Matru Devo Bhava
-
విడుదలకు సిద్ధమైన 'మాతృదేవోభవ'.. ఎప్పుడంటే ?
Matru Devo Bhava 2022 Movie Ready To Release In July: 1993లో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా ఏ రేంజ్లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ఆడియన్స్ నీరాజనం పలికారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత థియేటర్స్‌లోనే కన్నీళ్లు పెట్టించాయి. సంవత్సరాల తరబడి ఈ సినిమా థియేటర్స్‌లో ఆడటమే గాక ప్రతి ఒక్క ఫ్యామిలీని సినిమా హాలుకు తీసుకొచ్చింది. అయితే ఇన్నేళ్లకు మళ్లీ అదే రకమైన సెంటిమెంట్ కంటెంట్‌తో 'మాతృదేవోభవ' టైటిల్‌తో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం 'మాతృదేవోభవ'. దీనికి ఓ అమ్మ కథ అనేది ట్యాగ్ లైన్. బలమైన ఫ్యామిలీ సబ్జెక్టుతో జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కథాంశంతో ఎమోషనల్ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎంఎస్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన సెంటిమెంట్ ప్రధానంగా రాబోతున్న ఈ చిత్రానికి కెజెఎస్ రామా రెడ్డి కథ అందించగా చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మారుధూరి రాజా డైలాగ్స్ రాశారు. డైమండ్ వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరాం, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలో సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి లాంటి ప్రఖ్యాత తారాగణం నటించడం విశేషం. -
ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటా: సుధ
సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘మాతృ దేవోభవ’. ‘ఓ అమ్మ కథ’ ఉపశీర్షిక. పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి ïహీరో హీరోయిన్లు. కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వంలో చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. ‘‘ఇది నా సినిమా అని నేను గర్వంగా చెప్పుకునేలా ‘మాతృ దేవోభవ’ ఉంటుంది.ఫస్ట్ టైమ్ డైరెక్టర్ హరనాధ్ రెడ్డి, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది. ఇందులో నటించిన, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన "మాతృదేవోభవ" మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు. నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ... "మాతృదేవోభవ" వంటి మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నామని, సుధ గారి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుందని, ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా "మాతృదేవోభవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. హీరో పతంజలి శ్రీనివాస్, ముఖ్యపాత్రధారులు జెమిని సురేష్, చమ్మక్ చంద్ర, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ... "మాతృదేవోభవ" సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
యువతరం మెచ్చే అంశాలతో ‘మాతృదేవోభవ’
శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మాతృదేవోభవ’. 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే బ్రతికి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తికి పిల్లల వల్ల ఎదురైన చేదు సంఘటనల సమాహారమే మా "మాతృదేవోభవ". సుధ గారి అభినయం, మరుదూరి రాజా సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి చాలా బాగా చేశారు. యువతరం మెచ్చే అంశాలు కూడా "మాతృదేవోభవ"లో పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయిస్తాం. మా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరావు గారికి చక్కని శుభారంభం ఇచ్చే చిత్రమవుతుంది" అన్నారు. సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి. -
సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి
సాక్షి, పెనుగొండ: సినిమాలు సందేశాత్మకంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీవాసవీ మూవీస్ బ్యానర్లో కె.హరనాథ్‌రెడ్డి దర్శకత్వంలో సీహెచ్ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ‘మాతృదేవోభవ’ ఓ అమ్మ కథ చిత్రం షూటింగ్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు బుధవారం వాసవీ శాంతిధాంలో పూజా కార్యక్రమాల అనంతరం క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. సితార, సుమన్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సూర్య, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ, జెమిని సురేష్, రవిప్రకాష్, చమ్మక్ చంద్ర, జబర్దస్త్ అప్పారావు, సత్యశ్రీ, సోనియా చౌదరి ప్రధాన తారాగణం. పతంజలి శ్రీనివాస్ సమర్పిస్తుండగా కథను సితారే కేజేఎస్ రామారెడ్డి, మాటలు మరుధూరి రాజా, పాటలు అనంత శ్రీరామ్, డీఓపీ రామ్‌కుమార్, సంగీతం జయసూర్య సమకూరుస్తున్నారు. పైట్స్ డ్రాగన్ ప్రకాశ్ చేస్తున్నారు. ఈ సదర్భంగా దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ, ఆవు ప్రాముఖ్యాన్ని చాటిచెబుతూ కథాంశం ఉంటుందన్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూలు తణుకు పరిసరాల్లో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్, వైజాగ్, కర్ణాటకల్లో మిగిలిన షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. -
విషాదరాగంలో వాడని సిగపూవు...
అమ్మ.. తను వత్తిలా కాలిపోతూ పిల్లలకు వెలుగునిస్తుంది. తను శిధిలమైపోతూ వసంతాన్ని పంచుతుంది. ఇప్పటివరకూ అమ్మ కథలతో చాలా సినిమాలొచ్చాయి. ఇంతలా ఏడిపించిన సినిమా మాత్రం లేదు. అమ్మ కొంగులో దాగిన కన్నీటి సంద్రం ‘మాతృదేవోభవ’. ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా ఓ రివైండ్... సినిమా చూసి అదిరిపోయాడు అజయ్‌కుమార్. హృదయం ద్రవించుకుపోవడం అంటారే... అదే ఫీలింగ్. ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా అది. ‘హూ విల్ లవ్ మై చిల్డ్రన్?’. జాన్ ఎర్మాన్ డెరైక్ట్ చేసిన సినిమా. తల్లికి కేన్సర్ వస్తుంది. పదిమంది పిల్లల బతుకేం కావాలి? పట్టించుకోని భర్త. అనాథల్లా వదిలేయలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో గూడు చూపించాలి. చివరిక్షణం వరకూ అదే తపన. ఎట్టకేలకు సాధిస్తుంది. తృప్తిగా కన్ను మూస్తుంది. నిజంగా జరిగిన కథ ఇది. దాన్నే హాలీవుడ్లో తీశారు. దాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ఓ సినిమా చేద్దామనుకున్నారు నిర్మాత కేఎస్ రామారావు. అభిలాష, ఛాలెంజ్‌లాంటి సూపర్హిట్లు తీసిన నిర్మాత ఆయన. అజయ్ కుమార్‌ని ‘కొంగుచాటు కృష్ణుడు’తో దర్శకుణ్ణి చేసింది ఆయనే. అతని రెండో సినిమా కోసమే ఈ కసరత్తులు.స్క్రిప్టు పని మొదలైంది. సత్యమూర్తి సంభాషణలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడే ఓ బాంబు పేలింది. ఆల్రెడీ ఇదే కథతో జయసుధను పెట్టి సీనియర్ దర్శకుడు పీసీ రెడ్డి, ‘కాల చక్రం’ అనే సినిమా చేస్తున్నారు. చాలామటుకు షూటింగ్ అయిపోయిందట కూడా. ఇప్పుడేం చేయాల్రా దేవుడా అని తలపట్టుకున్నాడు అజయ్‌కుమార్. అలాంటి పరిస్థితుల్లో కేఎస్ రామారావుకి ఓ వార్త తెలిసింది. మలయాళంలో ‘అక్ష దూత్’ అనే సినిమా పెద్ద హిట్టయ్యిందట. దానిక్కూడా మాతృక ఆ హాలీవుడ్ సినిమానే. మన తెలుగమ్మాయి మాధవి హీరోయిన్గా చేసింది. ఆ రైట్స్ కొనేసి తీస్తే తంటానే ఉండదు కదా అనుకుని రైట్స్ కొనుక్కొచ్చేశారు.అదే సమయంలో కేఎస్ రామారావు ‘అంగరక్షకుడు’ సినిమా తీస్తున్నారు. రాజశేఖర్ హీరో. రెగ్యులర్‌గా లొకేషన్‌కి వస్తుండేవారు జీవిత. వారిద్దరికీ ఆ కథ వినిపించి మీ ఇద్దరూ చేస్తే బావుంటుందన్నారు కేఎస్ రామారావు. పెళ్లయ్యాక నేను నటించకూడదని నిర్ణయించుకున్నా అని జీవిత నిరాకరించారు.ఒరిజినల్ వెర్షన్లో చేసిన మాధవినే తీసుకున్నారు. మరి మాధవి భర్త పాత్రకు ఎవరిని తీసుకోవాలి? కేఎస్ రామారావుని ఆ పాత్ర చేయమంటే ఒప్పుకోలేదు. ఫైనల్‌గా నాజర్‌ను తీసుకున్నారు. అప్పుడు కీరవాణి హవా నడుస్తోంది. పెద్ద సినిమాలన్నింటికీ ఆయనే సంగీత దర్శకుడు. మరి ఆయన ఇంత చిన్ని సినిమా చేస్తారా? ఓసారి రిక్వెస్ట్ చేద్దామని అజయ్ కుమార్ బయలుదేరాడు. మద్రాసులోని ఏవీయం స్టూడియోలో పని పూర్తి చేసుకుని, కారులో బెంగళూరు వెళ్లడానికి కీరవాణి సిద్ధమవుతున్నారు. ‘ఓ ఐదు నిమిషాలు మాట్లాడాలి’ అని చెప్పి పక్కకు తీసుకెళ్లి కథ చెప్పేశారు అజయ్‌కుమార్. కీరవాణి వెంటనే ‘‘ఈ సినిమా నేనే చేస్తున్నాను’’ అని చెప్పి, అప్పటికప్పుడు రెండు బాణీలు కూడా కట్టేసి, వేటూరికి పంపించేశారు.హైదరాబాద్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని నర్సాపూర్‌లో ఎన్సీఎల్ ఫారమ్స్ ఆవరణలో ఓ ఇంటి సెట్ వేశారు. 1993 జూలై 1 నుంచి ఆగస్టు 19 వరకూ ఏకధాటిగా షూటింగ్. 37 లక్షల ఖర్చుతో సినిమా రెడీ! 1993 ఆక్టోబర్ 22న సినిమా రిలీజ్. ఓ థియేటర్లో 10 టికెట్లు. ఇంకో థియేటర్లో 15 టికెట్లు. టోటల్‌గా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. చూసినవాళ్లంతా బావుందంటున్నారు. కానీ చూసేవాళ్లే కరవు. వారం గడిచింది. థియేటర్ యజమానులకు రిజల్ట్ తెలిసి పోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్. గట్టెక్కడం కష్టం. కేఎస్ రామారావుకి ఫోన్ చేశారు. ఆయన మాత్రం స్టడీగా ఉన్నాడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ‘‘ఏం ఫర్లేదు... ఇంకో రెండు వారాలు చూద్దాం. మీ నష్టానికి నాదీ భరోసా. ఇక నుంచి ప్రతి షోకి టిక్కెట్‌తో పాటు ఒక కర్చీఫ్ ఉచితంగా ఇవ్వండి’’ అన్నారు.ఎవరికీ ఏం అర్థం కాలేదు. చివరకు సినిమా చూడ్డానికొచ్చిన వాళ్లక్కూడా. ‘కర్చీఫ్ మేమేం చేసుకోం’ అన్నారు. కానీ లోపలికెళ్లాక అర్థమైంది అందరికీ. మనసుకు గండి పడింది. ఒకటే కన్నీళ్ల వరద. ఒక్క కర్చీఫ్ చాలడం లేదు. ఇలా మెల్లిమెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సంగీతం, సాహిత్యం, ఛాయాగ్రహణం, సంభాషణలు, అభినయం అన్నీ కూడబలుక్కుని మరీ మనసుని బరువెక్కించేసి కన్నీళ్లు పెట్టించేశాయి. ఇందులో మాధవిని తప్ప మరెవ్వరినీ ఊహించలేం. ఇక ఎక్కడ చూసినా హిట్ టాక్. కట్ చేస్తే... 6 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్. గ్రాండ్ ఫంక్షన్. శోభన్‌బాబు, నాగార్జున, జయప్రద, జయసుధ ముఖ్య అతిథులు. ఇలాంటి కథతో ‘పితృదేవోభవ’ తీస్తే పారితోషికం లేకుండా యాక్ట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు శోభన్‌బాబు. ‘అయ్యో, నాజర్ పాత్ర నేను చేయాల్సిందే’ అని రాజశేఖర్ వాపోయారు. అవార్డులకూ కొదవ లేదు. తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు. ఇవన్నీ కాదు గానీ, ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో’ పాట రాసిన వేటూరికి ఉత్తమ సినీ గీత రచయితగా నేషనల్ అవార్డ్. శ్రీశ్రీ తర్వాత ఓ తెలుగు కవికి దక్కిన జాతీయస్థాయి గుర్తింపు.ఈ సినిమా చూడండి. అమ్మ మనసు తెలుస్తుంది. కన్నీళ్ల విలువ తెలుస్తుంది. అను బంధాల అనువాదం తెలుస్తుంది. గడ్డకట్టిన విషాదపు లోతు తెలుస్తుంది. రాలిపోయే పువ్వు పలికే రాగాల మూగ వేదన తెలుస్తుంది. - శ్రీబాబు ‘‘మలయాళంలో క్రైస్తవ నేపథ్యం ఉంటుంది. మేం అదంతా మార్చేశాం. ప్రారంభంలో రెండు, మూడు దృశ్యాలు మినహా సినిమా మొత్తం విషాదభరిత వాతావరణంలోనే నడుస్తుంది. నేనిప్పటి వరకూ 15 సినిమాలు డెరైక్ట్ చేశాను. కానీ నాకు ఈ సినిమానే ఇంటిపేరు అయిపోయింది. ఈ చిత్రం క్రెడిట్ మొత్తం కేఎస్ రామారావుదే. హిందీలో మనీషా కొయిరాలాతో ‘తులసి’గా నేనే రీమేక్ చేశా’’. - అజయ్‌కుమార్, దర్శకుడు