మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత
నెల్లూరు(అర్బన్): పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్ నుంచి సాయమందిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. భక్తవత్సలనగర్‌లోని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, రీసెర్చి సెంటర్ ఆధ్వర్యంలో ఎన్‌యూఎల్‌ఎం సహకారంతో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది మహిళలకు ఆదివారం కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు గ్రూపులుగా ఏర్పడితే కార్పొరేషన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లలో కొన్ని గదులను ఎలాంటి అడ్వాన్స్ లేకుండా తక్కువ అద్దెకు కేటాయిస్తామని చెప్పారు. ఊరగాయలు, జూట్ బ్యాగులు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి పరిశ్రమల స్థాపనకు మహిళలకు మెప్మా అండగా ఉంటుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ వసంతలక్ష్మి, కార్పొరేటర్లు రజని, రాజానాయుడు, పెంచలయ్య, ప్రశాంత్‌కుమార్, ప్రసాద్, షంషుద్దీన్, టీఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు.