కార్పొరేషన్లో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థలో మేయర్ అబ్దుల్ అజీజ్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండేళ్ల క్రితం మేయర్‌గా ఎన్నికైన అజీజ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కార్పొరేషన్లో తనిఖీలు చేసి, అధికారులు, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించిన పరిస్థితే లేదు. కార్పొరేషన్లోని సగానికి పైగా సిబ్బంది వారం క్రితం కృష్ణా పుష్కరాల విధుల నిమిత్తం హాజరయ్యారు. ఉన్న సిబ్బందిపై అధిక భారం పడింది. ఏ విభాగానికి వెళ్లినా ఖాళీ కుర్చీలు, తాళాలు వేసిన గదులు మాత్రమే మేయర్ కంటపడ్డాయి. సిబ్బంది లేని కార్పొరేషన్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
త్వరలో బయోమెట్రిక్
నగరపాలక సంస్థ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని మేయర్ పేర్కొన్నారు. కార్పొరేషన్లో కాగిత రహిత పాలనను అమలు చేస్తానని చెప్పారు. ఇప్పటికే భవన అనుమతులను ఆన్‌లైన్లో చేస్తున్నామని చెప్పారు. అధికారులు, సిబ్బంది సమయపాలనను తప్పక పాటించాలని సూచించారు. ఎస్‌ఈ శ్రీనివాసులు, మేనేజర్ రాజేంద్ర, కార్పొరేటర్లు రాజానాయుడు, నాయకులు షంషుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.