విషాదరాగంలో వాడని సిగపూవు... | Matru Devo Bhava Mother's Day During a rewind | Sakshi
Sakshi News home page

విషాదరాగంలో వాడని సిగపూవు...

Published Sat, May 10 2014 10:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

విషాదరాగంలో వాడని సిగపూవు...

విషాదరాగంలో వాడని సిగపూవు...

అమ్మ.. తను వత్తిలా కాలిపోతూ పిల్లలకు వెలుగునిస్తుంది. తను శిధిలమైపోతూ వసంతాన్ని పంచుతుంది. ఇప్పటివరకూ అమ్మ కథలతో చాలా సినిమాలొచ్చాయి. ఇంతలా ఏడిపించిన సినిమా మాత్రం లేదు. అమ్మ కొంగులో దాగిన కన్నీటి సంద్రం ‘మాతృదేవోభవ’. ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా ఓ రివైండ్... సినిమా చూసి అదిరిపోయాడు అజయ్‌కుమార్. హృదయం ద్రవించుకుపోవడం అంటారే... అదే ఫీలింగ్. ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా అది. ‘హూ విల్ లవ్ మై చిల్డ్రన్?’. జాన్ ఎర్మాన్ డెరైక్ట్ చేసిన సినిమా. తల్లికి కేన్సర్ వస్తుంది. పదిమంది పిల్లల బతుకేం కావాలి? పట్టించుకోని భర్త. అనాథల్లా వదిలేయలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో గూడు చూపించాలి. చివరిక్షణం వరకూ అదే తపన. ఎట్టకేలకు సాధిస్తుంది. తృప్తిగా కన్ను మూస్తుంది. నిజంగా జరిగిన కథ ఇది.
 
 దాన్నే హాలీవుడ్‌లో తీశారు. దాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ఓ సినిమా చేద్దామనుకున్నారు నిర్మాత కేఎస్ రామారావు. అభిలాష, ఛాలెంజ్‌లాంటి సూపర్‌హిట్లు తీసిన నిర్మాత ఆయన. అజయ్ కుమార్‌ని ‘కొంగుచాటు కృష్ణుడు’తో దర్శకుణ్ణి చేసింది ఆయనే. అతని రెండో సినిమా కోసమే ఈ కసరత్తులు.స్క్రిప్టు పని మొదలైంది. సత్యమూర్తి సంభాషణలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడే ఓ బాంబు పేలింది. ఆల్రెడీ ఇదే కథతో జయసుధను పెట్టి సీనియర్ దర్శకుడు పీసీ రెడ్డి, ‘కాల చక్రం’ అనే సినిమా చేస్తున్నారు. చాలామటుకు షూటింగ్ అయిపోయిందట కూడా. ఇప్పుడేం చేయాల్రా దేవుడా అని తలపట్టుకున్నాడు అజయ్‌కుమార్. అలాంటి పరిస్థితుల్లో కేఎస్ రామారావుకి ఓ వార్త తెలిసింది.
 
  మలయాళంలో ‘అక్ష దూత్’ అనే సినిమా పెద్ద హిట్టయ్యిందట. దానిక్కూడా మాతృక ఆ హాలీవుడ్ సినిమానే. మన తెలుగమ్మాయి మాధవి హీరోయిన్‌గా చేసింది. ఆ రైట్స్ కొనేసి తీస్తే తంటానే ఉండదు కదా అనుకుని రైట్స్ కొనుక్కొచ్చేశారు.అదే సమయంలో కేఎస్ రామారావు ‘అంగరక్షకుడు’ సినిమా తీస్తున్నారు. రాజశేఖర్ హీరో. రెగ్యులర్‌గా లొకేషన్‌కి వస్తుండేవారు జీవిత. వారిద్దరికీ ఆ కథ వినిపించి మీ ఇద్దరూ  చేస్తే బావుంటుందన్నారు కేఎస్ రామారావు. పెళ్లయ్యాక నేను నటించకూడదని నిర్ణయించుకున్నా అని జీవిత నిరాకరించారు.ఒరిజినల్ వెర్షన్‌లో చేసిన మాధవినే తీసుకున్నారు. మరి మాధవి భర్త పాత్రకు ఎవరిని తీసుకోవాలి? కేఎస్ రామారావుని ఆ పాత్ర చేయమంటే ఒప్పుకోలేదు. ఫైనల్‌గా నాజర్‌ను తీసుకున్నారు.
 అప్పుడు కీరవాణి హవా నడుస్తోంది. పెద్ద సినిమాలన్నింటికీ ఆయనే సంగీత దర్శకుడు.
 
  మరి ఆయన ఇంత చిన్ని సినిమా చేస్తారా? ఓసారి రిక్వెస్ట్ చేద్దామని అజయ్ కుమార్ బయలుదేరాడు. మద్రాసులోని ఏవీయం స్టూడియోలో పని పూర్తి చేసుకుని, కారులో బెంగళూరు వెళ్లడానికి కీరవాణి సిద్ధమవుతున్నారు. ‘ఓ ఐదు నిమిషాలు మాట్లాడాలి’ అని చెప్పి పక్కకు తీసుకెళ్లి కథ చెప్పేశారు అజయ్‌కుమార్. కీరవాణి వెంటనే ‘‘ఈ సినిమా నేనే చేస్తున్నాను’’ అని చెప్పి, అప్పటికప్పుడు రెండు బాణీలు కూడా కట్టేసి, వేటూరికి పంపించేశారు.హైదరాబాద్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని నర్సాపూర్‌లో ఎన్‌సీఎల్ ఫారమ్స్ ఆవరణలో ఓ ఇంటి సెట్ వేశారు. 1993 జూలై 1 నుంచి ఆగస్టు 19 వరకూ ఏకధాటిగా షూటింగ్. 37 లక్షల ఖర్చుతో సినిమా రెడీ! 1993 ఆక్టోబర్ 22న సినిమా రిలీజ్. ఓ థియేటర్‌లో 10 టికెట్లు. ఇంకో థియేటర్‌లో 15 టికెట్లు. టోటల్‌గా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. చూసినవాళ్లంతా బావుందంటున్నారు. కానీ చూసేవాళ్లే కరవు.
 
 వారం గడిచింది. థియేటర్ యజమానులకు రిజల్ట్ తెలిసి పోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్. గట్టెక్కడం కష్టం. కేఎస్ రామారావుకి ఫోన్ చేశారు. ఆయన మాత్రం స్టడీగా ఉన్నాడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ‘‘ఏం ఫర్లేదు... ఇంకో రెండు వారాలు చూద్దాం. మీ నష్టానికి నాదీ భరోసా. ఇక నుంచి ప్రతి షోకి టిక్కెట్‌తో పాటు ఒక కర్చీఫ్ ఉచితంగా ఇవ్వండి’’ అన్నారు.ఎవరికీ ఏం అర్థం కాలేదు. చివరకు సినిమా చూడ్డానికొచ్చిన వాళ్లక్కూడా. ‘కర్చీఫ్ మేమేం చేసుకోం’ అన్నారు. కానీ లోపలికెళ్లాక అర్థమైంది అందరికీ. మనసుకు గండి పడింది. ఒకటే కన్నీళ్ల వరద. ఒక్క కర్చీఫ్ చాలడం లేదు.
 
 ఇలా మెల్లిమెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సంగీతం, సాహిత్యం, ఛాయాగ్రహణం, సంభాషణలు, అభినయం అన్నీ కూడబలుక్కుని మరీ మనసుని బరువెక్కించేసి కన్నీళ్లు పెట్టించేశాయి. ఇందులో మాధవిని తప్ప మరెవ్వరినీ ఊహించలేం. ఇక ఎక్కడ చూసినా హిట్ టాక్. కట్ చేస్తే... 6 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్. గ్రాండ్ ఫంక్షన్. శోభన్‌బాబు, నాగార్జున, జయప్రద, జయసుధ ముఖ్య అతిథులు. ఇలాంటి కథతో ‘పితృదేవోభవ’ తీస్తే పారితోషికం లేకుండా యాక్ట్ చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు శోభన్‌బాబు. ‘అయ్యో, నాజర్ పాత్ర నేను చేయాల్సిందే’ అని రాజశేఖర్ వాపోయారు.
 
 అవార్డులకూ కొదవ లేదు. తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు. ఇవన్నీ కాదు గానీ, ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో’ పాట రాసిన వేటూరికి ఉత్తమ సినీ గీత రచయితగా నేషనల్ అవార్డ్. శ్రీశ్రీ తర్వాత ఓ తెలుగు కవికి దక్కిన జాతీయస్థాయి గుర్తింపు.ఈ సినిమా చూడండి. అమ్మ మనసు తెలుస్తుంది. కన్నీళ్ల విలువ తెలుస్తుంది. అను బంధాల అనువాదం తెలుస్తుంది. గడ్డకట్టిన విషాదపు లోతు తెలుస్తుంది. రాలిపోయే పువ్వు పలికే రాగాల మూగ వేదన తెలుస్తుంది.
 - శ్రీబాబు
 
 ‘‘మలయాళంలో క్రైస్తవ నేపథ్యం ఉంటుంది. మేం అదంతా మార్చేశాం. ప్రారంభంలో రెండు, మూడు దృశ్యాలు మినహా సినిమా మొత్తం విషాదభరిత వాతావరణంలోనే నడుస్తుంది.  నేనిప్పటి వరకూ 15 సినిమాలు డెరైక్ట్ చేశాను. కానీ నాకు ఈ సినిమానే ఇంటిపేరు అయిపోయింది. ఈ చిత్రం క్రెడిట్ మొత్తం కేఎస్ రామారావుదే. హిందీలో మనీషా కొయిరాలాతో ‘తులసి’గా నేనే రీమేక్ చేశా’’.
 - అజయ్‌కుమార్, దర్శకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement