Mayor Abdul Aziz
-
నాపై కుట్ర జరుగుతోంది
ఆనం కుటుంబీకులపై మేయర్ అజీజ్ ఆగ్రహం నెల్లూరు సిటీ: కొందరు తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని, వారికి భయపడ్డానికి తానేమీ గాజులు తొడుక్కోలేదని పరోక్షంగా ఆనం కుటుంబీకులపై మేయర్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ గతంలో ఆనం కుటుంబం తాళ్ళపాక అనురాధ, పులిమి శైలజను ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుచేశారు. తాను మైనార్టీకి చెందిన వ్యక్తిని కావడంతోనే ఇపుడు తనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీలోనే తన పై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో అవినీతికి తావులేకుండా కృషి చేస్తున్నానన్నారు. కార్పొరేషన్‌కు గత రెండున్నర సంవత్సరాల నుంచి ‘వాచ్డాగ్’గా వ్యవహరిస్తున్నానని అజీజ్ పేర్కొన్నారు. రుణాలకు సంబంధించి కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సబ్‌ప్లాన్ నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్, కమిషనర్, లేకపోతే తన దృష్టికి తీసుకునిరావాలని సూచించారు. క్రిందిస్థాయి సిబ్బంది, మహిళా ఉద్యోగులపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోనని..అవసరమైతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రంగమయూర్‌రెడ్డిని హెచ్చరించారు. ఇకనైనా తన పై చేసే విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు మామిడాల మధు, మల్లికార్జున్‌యాదవ్, కొమ్మరిగిరి శైలజ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
రొట్టెల పండగకు ఏర్పాట్లు
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు, సిటీ: వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. నగరంలోని బారాషాహిద్ దర్గా ప్రాంగణాన్ని ఆదివారం నగర మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్, టూరిజం అధికారులతో కలసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర మేయర్ అజీజ్ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో నిర్మిస్తున్న 120 శాశ్వత మరుగుదొడ్లను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చెరువలో ఘాట్లు నిర్మాణం, లైటింగ్, గార్డెనింగ్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టూరిజం వారి సహకారంతో రూ.2.62 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
మేయర్‌కు షాక్
తనకు తెలియకుండా టెండర్లు పిలవకూడదు అధికారులకు మేయర్ అజీజ్ లిఖితపూర్వక ఉత్తర్వులు మేయర్ ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ మేయర్ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అజీజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు మేయర్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించగా శనివారం స్టే విధించినట్లు తెలిసింది. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంపై పట్టు సాధించేందుకు అధికార పార్టీలోని రెండు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలపై కన్నెర చేశారు. ఈ క్రమంలో అక్రమ కట్టడాలకు సహకరించార ఆరోపణలతో ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే మేయర్ అజీజ్ తనకు తెలియకుండా నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి జోక్యం చేసుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మేయర్ అజీజ్ ‘అర్జెంట్ ఆఫీస్ నోట్’ను తయారు చేయించాడు. తనకు తెలియకుండా ఏ పనులు చేయరాదని కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేయర్ తీరుపై కార్పొరేషన్ అ«ధికారులు మండిపడ్డారు. మేయర్, మంత్రుల మధ్య నలుగుతున్న అధికారులు ఓ వైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మరోవైపు నగర మేయర్ అజీజ్ కార్పొరేషన్‌పై తమ పట్టు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్‌పై పట్టు కోసం మంత్రి నారాయణ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులకు తాను చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గ్రహించిన మేయర్ అజీజ్ తాను ఏమీ తక్కువ కాదంటూ తనకు తెలియకుండా ఏ పని చేయరాదని లిఖిత పూర్వకంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరో వైపు కార్పొరేషన్లో పట్టు కోసం మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాందరెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు ఇరువర్గాల అంతర్గతపోరులో నలిగిపోతున్నారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారి అధికార పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ మేయర్ అధికారులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయడంపై నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. శనివారం హైకోర్టు మేయర్ ఉత్తర్వులుపై స్టే విధించినట్లు సమాచారం. దేశంలోని ఏ కార్పొరేషన్‌లోనూ మేయర్ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిన దాఖలాలు లేవు. తనకు తెలియకుండా ఏ పని చేయకూడదని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మేయర్ తీరును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండడం విశేషం. -
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత
నెల్లూరు(అర్బన్): పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్ నుంచి సాయమందిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. భక్తవత్సలనగర్‌లోని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, రీసెర్చి సెంటర్ ఆధ్వర్యంలో ఎన్యూఎల్ఎం సహకారంతో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది మహిళలకు ఆదివారం కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు గ్రూపులుగా ఏర్పడితే కార్పొరేషన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లలో కొన్ని గదులను ఎలాంటి అడ్వాన్స్ లేకుండా తక్కువ అద్దెకు కేటాయిస్తామని చెప్పారు. ఊరగాయలు, జూట్ బ్యాగులు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి పరిశ్రమల స్థాపనకు మహిళలకు మెప్మా అండగా ఉంటుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ వసంతలక్ష్మి, కార్పొరేటర్లు రజని, రాజానాయుడు, పెంచలయ్య, ప్రశాంత్‌కుమార్, ప్రసాద్, షంషుద్దీన్, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థలో మేయర్ అబ్దుల్ అజీజ్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండేళ్ల క్రితం మేయర్‌గా ఎన్నికైన అజీజ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కార్పొరేషన్లో తనిఖీలు చేసి, అధికారులు, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించిన పరిస్థితే లేదు. కార్పొరేషన్‌లోని సగానికి పైగా సిబ్బంది వారం క్రితం కృష్ణా పుష్కరాల విధుల నిమిత్తం హాజరయ్యారు. ఉన్న సిబ్బందిపై అధిక భారం పడింది. ఏ విభాగానికి వెళ్లినా ఖాళీ కుర్చీలు, తాళాలు వేసిన గదులు మాత్రమే మేయర్ కంటపడ్డాయి. సిబ్బంది లేని కార్పొరేషన్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. త్వరలో బయోమెట్రిక్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని మేయర్ పేర్కొన్నారు. కార్పొరేషన్లో కాగిత రహిత పాలనను అమలు చేస్తానని చెప్పారు. ఇప్పటికే భవన అనుమతులను ఆన్లైన్లో చేస్తున్నామని చెప్పారు. అధికారులు, సిబ్బంది సమయపాలనను తప్పక పాటించాలని సూచించారు. ఎస్ఈ శ్రీనివాసులు, మేనేజర్ రాజేంద్ర, కార్పొరేటర్లు రాజానాయుడు, నాయకులు షంషుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గా ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పనులను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్టోబర్ రెండో వారంలో రొట్టెల పండగ జరగనుందని చెప్పారు. రెండేళ్లుగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఏటా రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణంతో ఖర్చు తగ్గనుందని తెలిపారు. కార్పొరేటర్లు పిట్టి సత్యనాగేశ్వరరావు, మన్నెం పెంచలనాయుడు, ప్రశాంత్‌కుమార్, ప్రశాంత్‌కిరణ్, మేకల రామ్మూర్తి, కిన్నెరప్రసాద్, నాయకులు ప్రసాద్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందిపై చర్యలకు మేయర్ ఆదేశం
నెల్లూరు సిటీ: కార్పొరేషన్‌కు చెందిన పెట్రోల్ బంకులో మేయర్ అబ్దుల్ అజీజ్ పెట్రోల్, డీజిల్ రికార్డులను శనివారం పరిశీలించారు. 67 లీటర్లకు లెక్క తేలకపోవడంతో ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కుక్కలగుంట వద్ద కార్పొరేషన్ వెహికల్ షెడ్‌ను శనివారం ఉదయం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెహికల్ షెడ్ వ్యవహారం గందరగోళంగా ఉందని, 67 లీటర్లకు సరైన లెక్కను సిబ్బంది చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మనెంట్ డ్రైవర్లు ఖాళీగా ఉన్నారని, వారి హాజరు పుస్తకంలో తేడాలు ఉన్నాయని చెప్పారు. వాహనాల మరమ్మతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులపై మండిపడ్డారు. వ్యవహారంపై విచారణ చేపడుతున్నామని, తప్పు చేసినట్లు తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, ఇన్చార్జి ఎస్ఈ కృష్ణంరాజు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ఆనం vs అజీజ్
► అవినీతికి మారుపేరైనా ఆనంవివేకానందరెడ్డి అవినీతి గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది - మేయర్ అబ్దుల్ అజీజ్ ► నెల్లూరు కార్పొరేషన్ పాలనను మేయర్ అబ్దుల్ అజీజ్ భ్రష్టు పట్టించారు- మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ► పందులు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటాయని వివేకా విమర్శ ►ముస్లిం మేయర్ కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వివేకాపై అజీజ్ ఎదురుదాడి ►సొంత కార్పొరేషన్లో అవినీతితో నారాయణకు తలనొప్పి ► నేతలిద్దరి ఆరోపణలతో పార్టీకి నష్టమని చంద్రబాబుకు బీద ఫిర్యాదు నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో ఆదివారం జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు తెలుగుదేశం పార్టీలో రాజకీయ దుమారాన్ని రాజేశాయి. ఇంత కాలం గుంభనంగా ఉన్న మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సోమవారం నువ్వు అవినీతి పరుడివంటే నువ్వే అవినీతి పరుడివని ఆరోపణలు చేసుకున్నారు. ‘పందులకు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటుంది’ అని వివేకానందరెడ్డి పరోక్షంగా అజీజ్ మీద అవినీతి దాడి చేశారు. నువ్వేం నెల్లూర్ కానవాబ్, నెల్లూర్‌కా సుల్తాన్ అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదని తీవ్రమైన విమర్శలు చేశారు. ఆనం వివేకా తనను పందితో పోల్చి మతాన్ని కించపరచారని అజీజ్ మతం కార్డు విసిరారు. ముస్లిం మైనారిటీ మేయర్ కావడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారని ఎదురుదాడికి దిగారు. నెల్లూరు నగర పాలక సంస్థలో ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించారనీ, రెండేళ్లుగా ఈ వ్యవహారం శృతి మించిందని టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మేయర్‌కు పాలన మీద పట్టు లేక పోవడం, మేయర్, ఆయన సోదరుడు జలీల్ దందాల కారణంగా అధికారులు సైతం ఎవరికి దొరికనంత వారు దోచేస్తున్నారని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీలోకి తమ రాకను అడ్డుకునే ప్రయత్నం చేసిన మేయర్ అజీజ్ కథ చూడాలని ఆనం కుటుంబీకులు సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కొంత కాలం కిందటి వరకు ఒకరి మీద ఒకరు పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో మంత్రి నారాయణకు అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి నారాయణ మేయర్ మీద బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ మరుసటి రోజే ఆనం రంగమయూర్‌రెడ్డి మేయర్ మీద బహిరంగ విమర్శలకు దిగారు. అజీజ్ పాలనలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలో అన్ని కొర్పొరేషన్లకంటే వెనుకపడిందని ఆరోపించారు. రంగ మయూర్ ఆరోపణలపై గుర్రుగా ఉన్న అజీజ్ అప్పట్లోనే ఘాటుగా స్పందించాలనుకుని ఆగిపోయారు. కార్పొరేషన్ మీద పట్టు సాధించలేకపోతే టీడీపీలోని తన వ్యతిరేకులు తొక్కేస్తారనే భయంతో అజీజ్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తాను చెప్పినట్లే వినాలనే ఒత్తిడి పెంచారు. తనను వ్యతిరేకిస్తున్న పెద్ద నాయకులతో పొసగని వారందరినీ తన గూట్లోకి తెచ్చుకునేందుకు చాపకింద నీరుగా పావులు కదుపుతున్నారు. సమయం, సందర్భం చూసి అజీజ్‌ను దెబ్బకొట్టాలని ఆనంతోపాటు టీడీపీలోని మిగిలిన కొందరు నేతలు ఎదురు చూస్తున్నారు. వివేకా వర్సెస్ అజీజ్ కార్పొరేషన్ పై ఏసీబీ దాడుల నేపథ్యంలో సోమవారం వివేకానందరెడ్డి మేయర్ అజీజ్ మీద నేరుగా దాడికి దిగారు. అజీజ్ అవినీతి వల్ల మంత్రి నారాయణ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందనీ, జిల్లాలో టీడీపీకి కూడా చెడ్డపేరు వచ్చిందని తెలివిగా ఈ వ్యవహారాన్ని మంత్రికి, పార్టీకి చుట్టేశారు. ఇదే విధంగా ఉంటే సీఎం కౌన్సిల్‌ను రద్దు చేసే పరిస్థితి వస్తుందని పరోక్షంగా మేయర్‌ను హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ మేయర్‌ను, ఆయన తమ్మున్ని బుక్ చేయలేక సిబ్బందిని బుక్ చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా వ్యాఖ్యల్ని తొలుత తేలిగ్గా తీసుకున్న అజీజ్ ఆయన విమర్శలు చేస్తూనే ఉంటారు అని వ్యాఖ్యానించి వదిలేశారు. సాయంత్రం టీడీపీ నగర అధ్యక్షుడు, వివేకా రాజకీయ విరోధి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపిం చుకుని చర్చించారు. వివేకాకు ఇప్పుడే గట్టిగా సమాధానం చెప్పకపోతే మరింత రెచ్చిపోతారని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం పెట్టి అజీజ్, కోటంరెడ్డి ఇద్దరూ వివేకా మీద విరుచుకుపడ్డారు.‘‘ మేయర్ భానుశ్రీ హయాంలో వివేకా కార్పొరేషన్లో చేయని అవినీతి లేదని, కార్పొరేషన్ ఏమైనా వివేకా జాగీరా, మీరు, మీ తాబేదార్లే మేయర్‌గా ఉండాలా? ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి మేయర్ అయితే ఓర్వలేక పోతున్నావు? నువ్వు టీడీపీని బాగు చేయడానికి వచ్చావా? నాశనం చేయడానికి వచ్చావా’’ అని తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు. నీ పదేళ్ల హయాంలో కార్పొరేషన్లో జరిగిన అవినీతి మీద విజిలెన్స్ విచారణ జరిపించి నీ అవినీతి బండారం బయటపెడతానని మేయర్ హెచ్చరించారు. ఆనం వైఎస్సార్సీపీ వారితో కలిసి పోయి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణకు తలనొప్పే నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి విజృంభిస్తోందని సొంత పార్టీ వారే చెప్పడం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు తలనొప్పి తెచ్చేలా ఉంది. కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే జనం అసంతృప్తిగా ఉన్నారు.చంద్రబాబు దృష్టికి వివాదం నెల్లూరుకార్పొరేషన్ అవినీతి వ్యవహారాలపై మేయర్, మాజీ ఎమ్మెల్యే చేసుకున్న బహిరంగ ఆరోపణలను జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారని తెలిసింది. -
నెల్లూరులో మంత్రి vs మేయర్
► మేయర్ కలల ప్రాజెక్టుకు మంత్రి ప్రారంభోత్సవం ► అజీజ్ లేని సమయంలో ప్రారంభోత్సవం ► మేయర్ మద్దతుదారుల అసహనం నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రధాన వీధులన్నీ దుమ్ములేకుండా శుభ్రం చేసే కార్యక్రమాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్న మేయర్ అబ్దుల్ అజీజ్‌కు గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఆయన దేశంలో లేని సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం రోడ్లను శుభ్రం చేసే యంత్రాన్ని ప్రారంభించి నగరంలోని దుమ్ము దులిపేసే మంచి పని తన వల్లే జరిగిందని చెప్పకనే చెప్పారు. అజీజ్ కలల ప్రాజెక్టును మంత్రి ఇలా చడీ చప్పుడు లేకుండా ప్రారంభించి మేయర్‌ను అవమానించారని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ దుమ్ముతో నిండిపోయి వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యగా ఉంది. దీంతో పాటు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనమే కాకుండా స్థానికులు సైతం దుమ్ముకొట్టుకుని ఉన్న రోడ్ల విషయంలో కార్పొరేషన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నగరంలోని సందులు, గొందుల రోడ్లు కాకపోయినా కనీసం ప్రధాన రహదారులైనా దుమ్ములేకుండా శుభ్రం గా ఉంచి జనంలో మార్కులు కొట్టేయాలని మేయర్ అజీజ్ ఆశపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అధికారులతో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్లు శుభ్రం చేసే యంత్రాలు ఉన్నాయనీ, అలాంటివి ఇక్కడకు కూడా తీసుకుని వస్తే రాత్రి పూట ప్రధాన రోడ్లన్నీ శుభ్రం చేయొచ్చని అధికారులు సలహా ఇచ్చారు. సుమారు రెండు, మూడు నెలల ప్రయత్నం అనంతరం నెల్లూరుకు ఇలాంటి యంత్రాన్ని తెప్పించారు. ఏడాదికి రూ.1.67 కోట్లు చెల్లించే విధంగా ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గంటకు 8 కిలో మీటర్ల దూరం రోడ్డును శుభ్రం చేసే ఈ యంత్రాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలని మేయర్ అజీజ్ ఆశపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. వనంతోపు సెంటర్లో యంత్రం ప్రారంభం: సోమవారం నెల్లూరులో ఉన్న మంత్రి నారాయణ వనంతోపు సెంటర్లో రోడ్డు శుభ్రపరిచే యంత్రాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ అధికారులు హడావుడిగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ యంత్రాన్ని మేయర్ ప్రారంభించాలని అనుకున్నారనీ, ఆయన దేశంలో లేని సమయంలో హడావుడిగా మంత్రి ప్రారంభించడం ఆయన్ను అవమానించినట్లేనని అజీజ్ మద్దతుదారుడు షంషుద్దీన్ ప్రారంభ సమయంలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది మేయర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన లేని సమయంలో ప్రారంభించడం సరైంది కాదన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది చాలా చిన్న విషయం కాబట్టి సీరియస్‌గా తీసుకోవద్దని మంత్రి ఆ నాయకుడికి చెప్పి వెళ్లిపోయారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు అజీజ్‌ను ఏ మాత్రం గౌరవించడం లేదనీ, అసలు ఆయన్ను అధికార పార్టీ నాయకుడిగానే పరిగణించడం లేదని ఆయన మద్దతుదారులు రగిలిపోతున్నారు. తమ నాయకుడిని ప్రతి విషయంలో అవమానకరంగానే చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మంత్రి మద్దతుదారులు మాత్రం అజీజ్‌కు అంత సీన్ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.