మ్యాక్స్ నుంచి 40 కొత్త మొబైల్స్
సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం
* కంపెనీ సీఎండీ అజయ్ అగర్వాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యాక్స్ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్న మ్యాక్స్ మొబిలింక్.. మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్‌లోకి ప్రవేశిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద కంపెనీకి యాక్సెసరీస్ తయారీ ప్లాంటు ఉంది. అక్కడే సెల్ఫోన్ల అసెంబ్లింగ్ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. రోజుకు లక్ష ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఇది రానుందని మ్యాక్స్ మొబిలింక్ సీఎండీ అజయ్ ఆర్ అగర్వాల్ బుధవారం చెప్పారు.
హైదరాబాద్‌లో ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2015-16లో నెలకు 15 లక్షల సెల్ఫోన్ల విక్రయంతోపాటు రూ.1,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. కంపెనీ ప్రస్తుతం సెల్ఫోన్లను చైనాలో తయారు చేయిస్తోంది.
ఫ్యాబ్లెట్స్ లోకి..
జూన్‌కల్లా ఫ్యాబ్లెట్‌ను తేనున్నట్లు అజయ్ చెప్పారు. 2015-16లో 40 మోడళ్లను విడుదల చేస్తామని, దేశవ్యాప్తంగా ఈ ఏడాది 100కుపైగా ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీటిని కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తుందన్నారు. ఈ కేంద్రాల్లో సర్వీసింగ్‌తోపాటు మొబైల్స్, యాక్సెసరీస్ విక్రయిస్తారు. భారత్‌లో వివిధ కంపెనీల సెల్ఫోన్లు నెలకు 2.8 కోట్లు అమ్ముడవుతున్నాయి. వీటిలో స్మార్ట్ఫోన్లు 35 శాతం. 2015-16లో ఇదే స్థాయి అమ్మకాలు నమోదవుతాయనేది మ్యాక్స్ అంచనా.