కామన్వెల్త్ గేమ్స్ : మౌసమ్ ఖత్రీకి రజతం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించాడు. తొమ్మిదిరోజు పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో ఖత్రీ ఓటమి పాలై రజతంతో సంతృప్తి చెందాడు. పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్టిన్ ఎరాస్మస్ చేతిలో 12-2 తేడాతో ఖత్రీ పరాజయం చెందాడు.
క్వార్టర్ ఫైనల్లో సెప్రస్ అలెక్సియోస్, సెమీ ఫైనల్లో సోసో తామారౌలను ఓడించి ఫైనల్‌కు చేరిన ఖత్రీ.. తుది పోరులో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ప్రత్యర్థి ఎరాస్మస్కు లొంగిపోయిన ఖత్రీ రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. 2010 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఖత్రీ.. గతేడాది జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతాన్ని సాధించాడు. ఇదిలా ఉంచితే, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకూ భారత్ 39 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 10 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి.