‘టీడీపీకి గుడ్‌బై’పై క్లారిటీ ఇచ్చిన ఆనం
అమరావతి: టీడీపీ తరఫున ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా చక్రంతిప్పిన ఆనం సోదరులిద్దరూ.. తెలుగుదేశం పార్టీలో చేరాక చేదు అనుభవాలు ఎదుర్కొన్నారని, దీంతో పార్టీని వీడతారని జోరుగా ప్రచారం సాగింది. ఒక దశలో వారు టీడీపీ నుంచి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళతారనే వార్తలు గుప్పుమన్నాయి. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆనం.. సోషల్ మీడియా వేదికగా సాగుతోన్న ప్రచారాలపై స్పష్టత ఇచ్చారు.
తాము తెలుగుదేశం పార్టీననుంచి బయటికి వస్తున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వివేకానందరెడ్డి చెప్పారు. తనతోపాటు సోదరుడు రామనారాయణ రెడ్డి కూడా టీడీపీలోనే ఉంటామని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి కూడా స్పష్టం చేశామని తెలిపారు. తమ సేవలు ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబుకు తెలుసని, ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామని వివరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడిన ఆనం సోదరులు.. పలు ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిసింది. వివేకానంద రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్ధానం చేయడంవల్లే ఆ ఇద్దరూ టీడీపీలో చేరారని, చివరికి బాబు అవేవీ నెరవేర్చకపోవడంతో ఆనం సోదరులు కినుక వహించారని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.
(చదవండి: టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం)