Max India
-
మ్యాక్స్ హెల్త్‌కేర్- థైరోకేర్.. భల్లేభల్లే
ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌డీల్స్ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. మరోపక్క కొత్త సీఈవో ఎంపికకు వీలుగా చైర్మన్ వేలుమణికి అధికారాలను అప్పగిస్తూ బోర్డు తీర్మానించడంతో థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ ఉదయం సెషన్లో మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ కౌంటర్లో బ్లాక్‌డీల్స్ ద్వారా 4.7 కోట్ల షేర్లు చేతులు మారినట్లు బీఎస్ఈ డేటా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.2 శాతం వాటాకు సమానంకాగా.. కొనుగోలుదారులు, అమ్మకందారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ హెల్త్‌కేర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18.5 శాతం దూసుకెళ్లింది. రూ. 132ను అధిగమించింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13.3 శాతం ఎగసి రూ. 127 వద్ద ట్రేడవుతోంది. మ్యాక్స్ ఇండియాకుగల హెల్త్‌కేర్ ఆస్తులతో ప్రత్యేక కంపెనీగా మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైన విషయం విదితమే. థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు చైర్మన్ డాక్టర్ ఎ.వేలుమణికి అధికారాలను ఇస్తూ బోర్డు తీర్మానించినట్లు థైరోకేర్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌వో, సీఐవో తదితర పదవులకు సైతం సరైన వ్యక్తులను ఎంపిక చేసేందుకు వేలుమణికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. తద్వారా చైర్మన్ ఎంపిక చేసిన అభ్యర్ధుల పదవీకాలం, వేతనాలు తదితరాలను బోర్డు పరిశీలిస్తుందని వివరించింది. ఈ నేపథ్యంలో థైరోకేర్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 795 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం ఎగసి రూ. 810 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్ ఇండియా
న్యూఢిల్లీ: మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, ట్రూ నార్త్ ఫండ్ ఫోర్ ఎల్ఎల్పీకి విక్రయించామని మ్యాక్స్ ఇండియా తెలిపింది. ఈ డీల్ విలువ రూ.510 కోట్లని పేర్కొంది. మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావాదేవీ పరంగా చూస్తే, మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.1,001 కోట్లుగా ఉంది. రెండేళ్లలో కొత్త బ్రాండ్... ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత మాక్స్ బుపా డైరెక్టర్ల బోర్డ్‌కు డైరెక్టర్లను ట్రూ నార్త్ నామినేట్ చేయనున్నది. మరోవైపు మ్యాక్స్ ఇండియా నామినేట్ చేసిన డైరెక్టర్లు వైదొలుగుతారు. మ్యాక్స్ బ్రాండ్‌ను రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. ఈ రెండేళ్లలో దశలవారీగా మరో కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తారు. బుపా బ్రాండ్ నేమ్ మాత్రం కొనసాగుతుంది. ఇక ఈ వాటా విక్రయం ద్వారా లభించిన రూ.511 కోట్లను ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని మ్యాక్స్ గ్రూప్ చైర్మన్ అనల్జిత్ సింగ్ చెప్పారు. కాగా భారత్‌లో ఆరోగ్య బీమా రంగం వృద్ధి చెందుతోందని, ఆరోగ్య బీమా రంగంలో మాక్స్ బుపాను అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా రూపొందించడమే తమ లక్ష్యమని ట్రూ నార్త్ పార్ట్నర్ దివ్య సెహ్గల్ చెప్పారు. ఈ లావాదేవీ విషయంలో మ్యాక్స్ ఇండియాకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా కేపీఎమ్‌జీ కార్పొరేట్ ఫైనాన్స్ వ్యవహరిస్తోంది. ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్... 1999 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రూ నార్త్(ఇండియా వేల్యూ ఫండ్ అడ్వైజర్స్–ఫోర్‌ఎఫ్‌ఏ)మధ్య తరహా లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని ప్రపంచ స్థాయి ఉన్నత సంస్థలుగా మార్చుతోంది. ట్రూ నార్త్ సంస్థ ఇప్పటికే ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను ఆరంభించింది. వీటి మొత్తం నిధులు 280 కోట్ల డాలర్లను మించిపోయాయి. కాగా ఇంగ్లండ్‌కు చెందిన హెల్త్‌కేర్ సర్వీసుల దిగ్గజ సంస్థ, బుపా, మ్యాక్స్ ఇండియా కంపెనీలు కలసి మాక్స్ బుపా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. కాగా ఈ వాటా విక్రయ వార్తల కారణంగా బీఎస్ఈలో మ్యాక్స్ ఇండియా షేర్ 2.6 శాతం లాభంతో రూ.82.50 వద్ద ముగిసింది. -
నేడే మ్యాక్స్ ఇండియా లిస్టింగ్
న్యూఢిల్లీ: మ్యాక్స్ ఇండియా గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టవుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో తమ షేర్లు లిస్ట్ కానున్నట్లు మ్యాక్స్ ఇండియా తెలిపింది. మ్యాక్స్ ఇండియా డీమెర్జ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో లిస్టవుతున్న మూడో మ్యాక్స్ గ్రూప్ కంపెనీ ఇది. ఈ ఏడాది జనవరిలో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జూన్‌లో మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. గతంలో మ్యాక్స్ హెల్త్‌కేర్, మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్, అంటారా సీనియర్ లివింగ్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీగా మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ వ్యవహరించేది. మ్యాక్స్ గ్రూప్ జీవిత బీమా, ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యాపారాలు, ప్యాకేజింగ్ రంగాల్లో పనిచేస్తోంది. -
మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: మ్యాక్స్ ఇండియా కంపెనీ పునర్వ్యవస్థీకరణకు పంజాబ్, హర్యానా హైకోర్ట్ ఆమోదం లభించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మ్యాక్స్ ఇండియా మూడు కంపెనీలుగా విడిపోతోంది. మ్యాక్స్ ఇండియా కంపెనీ మ్యాక్స్ పైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతుందని కంపెనీ తెలిపింది. మిగిలిన రెండు కంపెనీలు (మ్యాక్స్ ఇండియా, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్) వచ్చే ఫిబ్రవరి నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతాయని తెలియజేసింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జీవిత బీమా వ్యాపారాన్ని, మ్యాక్స్ ఇండియా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా, ఇతర వ్యాపారాలను, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ తయారీ రంగ కార్యకలాపాలను చూస్తాయని తెలిపింది. కాగా మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు ఇప్పటికే సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, కాంపిటీ షన్ కమీషన్ ఆఫ్ ఇండియాలు(సీసీఐ) ఆమోదం తెలిపాయి. -
3 కంపెనీలుగా మ్యాక్స్ ఇండియా
న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా వ్యాపార దిగ్గజం మ్యాక్స్ ఇండియాను మూడు వేర్వేరు కంపెనీలుగా విభజించేందుకు సంస్థ బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. విభజన తర్వాత మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (జీవిత బీమా వ్యాపారం కోసం), మ్యాక్స్ ఇండియా (హెల్త్‌కేర్ సంబంధ వ్యాపారాలకు), మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్-ఎంవీఐఎల్ (తయారీ కార్యకలాపాలకు) సంస్థలు ఏర్పడతాయి. ఇక, క్లినికల్ రీసెర్చ్ వ్యాపారంలో వాటాలను కెనడా కంపెనీకి 1.5 మిలియన్ డాలర్లకు మ్యాక్స్ విక్రయించనుంది. కొత్తగా ఏర్పడే సంస్థలు కూడా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా జాయింట్ వెంచర్ సంస్థల్లో వాటాలు పెంచుకోవాలని విదేశీ భాగస్వామ్య కంపెనీలు మిత్సుయి, బూపా ఆసక్తిగా ఉన్నట్లు మ్యాక్స్ ఇండియా ప్రమోటరు అనల్జిత్ సింగ్ తెలిపారు. డీమెర్జర్ తర్వాత మ్యాక్స్ బూపా, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఆస్పత్రులు .. మ్యాక్స్ ఇండియా కింద ఉంటాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ప్రభుత్వం ఇటీవలే పెంచిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. డీమెర్జర్‌కి సంబంధించి అధికారిక తేదీని ఏప్రిల్ 1గా నిర్ణయించారు. ప్రక్రియ మొత్తం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి కావొచ్చని అంచనా. రూ. 605 కోట్ల నగదు నిల్వలు: గతేడాది ఆఖరు నాటికి మ్యాక్స్ ఇండియా దగ్గర రూ. 605 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇందులో మ్యాక్స్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు రూ. 150 కోట్లు, ఎంవీఐఎల్‌కు రూ. 10 కోట్లు బదలాయించనుండగా మిగతా రూ. 400 కోట్లు కొత్తగా ఏర్పడే మ్యాక్స్ ఇండియా వద్ద ఉంటాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 8.40% పెరిగి రూ. 492.75 వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 1,017 కోట్లు ఎగిసి రూ. 13,131 కోట్లకు చేరింది.