mausoleum
-
నిజాలు సమాధి చేయబోయి.. చివరికి తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ..
సాక్షి, ధర్మవరం: హిందూముస్లింల ఐక్యతకు, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ధర్మవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అలజడులు సృష్టించాలని పన్నాగం పన్నారు. తన స్వార్థం కోసం కబరస్తాన్‌ను పావుగా వాడుకున్నారు. పట్టణంలోని మసీదు, అంజుమన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగే అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై బురద జల్లాలని ప్రయత్నించారు. అసలేం జరిగిందంటే.. ధర్మవరం ఇందిరానగర్‌లో ముస్లింల కబరస్తాన్ ఉంది. దానికి ఆనుకునే ఎగువ భాగంలో పెద్ద డ్రైనేజీ ఉంది. దీంతో మురుగునీరు తరచూ కబరస్తాన్లోకి వచ్చి చేరుతుండగా, సమాధులన్నీ మునిగిపోతున్నాయి. దీనికి తోడు స్థలం తక్కువగా ఉండటంతో కబరస్తాన్ పూర్తిగా సమాధులతో నిండిపోయింది. దీంతో ముస్లింలు ఎవరైన చనిపోతే ...వారి అంత్యక్రియలను పట్టణానికి 6 కి.మీ దూరంలోని ఈద్గా మైదానంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం కోసం చర్యలు.. కబరస్తాన్‌లో మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు వసతులు కల్పించేందుకు గత అక్టోబర్‌లో.. జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు సమావేశం నిర్వహించారు. కబరస్తాన్‌ను పునర్ నిర్మించాలని 40 మసీదులకు చెందిన ముతవల్లీలు ఆమోదించి తీర్మానం చేశారు. అందులో భాగంగా కబరస్తాన్లోని సమాధులను తొలగించి మైదానం మొత్తం 4 అడుగులకుపైగా మట్టితో ఎత్తు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అభ్యంతరాలకు రెండు నెలల సమయం తీసుకున్నారు. అందుకు గడువు కూడా ముగియడం, ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో 3 రోజుల క్రితమే మసీదు కమిటీలు, అంజుమన్ కమిటీల ఆధ్వర్యంలో మత పెద్దలు, దాతల సహకారంతో పనులను ప్రారంభించారు. పరిటాల శ్రీరామ్ రంగ ప్రవేశంతో రాజకీయ రంగు కబరస్తాన్ పునరి్నర్మాణ పనులు ప్రశాంతంగా సాగిపోతుండగా... గురువారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వాటి గురించి తెలుసుకున్నారు. స్థానికంగా నివాసం లేని ఆయన...నిజానిజాలు తెలుసుకోకుండా కబరస్తాన్‌లో సమాధులను ఏక పక్షంగా తొలగిస్తున్నారని, ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. దీనిపై ముస్లిం మత పెద్దలంతా స్పందించారు. కబరస్తాన్ పునర్ నిర్మాణ పనులన్నీ తమ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, దానికి రాజకీయ రంగు పులమడం అన్యాయమన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దని రాజకీయ పారీ్టల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి ఆమోదంతోనే పనులు.. ర్మవరంలోని అన్ని మసీదు కమిటీలతో చర్చించి 40 మంది ముతవల్లీల ఆమోదంతోనే కబరస్తాన్ పునరి్నర్మాణ పనులు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. రాజకీయ పారీ్టల నాయకులు ఇందులో జోక్యం చేసుకోకూడదు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే మేము చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాం. – ముస్తాక్ అహ్మద్, ముతవల్లి, జామియా మసీదు, ధర్మవరం. రాజకీయం చేయొద్దు ఇస్లాం సంప్రదాయంలో కబరస్తాన్ల పునర్నిర్మాణం కొత్తేమీ కాదు. గతంలో అనంతపురంలోని ఈద్గాలో, బత్తలపల్లి కబరస్తాన్, హిందూపురంలోనూ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ధర్మవరంలోనూ అందరి ఆమోదంతోనే ముస్లింలతా కలసికట్టుగా దాతల సహకారంతో కబరస్తాన్‌ను పునర్నిర్మిస్తున్నాం. వీటిని రాజకీయం చేయవద్దు. – జాకీర్, ముతవల్లి, మదీనా మసీదు, ధర్మవరం ఐక్యతను దెబ్బతీయొద్దు కబరస్తాన్ పునర్ నిర్మాణం పవిత్ర కార్యం. ఇందులో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోకూడదు. అంజుమన్ కమిటీ, మతపెద్దలు, మసీదు కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. ప్రతి ముస్లిం ఈ పనుల్లో భాగస్వామిగా ఉంటాడు. ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దు. – స్టార్ ఖలీల్, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు, ధర్మవరం గీత దాటితే చర్యలు కబరస్తాన్ పునర్ నిర్మాణం సున్నితమైన అంశం. ఏ ఒక్కరూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు. ఈ విషయంపై ఇప్పటికే ముస్లిం మత పెద్దలందరితో చర్చించాం. కబరస్తాన్ పునరి్నర్మాణంలో ఎవరికైనా సందేహాలుంటే మత పెద్దల ద్వారా నివృత్తి చేసుకోవాలి. చట్టపరిధి దాటి సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేసినా, భావోద్వేగాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు. – సుబ్రమణ్యం, వన్‌టౌన్ సీఐ, ధర్మవరం -
శ్మశానాలను తవ్వేసి.. భారీ భవంతులు
శాన్‌మార్కోస్ (యూఎస్): ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు భూమి విస్తీర్ణం మాత్రం పరిమితం. అందుబాటులో ఉన్న భూమితోనే అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి సైతం స్థలం దొరకడం లేదు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సింగపూర్‌లో పాత శ్మశానాలను తవ్వేసి, భారీ భవంతులు కట్టేస్తున్నారు. కొత్త శ్మశానాలను ఏర్పాటు చేయకపోవడం, స్థలం కొరత వల్ల అంత్యక్రియల విషయంలో ఆచారాలను సైతం మార్చుకోవాల్సి వస్తోంది. శ్మశానాల కోసం దొరకని స్థలం అగ్రరాజ్యం అమెరికాలోనూ శ్మశానాల కోసం స్థలం దొరకడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింగపూర్‌లో ప్రభుత్వం శ్మశానాల స్థానంలో కొలంబరియ్స్ నెలకొల్పుతోంది. ఒక ఎత్తయిన గోడ లాంటిది కట్టి, మధ్యలో గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మృతుల అస్థికలతో కూడిన కలశాలను ఈ గూళ్లలో ఉంచుతున్నారు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఇక్కడే ప్రార్థనలు చేసుకోవాలి. సింగపూర్‌లో ఒక మృతదేహాన్ని 15 ఏళ్ల పాటే శ్మశానంలో ఖననం చేయాలి. తర్వాత వెలికి తీసి, దహనం చేయాలి. అస్థికలను కలశాల్లో భద్రపర్చుకోవచ్చు. అదే స్థలంలో మరో మృతదేహాన్ని ఖననం చేస్తారు. దహనాలకే ప్రాధాన్యం: హాంకాంగ్‌లో భూముల విలువ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్థలాలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతుంటాయి. శ్మశానాల్లో పార్థివ దేహాల ఖననానికి అవసరమైన స్థలాలను ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. అందుకే హాంకాంగ్ ప్రభుత్వం ఖననం కంటే దహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామాలకు తరలిపోదాం: వృద్ధుల జనాభా పెరిగి, జననాలు తక్కువగా ఉన్న జపాన్‌లో సైతం శ్మశానాల కొరత 1970ల నుంచే మొదలైంది. అందుకే అక్కడి అధికారులు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు. నగరంలో ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులు, బంధు మిత్రులు ఒక బస్సులో మృతదేహంతోపాటు యాత్రగా బయలుదేరుతారు. గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు. జపాన్‌లో 1990ల్లో ‘గ్రేవ్–ఫ్రీ ప్రమోషన్ సొసైటీ’ అనే సంస్థ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మృతదేహాన్ని దహనం చేసి, బూడిదను భూమిపై వెదజల్లాలని ప్రచారం చేసింది. అయితే, ఈ విధానం ఆదరణ పొందలేదు. వృక్ష సమాధితో పర్యావరణ పరిరక్షణ ఉత్తర జపాన్‌లోని షౌన్‌జీ టెంపుల్ 1999 నుంచి నవీన ఆవిష్కరణకు తెరతీసింది. అదేమిటంటే.. వృక్ష సమాధి(ట్రీ బరియల్). దీన్ని జపాన్ భాషలో జుమొకుసో అంటారు. ఇందులో శవాన్ని దహనం చేస్తారు. అస్థికలు, బూడిదను ఒకచోట భూమిలో పాతిపెట్టి, దానిపై మొక్క నాటుతారు. అదే ఆ మనిషి సమాధి. అది వృక్షంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఏటా అక్కడే ప్రార్థనలు చేస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతి అని షౌన్‌జీ టెంపుల్ చెబుతోంది. ప్రభుత్వం అనుమతించిన చోట ఒక వృక్ష సమాధి ఏర్పాటయ్యాక క్రమంగా ఇతరులూ అదే తరహా సమాధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాతి కాలంలో అదొక పెద్ద వనంగా మారుతోంది. ఇలా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతోందని నిపుణులు అభినందిస్తున్నారు. షౌన్‌జీ టెంపుల్‌కు చెందిన స్థలంలో చిషోయిన్ పేరిట వృక్ష సమాధులతో ఒక చిట్టడవి ఏర్పడింది. ఈ శ్మశానంలో కేవలం పెద్దపెద్ద చెట్లే కనిపిస్తాయి. రాళ్లు, సమాధులు గుర్తులు కనిపించవు. మృతుల కుటుంబ సభ్యులు, మత గురువులు ఈ చెట్ల వద్ద ప్రార్థనలు చేస్తారు. సాధారణంగా బౌద్ధులు పర్యావరణ పరిరక్షణను ఆచారంగా పాటిస్తారు. సహజ ప్రకృతి ప్రపంచంలోనే దేవుడుంటాడని నమ్ముతారు. అందుకే ట్రీ బరియల్స్కు జపాన్‌లో ఆదరణ పెరుగుతోంది. చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం చదవండి: కోవిడ్ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్ టాప్ -
మహా సమాధి దర్శనానికే భక్తులకు అనుమతి
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం నుంచి సాయికుల్వంత్ మందిరంలో భజనలు, సంగీత కచేరీ, వేద పఠనం పూర్తిగా నిలిపేస్తున్నట్టు చెప్పారు. అయితే మంగళహారతి అనంతరం ఉదయం 9.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటల తర్వాత భౌతిక దూరం పాటిస్తూ క్యూలో వెళ్లి మహాసమాధిని దర్శించుకుని బయటకు వెళ్లిపోవాలని తెలిపారు. భక్తులంతా విధిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని రత్నాకర్ సూచించారు. -
మరోసారి వివాదంలో సీఎం యోగి ఆధిత్యనాథ్
-
‘నాకు టోపీ పెట్టకండి’
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి విపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించారు. హిందుత్వకి మారుపేరుగా చెప్పుకునే యోగి.. మఘర్‌లో ఉన్న ప్రసిద్ధ ప్రవక్త, కవి కబీర్ సమాధిని సందర్శించడానికి వెళ్లినప్పుడు ముస్లింలు ధరించే టోపీ / పగడీ ధరించడానికి నిరాకరించి విపక్షాలకు పని కల్పించారు. వివరాల ప్రకారం గురువారం(నేడు) కబీర్ ప్రవక్త 500వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ మఘర్‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు యోగినే స్వయంగా మఘర్‌కు వెళ్లారు. ఆ సయంలో సమాధి నిర్వహకుడు ముస్లింలు ధరించే టోపీని యోగి తలపై పెట్టడానికి ముందుకు వచ్చాడు. కానీ టోపీ ధరించడానికి ఇష్టపడక వద్దని సున్నితంగా యోగి వారించారు. ముఖ్యమంత్రి చర్యను విపక్షాలు విమర్శిస్తున్నాయి. మతం పేరుతో యోగి సమాజాన్ని విడదీస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఆ టోపీ ఏ మతానికి చెందినది కాదు. అది కేవలం మర్యాదను సూచిస్తుంది. ముఖ్యమంత్రి అన్నాక అందరిని కలుపుకుపోవాలి. యోగి టోపీని ధరిస్తే బాగుండేద’ని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారి అన్నారు. అయితే యూపీ మంత్రి వర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి మొహ్సిన్ రాజా మాత్రం యోగీకి మద్దతు తెలిపారు. ‘ముఖ్యమంత్రికి టోపీ ఇవ్వడం.. ఆయన దాన్ని ధరించకపోవడం.. దాన్ని ప్రతిపక్షాలు ఇలా ప్రచారం చేయడం వీటన్నింటిని చూస్తుంటే మీరు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో జనాలకు అర్ధం అవుతుంది. మీరు ప్రజలకు ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? నేను ఒక ముస్లింనే. కానీ నేను ఎప్పుడు టోపీ ధరించలేదు. అంతమాత్రాన నేను ముస్లింను కానా? టోపీని ధరించకపోవడం పెద్ద నేరమా? ఈ విషయం గురించి మాట్లాడేవారు ఆలయాలకు వెళ్లి ప్రజలతో పాటు నిల్చుని, వారిని శుభాకాంక్షలు తెలుపుతున్నారా? ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను విలువివ్వడం... మతాన్ని అవమానించడం ఎలా అవుతుంది. ముందు మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలి’ అన్నారు. -
ఆదిమానవుల పే..ద్ద సమాధి!
నల్లగొండ జిల్లా ఎర్రగడ్డగూడెం శివారులో వెలుగులోకి.. దేశంలోనే అతి పెద్దదంటున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం 72 మీటర్ల చుట్టుకొలతతో సమాధి.. దానిపై వృత్తాకారంలో 50 గండ శిలలు ఇది ఆదిమానవుల తెగ నేతదని చరిత్రకారుల వెల్లడి హైదరాబాద్: దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న బృహత్ శిలాయుగపు మానవ సమాధి వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డగూడెం శివారు చెలకల్లో ఈ సమాధి బయటపడింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం మూడు రోజుల క్రితం దీన్ని పరిశీలించి ఆదిమానవులకు సంబంధించి ఇంతటి విశాలమైన సమాధి జాడలు ఇప్పటివరకు దేశంలో రికార్డు అయిన దాఖలాలు లేవని తేల్చింది. 72 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న ఈ సమాధిపై ఏకంగా 50 గండ శిలలు వరుసగా పేర్చి ఉన్నాయి. సమాధికి గుర్తుగా పెద్దపెద్ద రాళ్లను వృత్తాకారంలో ఏర్పాటు చేయటం ఆదిమానవుల కాలం నాటి ఆనవాయితీ. అలా వరసగా పేర్చిన రాళ్లు కనిపిస్తే అది ఆదిమానవుల సమాధి అని సులభంగా గుర్తించొచ్చు. ఇలాంటి ఆకృతులు తెలంగాణలో విరివిగా కనిపిస్తాయి. కానీ వాటిల్లో 12, 14, 18, 24.. సంఖ్యలో వృత్తాకారంలో రాళ్ల వరస కనిపిస్తుంది. కానీ తాజాగా వెలుగుచూసిన సమాధిలో 50 రాళ్లను వాడటం విశేషం. గతంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామ శివారులో 50 మీటర్ల చుట్టుకొలతతో కూడిన ఓ సమాధి వెలుగుచూసింది. అలాగే పురావస్తు విభాగం సర్వేలో కరీంనగర్ జిల్లా నర్మెటలో 20 మీటర్ల వ్యాసంతో ఉన్న సమాధి బయటపడింది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు వెలుగుచూసిన అతిపెద్ద సమాధులివే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40-50 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న సమాధుల జాడలు కనిపించినా 70 మీటర్ల కన్నా ఎక్కువ వ్యాసంతో ఉన్న సమాధి వెలుగుచూడలేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, పజ్జూరు గ్రామ ఔత్సాహికుడు మురళి సాయంతో ఈ భారీ సమాధిని పరిశీలించినట్టు వారు వెల్లడించారు. ఆ సమాధి తెగ నాయకుడిదా? ఆదిమానవులకు సంబంధించిన అంశాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. వారి సమాధులను తవ్వినప్పుడు అస్థిపంజరాలే కాకుండా వాటి చుట్టూ అలంకరణ వస్తువులు, తినుబండారాలను ఉంచిన మట్టి పాత్రలు, ఆయుధాలు, పనిముట్లు వెలుగుచూస్తుంటాయి. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వాటిని అతనితోపాటు సమాధి చేయటం అప్పట్లో ఆనవాయితీ. వారి సమాధుల తవ్వకాల్లో ఇలాంటివి బయటపడేవి. ప్రస్తుతం వెలుగుచూసిన సమాధి ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోని పజ్జూరు శివారులో కొంతకాలం క్రితం పురావస్తుశాఖ తవ్వకాలు జరిపింది. అక్కడ కూడా పదుల సంఖ్యలో బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. కానీ అవన్నీ చిన్నవి. ఈ అతి భారీ సమాధి నాడు ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన ఆదిమానవుల తెగ నాయకుడిదై ఉంటుందని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు పేర్కొంటున్నారు. ఆంగ్లేయుల కాలంలో 1924లో హైదరాబాద్ ఆర్కియాలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా రాయగిరిలో తవ్వకాలు జరిపి విశాలమైన సమాధులను గుర్తించారు. ఆ విషయాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ప్రతినిధి ఈహెచ్ హన్స్ తాను రాసిన ఓ వ్యాసంలో వివరించారు. ఎర్రగడ్డగూడెం-పజ్జూరు మధ్య ఉన్న గార్లచెరువుకు వేల సంవత్సరాల నుంచి నీటి వనరుగా ఖ్యాతి ఉంది. నీటి వనరులున్న చోట ఆదిమానవుల ఆవాసాలుండేవి. అందుకే ఈ ప్రాంతంలో చాలా చోట్ల వారి సమాధులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బయటపడిన అతిపెద్ద సమాధి ప్రాంతాన్ని కూడా పురావస్తు శాఖ శోధించి అందులో ప్రత్యేకతలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది.