సిబ్బందిపై చర్యలకు మేయర్ ఆదేశం
నెల్లూరు సిటీ: కార్పొరేషన్‌కు చెందిన పెట్రోల్ బంకులో మేయర్ అబ్దుల్ అజీజ్ పెట్రోల్, డీజిల్ రికార్డులను శనివారం పరిశీలించారు. 67 లీటర్లకు లెక్క తేలకపోవడంతో ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కుక్కలగుంట వద్ద కార్పొరేషన్ వెహికల్ షెడ్‌ను శనివారం ఉదయం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెహికల్ షెడ్ వ్యవహారం గందరగోళంగా ఉందని, 67 లీటర్లకు సరైన లెక్కను సిబ్బంది చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మనెంట్ డ్రైవర్లు ఖాళీగా ఉన్నారని, వారి హాజరు పుస్తకంలో తేడాలు ఉన్నాయని చెప్పారు. వాహనాల మరమ్మతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులపై మండిపడ్డారు. వ్యవహారంపై విచారణ చేపడుతున్నామని, తప్పు చేసినట్లు తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, ఇన్‌చార్జి ఎస్‌ఈ కృష్ణంరాజు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.