రెండు కేటగిరీలుగా విదేశీ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల విధానాలను పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్న ప్రభుత్వం వీటిని రెండు కేటగిరీలుగా విభజించాలని చూస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)గా వర్గీకరించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఆటోమాటిక్ అనుమతికి సంబంధించి ఎఫ్‌పీఐలకు 24%, ఎఫ్‌డీఐలకు 49% పరిమితిని అమలు చేయనుంది. ఈ ప్రతిపాదనలు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఎఫ్పీఐలలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49%కు పెంచే ప్రతిపాదనకు సైతం మాయారామ్ కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
10% వరకే : ఎఫ్‌పీఐ కింద లిస్టెడ్ కంపెనీలలో వ్యక్తిగత పెట్టుబడి పరిమితిని 10% వరకూ అనుమతించనున్నారు. అర్హతగల విదేశీ ఇన్వెస్టర్లు(క్యూఎఫ్ఐలు), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ కేటగిరిలోకి వస్తారు. 10% పరిమితికి మించిన వ్యక్తిగత పెట్టుబడిని ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు. ఇక అన్‌లిస్టెడ్ కంపెనీలలో ఎఫ్‌పీఐలను ఎఫ్డీఐలుగా పరిగణిస్తారు. ఇక ప్రవాసాంధ్రుల పెట్టుబడులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తారు. ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐల మధ్య సందిగ్ధతను తొలగించేందుకు ప్రభుత్వం మాయారామ్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెలాఖరుకల్లా కమిటీ తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని నిర్వచించేందుకు అంతర్జాతీయ విధానాలను పరిశీలించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు కూడా.