ఆనం vs అజీజ్ | own Corporation Narayana corruption headache | Sakshi
Sakshi News home page

ఆనం vs అజీజ్

Published Tue, Jun 21 2016 9:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఆనం vs అజీజ్ - Sakshi

ఆనం vs అజీజ్

అవినీతికి మారుపేరైనా ఆనంవివేకానందరెడ్డి అవినీతి గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది - మేయర్ అబ్దుల్ అజీజ్
 
నెల్లూరు కార్పొరేషన్ పాలనను మేయర్ అబ్దుల్ అజీజ్ భ్రష్టు పట్టించారు- మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి

పందులు బురదలో దొర్లితేనే ఆనందంగా  ఉంటాయని వివేకా విమర్శ
ముస్లిం మేయర్ కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వివేకాపై అజీజ్ ఎదురుదాడి
సొంత కార్పొరేషన్‌లో అవినీతితో నారాయణకు తలనొప్పి
నేతలిద్దరి ఆరోపణలతో పార్టీకి నష్టమని చంద్రబాబుకు బీద ఫిర్యాదు
 

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో ఆదివారం జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు తెలుగుదేశం పార్టీలో రాజకీయ దుమారాన్ని రాజేశాయి. ఇంత కాలం గుంభనంగా ఉన్న మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సోమవారం నువ్వు అవినీతి పరుడివంటే నువ్వే అవినీతి పరుడివని ఆరోపణలు చేసుకున్నారు. ‘పందులకు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటుంది’ అని వివేకానందరెడ్డి పరోక్షంగా అజీజ్ మీద అవినీతి దాడి చేశారు. నువ్వేం నెల్లూర్ కానవాబ్, నెల్లూర్‌కా సుల్తాన్ అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదని తీవ్రమైన విమర్శలు చేశారు. ఆనం వివేకా తనను పందితో పోల్చి మతాన్ని కించపరచారని అజీజ్ మతం కార్డు విసిరారు. ముస్లిం మైనారిటీ మేయర్ కావడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారని ఎదురుదాడికి దిగారు.

నెల్లూరు నగర పాలక సంస్థలో ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించారనీ, రెండేళ్లుగా ఈ వ్యవహారం శృతి మించిందని టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మేయర్‌కు పాలన మీద పట్టు లేక పోవడం, మేయర్, ఆయన సోదరుడు జలీల్ దందాల కారణంగా అధికారులు సైతం ఎవరికి దొరికనంత వారు దోచేస్తున్నారని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.  టీడీపీలోకి తమ రాకను అడ్డుకునే ప్రయత్నం చేసిన మేయర్ అజీజ్ కథ చూడాలని ఆనం కుటుంబీకులు సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కొంత కాలం కిందటి వరకు ఒకరి మీద ఒకరు పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో మంత్రి నారాయణకు అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి నారాయణ మేయర్  మీద బహిరంగంగా విమర్శలు చేశారు.

ఆ మరుసటి రోజే ఆనం రంగమయూర్‌రెడ్డి మేయర్ మీద బహిరంగ విమర్శలకు దిగారు. అజీజ్ పాలనలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలో అన్ని కొర్పొరేషన్లకంటే వెనుకపడిందని ఆరోపించారు. రంగ మయూర్ ఆరోపణలపై గుర్రుగా ఉన్న అజీజ్ అప్పట్లోనే ఘాటుగా స్పందించాలనుకుని ఆగిపోయారు.  కార్పొరేషన్ మీద పట్టు సాధించలేకపోతే టీడీపీలోని తన వ్యతిరేకులు తొక్కేస్తారనే భయంతో అజీజ్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తాను చెప్పినట్లే వినాలనే ఒత్తిడి పెంచారు. తనను వ్యతిరేకిస్తున్న పెద్ద నాయకులతో పొసగని వారందరినీ తన గూట్లోకి తెచ్చుకునేందుకు చాపకింద నీరుగా పావులు కదుపుతున్నారు. సమయం, సందర్భం చూసి అజీజ్‌ను దెబ్బకొట్టాలని ఆనంతోపాటు టీడీపీలోని మిగిలిన కొందరు నేతలు ఎదురు చూస్తున్నారు.

వివేకా వర్సెస్ అజీజ్
కార్పొరేషన్ పై ఏసీబీ దాడుల నేపథ్యంలో సోమవారం వివేకానందరెడ్డి మేయర్ అజీజ్ మీద నేరుగా దాడికి దిగారు. అజీజ్ అవినీతి వల్ల  మంత్రి నారాయణ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందనీ, జిల్లాలో టీడీపీకి కూడా చెడ్డపేరు వచ్చిందని తెలివిగా ఈ వ్యవహారాన్ని మంత్రికి, పార్టీకి చుట్టేశారు. ఇదే విధంగా ఉంటే సీఎం కౌన్సిల్‌ను రద్దు చేసే పరిస్థితి వస్తుందని పరోక్షంగా మేయర్‌ను హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ మేయర్‌ను, ఆయన తమ్మున్ని బుక్ చేయలేక సిబ్బందిని బుక్ చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా వ్యాఖ్యల్ని తొలుత తేలిగ్గా తీసుకున్న అజీజ్ ఆయన విమర్శలు చేస్తూనే ఉంటారు అని వ్యాఖ్యానించి వదిలేశారు. సాయంత్రం టీడీపీ నగర అధ్యక్షుడు, వివేకా రాజకీయ విరోధి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపిం చుకుని చర్చించారు. వివేకాకు ఇప్పుడే గట్టిగా సమాధానం చెప్పకపోతే మరింత రెచ్చిపోతారని నిర్ణయించుకున్నారు.

ఆ తర్వాత విలేకరుల సమావేశం పెట్టి అజీజ్, కోటంరెడ్డి ఇద్దరూ వివేకా మీద విరుచుకుపడ్డారు.‘‘ మేయర్ భానుశ్రీ హయాంలో వివేకా కార్పొరేషన్‌లో చేయని అవినీతి లేదని, కార్పొరేషన్ ఏమైనా వివేకా జాగీరా,  మీరు, మీ తాబేదార్లే మేయర్‌గా ఉండాలా? ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి మేయర్ అయితే ఓర్వలేక పోతున్నావు? నువ్వు టీడీపీని బాగు చేయడానికి వచ్చావా? నాశనం చేయడానికి వచ్చావా’’ అని తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు. నీ పదేళ్ల హయాంలో కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి మీద విజిలెన్స్ విచారణ జరిపించి నీ అవినీతి బండారం బయటపెడతానని మేయర్ హెచ్చరించారు. ఆనం వైఎస్సార్‌సీపీ వారితో కలిసి పోయి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నారాయణకు తలనొప్పే
నెల్లూరు కార్పొరేషన్‌లో అవినీతి విజృంభిస్తోందని సొంత పార్టీ వారే చెప్పడం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు తలనొప్పి తెచ్చేలా ఉంది. కార్పొరేషన్‌లో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే జనం అసంతృప్తిగా ఉన్నారు.చంద్రబాబు దృష్టికి వివాదం నెల్లూరుకార్పొరేషన్ అవినీతి వ్యవహారాలపై మేయర్, మాజీ ఎమ్మెల్యే చేసుకున్న బహిరంగ ఆరోపణలను జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement