్తున్న వైభవ్‌కు.. కీలకమైన ఆర్డర్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండేది. దీని ఆధారంగా అతను, అతని తల్లి అల్కా, సోదరి ఆరుషి ట్రేడింగ్ చేసేవారు. వైభవ్‌కి సంబంధించిన ఇతర వివరాలను సేకరించే క్రమంలో జైన్‌శుభ్‌బంధన్‌డాట్‌కామ్‌లో పొందుపర్చిన సమాచారం ఆధారంగా ఈ ముగ్గురి మధ్య బంధుత్వాన్ని సెబీ గుర్తించింది. వీరు అక్రమంగా ఆర్జించిన రూ. 1.86 కోట్ల లాభాలను 15 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమచేయాలంటూ ఆదేశించింది. నిధులను దారి మళ్లించకుండా వారి ఖాతాలను స్తంభింపచేసింది. కొన్నాళ్ల క్రితం దీప్ ఇండస్ట్రీస్ .. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఫేస్బుక్ అకౌంట్ల ఆధారంగా అనుమానితులను పట్టుకుంది సెబీ. -
మ్యాట్రిమోని సంబంధం: డాక్టర్‌నంటూ మోసం
ముంబై : పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా ముంబైకి చెందిన ఒక మహిళను వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ ఇంతలో సదరు యువతికి నకిలీ డాక్టర్‌పై అనుమానం రావడంతో అతని మోసం బయటపడింది. యువతి చెప్పిన వివరాల ప్రకారం ‘వరుడి కోసం నేను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నా వివరాలను అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. వాటిలో ఈ పాకిస్థాన్ అభ్యర్థి కూడా ఉన్నాడు. ఇతనితో నేను ఈ నెల 1 నుంచి వాట్సాప్‌లో మాట్లాడటం ప్రారంభించాను. ఈ క్రమంలో సదరు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తనను తాను ఇండియాకు చెందిన వైద్యునిగా పరిచయం చేసుకున్నాడు. ఒక కాంట్రాక్ట్‌లో భాగంగా ప్రస్తుతం లండన్‌లో పనిచేస్తున్నానని తెలిపాడు. కాంట్రాక్ట్ పూర్తవగానే ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టానన్నాడు. నేను అతని అభిరుచుల గురించి అడిగినప్పుడు సరిగ్గా స్పందించలేదు. మరి కొన్ని విషయాల్లో అతని కదలికలు కాస్తా అనుమానాస్పదంగా ఉండటంతో అతను పనిచేస్తున్న ఆస్పత్రి ఫోటోలు పంపించమని అడిగాను. ఫోటోలు చూసిన తర్వాత సదరు ఆస్పత్రికి ఫోన్ చేసి ఇతని గురించి వాకబు చేశాను. కానీ ఆస్పత్రి యాజమాన్యం అటువంటి పేరు గల వ్యక్తి ఎవరూ తమ ఆస్పత్రిలో పనిచేయడం లేదని తెలిపారు. అంతేకాక అతను పంపిన ఫోటోల్లో ఒక దాని మీద ఫోటో స్టూడియో నంబర్ ఉంది. నేను ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, నకిలీ పాక్ డాక్టర్ స్నేహితుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను అతనికి నా మీద అనుమానం రాకుండా నకిలీ డాక్టర్ వివరాలను సేకరించాను. ఫోటో స్టూడియో వ్యక్తి చెప్పిన వివరాలు విన్న తర్వాత నేను షాక్ అయ్యాను’ అన్నారు. ఫోటో స్టూడియో అతను చెప్పిన దాని ప్రకారం సదరు నకిలీ డాక్టర్ చాలా ఏళ్లుగా పాకిస్తాన్లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇంతకు ముందే వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంతే కాక ఆ వ్యక్తి గతంలో తాను డాక్టర్‌నని చెప్పి చాలా మంది మహిళలని ఇలానే మోసం చేశాడని తెలిసిందన్నారు. అనంతరం నకిలీ డాక్టర్ నాకు ఫోన్ చేసినప్పుడు అతన్ని సూటిగా పాకిస్థాన్‌లో మీది ఏ జిల్లా అని అడగ్గానే అతను ముందు కాస్తా తడబడ్డాడు. కాదని బుకాయించే ప్రయత్నం చేశాడు. చివరకూ అది కూడా కుదరకపోవడంతో నన్ను చంపుతానని బెదిరించాడు. దాంతో నేను పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. అతని మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకూ ఈ విషయాన్ని వదిలిపెట్టనని బాధిత మహిళ పేర్కొన్నారు. -
మాయ లేడీ డబుల్ యాక్షన్
• తల్లిగానూ తానే మాట్లాడింది! • కి‘లేడీ’ విచారణలో వెలుగులోకి సిటీబ్యూరో: మాట్రిమోనియల్ సైట్‌ను వేదికగా చేసుకుని, నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చెయ్యడం ద్వారా పలువురిని మోసం చేసిన బెంగళూరు వాసి శ్రీలత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసుల్ని ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆమెను సిటీకి తీసుకువచ్చిన అధికారులు కోర్టులో హాజరుపరిచారు. బెంగళూరు సమీపంలోని అత్తూరుకు చెందిన శ్రీలత నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సోదరి మరణించింది. ఇటీవల భారత్మాట్రిమోని.కామ్ సైట్లో సుస్మిత పేరుతో, అందమైన యువతి ఫొటోతో రిజిస్టర్ చేసుకున్న శ్రీలత మోసాలకు తెర లేపింది. నగరానికి చెందిన శేషు అనే యువకుడు ఆసక్తి చూపడంతో అతడితో ఫోన్లో, వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించింది. ఓ దశలో తన కుటుంబీకులు మీ కుటుంబసభ్యులతో మాట్లాడాలని శేషు కోరడంతో మరో నాటకానికి తెర లేపింది. తానే గొంతు మార్చి మాట్లాడిన శ్రీలత ‘తల్లి’గా పరిచయం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న పెళ్లి చూపులకూ ముహూర్తం ఖరారు చేసింది. అంతలో విలువైన వస్తువులు, క్రెడిట్‌కార్డ్స్, రూ.40 వేలు ఉన్న పర్సు పోయిందంటూ శేషును సంప్రదించి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయమంది. ఇలా వివిధ సందర్భాల్లో రకరకాల కారణాలు చెబుతూ ఫిబ్రవరి 2 వరకు మొత్తం రూ.1,66,500 స్వాహా చేసింది. ఆ మరుసటి రోజు నుంచే ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో పాటు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేసింది. మరోపక్క సిటీకి చెందిన తేజ అనే యువకుడితోనూ పరిచయం పెంచుకున్న శ్రీలత తమకు బంజారాహిల్స్, సిటీ శివార్లతో పాటు బెంగళూరులో పలు భవనాలు ఉన్నట్లు చెప్పింది. దాదాపు రూ.28 కోట్ల ఆస్తి తన పేరిట ఉండగా... ఇటీవల సోదరుడు చనిపోయాడని, వదిన గొడవపడి రూ.12 కోట్ల ఆస్తి పట్టుకుపోయిందని నమ్మించింది. తన తండ్రి సింగపూర్ ట్రిప్‌లో ఉన్నాడంటూ వివిధ కారణాలు చెబుతూ రూ.2.78 లక్షలు కాజేసింది. ఈ నగదును తన తండ్రితో పాటు సోదరి భర్త ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుంది. వీటితో జల్సాలు చేస్తూ పరిచయస్తులు, బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు మరో ఎత్తు వేసింది. బెంగళూరుకు చెందిన భారీ వ్యాపార సంస్థ టోటల్ మాల్లో మేనేజర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.45 వేల జీతం వస్తోందని నమ్మించింది. సిటీకి చెందిన మరో ఇద్దరు యువకులకూ ఎరవేసినప్పటికీ... కోటీశ్వరురాలినని చెబుతూ డబ్బు అడగటంతో వారు అప్రమత్తమయ్యారు. -
డాక్యుమెంట్లు పోయాయి..!
గైడ్ మా చె ల్లెలికి ఈ మధ్యనే ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో గ్రీన్‌కార్డ్ హోల్డర్. మాకు అందిన సమాచారం మేరకు మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయితే ఈ వివరాలన్నీ నిజమో కాదో ఎలా నమ్మడం? ఈ మధ్య ఎన్నారై సంబంధాల విషయంలో పలు మోసాలు జరుగుతున్నందున ఒకసారి ఎంక్వయిరీ చేయడం మంచిదేమో అనిపిస్తోంది. అందుకు ఏదైనా మార్గం ఉందా? - నిర్మల ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అమెరికాలో మీకు తెలిసినవాళ్లు, బంధువులు ఎవరైనా ఉంటే, వారితో విషయం చెప్పండి. అబ్బాయి గురించిన పూర్తి వివరాలను సేకరించమని అడగండి. ఒకవేళ అలా ఎవరూ లేకపోతే... ఎవరైనా డిటెక్టివ్‌ని మాట్లాడుకోవచ్చు. వివరాలన్నీ చెబితే వాళ్లే ఎంక్వయిరీ చేసి చెబుతారు. అయితే నిజానికి ఇలాంటి విషయాల్లో తెలిసినవారికి బాధ్యతను అప్పగించడమే మంచిదని నా ఉద్దేశం. మా తమ్ముడు ఈ మధ్యనే అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు. ఏదైనా పని దొరికితే చేద్దామన్న ఉద్దేశంతో తన సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లాడు. కానీ అనుకోకుండా అక్కడ తన పాస్‌పోర్ట్, సర్టిఫికెట్స్ ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ విషయం నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. పాస్‌పోర్ట్ లేకుండా ఆ దేశంలో ఉండటం నేరమా? వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? ఇప్పుడు వాడేం చేయాలి? సలహా ఇవ్వండి. - దీప్తి, వైజాగ్ ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. పరాయి దేశం వెళ్లినప్పుడు ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో అవసరం. మీ తమ్ముడిని వెంటనే కొత్త పాస్‌పోర్టుకి అప్లై చేయమని చెప్పండి. డాక్యుమెంట్లు పోయాయని పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని చెప్పండి. కొత్త పాస్‌పోర్ట్ వచ్చేవరకూ కూడా... పాత పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీ ఉంటే దాన్ని, వీసా పేజీని, పోలీస్ కంప్లయింట్ కాపీని, కొత్త పాస్‌పోర్ట్ కోసం పెట్టిన అప్లికేషన్ కాపీని ఎప్పుడూ తనతోనే ఉంచుకొమ్మని చెప్పండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... వీసా స్టాంపింగ్ మాత్రం అమెరికాలో చేయించుకోవడం కుదరదు. మన దేశంలోనే చేయించుకోవాలి. మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా... గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com -
పెళ్లి చేసుకుంటానని టెకీని దోచేసిన వివాహిత
హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ టెకీని మోసం చేసి 4 లక్షల రూపాయిలు టోకరా వేసిన ఓ వివాహితను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిందితురాలు వివాహప్రకటనల సైట్లో తన పేరును రాజ్యలక్ష్మిగా పేర్కొంటూ తప్పుడు ప్రొఫైల్ పోస్ట్ చేసింది. వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని, చెన్నైలోని ఓ పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానని, తగిన వరుడు సంప్రదించవచ్చని ప్రకటన ఇచ్చింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే అశోక్ రెడ్డి ఆమెను సంప్రదించాడు. ఫోన్, మెయిల్స్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. నిందితురాలు ఇద్దరు వ్యక్తులను తన తల్లిదండ్రులుగా నమ్మించి, పెళ్లికి అంగీకరిస్తున్నట్టుగా వారితో అశోక్ రెడ్డికి చెప్పించింది. ఆ తర్వాత తన ఉద్యోగవసరార్థం నాలుగు లక్షల రూపాయిలు కావాలని అశోక్ రెడ్డిని అడిగింది. అతను రెండు విడతలుగా 4.2 లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. నిందితురాలి ప్రవర్తన తేడాగా ఉండటంతో తాను మోసపోయానని అశోక్ రెడ్డి గ్రహించాడు. ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు జిల్లా కావలికి చెందిన నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరపరిచారు. ఆమె ఇంతకుముందు కూడా పెళ్లి పేరుతో మరో ఇద్దరిని మోసగించినట్టు వెలుగుచూసింది. నిందితురాలు భర్త అండతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.