![Women Cheated By Person Creating Fake Profile In Matrimonial Site - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/20/1_0.jpg.webp?itok=_gDauojG)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. ఈ మాట్రిమోనియల్ ఫ్రాడ్‌లో బాధితురాలి నుంచి దఫదఫాలుగా రూ.50 లక్షలు వసూలు చేశారు. ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు వివరాల్లోకి వెళ్తే... నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భర్త చనిపోయారు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని భావించిన ఆమె ఈ మేరకు భారత్ మాట్రిమోని సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని చూసిన సైబర్ నేరగాడు డాక్టర్ విజయానంద్ పేరుతో ఆమెను సంప్రదించాడు. వివాహం చేసుకుంటానంటూ చెప్పాడు.
దీనికోసం తాను ఇటలీలో ఉన్న ఆసుపత్రిని విక్రయించి, భారత్‌కు వచ్చి స్థిరపడటానికి నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. తాను ఖరీదైన గిఫ్ట్‌లను బహుమతిగా పంపిస్తున్నానని నమ్మబలికాడు. వీటిని సంబంధించిన కొన్ని ఫొటోలను సైతం వాట్సాప్‌లో పంపాడు. దీంతో ఆమె ఇదంతా నిజమని నమ్మింది. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల పేరుతో బాధితురాలికి ఫోన్ వచ్చింది.
మీ పేరుతో ఇటలీ నుంచి గిఫ్ట్ వచ్చిందంటూ అవతలి వారు చెప్పారు. అందులో యూరోలతో పాటు బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించామన్నారు. వాటిని క్లియర్ చెయ్యాలంటూ కొన్ని పన్నులు కట్టాలని ఆమెతో చెప్పారు. వీరి మాటలు నమ్మిన యువతి నుంచి రకరకాల ట్యాక్సుల పేరుతో దాదాపు రూ.50 లక్షలు వివిధ ఖాతాల్లో డిపాజిట్/ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆపై వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది నైజీరియన్ల మోసంగా అధికారులు భావిస్తున్నారు.
చదవండి: చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
Comments
Please login to add a commentAdd a comment