ఆనం కుటుంబీకులపై మేయర్ అజీజ్ ఆగ్రహం
నెల్లూరు సిటీ: కొందరు తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని, వారికి భయపడ్డానికి తానేమీ గాజులు తొడుక్కోలేదని పరోక్షంగా ఆనం కుటుంబీకులపై మేయర్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ గతంలో ఆనం కుటుంబం తాళ్ళపాక అనురాధ, పులిమి శైలజను ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుచేశారు. తాను మైనార్టీకి చెందిన వ్యక్తిని కావడంతోనే ఇపుడు తనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీలోనే తన పై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌లో అవినీతికి తావులేకుండా కృషి చేస్తున్నానన్నారు.
కార్పొరేషన్‌కు గత రెండున్నర సంవత్సరాల నుంచి ‘వాచ్‌డాగ్’గా వ్యవహరిస్తున్నానని అజీజ్ పేర్కొన్నారు. రుణాలకు సంబంధించి కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సబ్‌ప్లాన్ నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్, కమిషనర్, లేకపోతే తన దృష్టికి తీసుకునిరావాలని సూచించారు. క్రిందిస్థాయి సిబ్బంది, మహిళా ఉద్యోగులపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోనని..అవసరమైతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రంగమయూర్‌రెడ్డిని హెచ్చరించారు. ఇకనైనా తన పై చేసే విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు మామిడాల మధు, మల్లికార్జున్‌యాదవ్, కొమ్మరిగిరి శైలజ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
నాపై కుట్ర జరుగుతోంది
Published Wed, Feb 8 2017 11:11 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement