పన్నేతర ఆదాయంపై ఏపీ సర్కారు దృష్టి
మళ్లీ అన్నిరంగాల్లో యూజర్ చార్జీల బాదుడు!
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆదాయ వనరుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నేతర ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో పన్నులు ఎక్కువగా ఉన్నందున కొత్తగా పన్నులు పెంచడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో పన్నేతర ఆదాయ మార్గాల ద్వారా ఏటా అదనంగా రూ.10 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే ఏయే రంగాల ద్వారా పన్నేతర ఆదాయం రాబట్టుకోవచ్చో అధ్యయనం చేసి నివేదిక సమర్పించే బాధ్యతలను కేపీఎంజీ అనే కన్సల్టెన్సీకి ఆర్థిక శాఖ అప్పగించింది. ఈ కన్సల్టెన్సీ ఇతర రాష్ట్రాలు అవసరమైతే ఇతర దేశాల్లో పన్నేతర ఆదాయాన్ని ఎలా రాబట్టుకుంటున్నారు, ఏయే రంగాల్లో పన్నేతర ఆదాయం ఎంత వస్తోందో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.