లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
టాటా గ్రూప్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా' (Ratan Tata). భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఈయన పేరు సుపరిచయమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ బాధ్యతలను త్వరలోనే తమ తరువాతి తరం టాటాలకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా గ్రూప్ సంస్థ బాధ్యతలను 'మాయా టాటా' (Maya Tata)కు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 20,71,467 కోట్ల విలువైన కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా.. అని ఇప్పటికే చాలామందిలో తెలుసుకోవలసిన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు సమాధానంగా మాయా టాటా పేరు వినిపిస్తోంది.
నిజానికి ఇటీవల కాలంలోనే 'మాయా టాటా' మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్న వారే.
ఇదీ చదవండి: గుడ్న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే!
రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా & అలూ మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ 'మాయా టాటా'. ఈమె యూకేలోని బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నట్లు సమాచారం. ఆ తరువాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తరువాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉన్నారు.
ప్రస్తుతం టాటా గ్రూప్ బాధ్యతలను మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 34 సంవత్సరాలకే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించనున్న మహిళగా రికార్డ్ సృష్టించనుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు టాటా గ్రూప్ సామ్రాజ్యాధినేత ఎవరనేది తెలిసిపోతుంది.