కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆనం సోదరులు బుధవారం టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తమ జిల్లాకు చెందిన మంత్రి పి.నారాయణతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబు.. ఆనం సోదరులకు పచ్చకండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారి హోదాను గుర్తించి పార్టీలో ఆనం సోదరులకు తగిన గౌరవం, పదవులు దక్కుతాయని బాబు పేర్కొన్నట్లు సమాచారం. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు భావించాలని బాబు వారికి సూచించినట్లు తెలుస్తోంది.
టీడీపీలో చేరిక అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తమ నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించుకున్నందున నేడు అధికారికంగా వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నా తాము.. గత ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా బరిలో దిగామని, అధిష్ఠానం వైఖరిలో మార్పు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏదైనా తప్పు జరిగిందని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికీ భావించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకతతో టీడీపీలో చేరాల్సి వచ్చిందన్నారు.
టీడీపీలో చేరిన ఆనం సోదరులు
Published Wed, Dec 2 2015 11:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM