ఉత్తర ఢిల్లీ మేయర్గా చందోలియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నిరసనలు, వాకౌట్ల మధ్య ఉత్తరఢిల్లీ మూడో మేయర్గా యోగేందర్ చందోలియా ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ ఆజాద్సింగ్ తన వారసుడిగా చందోలియాను ప్రకటించారు. బీజీపే మద్దతుదారుల గుమిగూడడంతో సభ లోపల, బయట కొంత గందరగోళం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలి కాబట్టి ఎన్డీఎమ్సీని (ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) వదిలి వెళ్లాల్సిందిగా చందోలియా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అయితే సభా కార్యకలాపాలు మొదలు కాగానే... ప్రతిపక్ష నేత ముఖేష్ గోయల్ నేతృత్వంలోని కాంగ్రెస్ కౌన్సిలర్లంతా నిరసనకు దిగారు. చందోలియాను అధికారికంగా మేయర్గా ప్రకటించకముందే వాకౌట్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వీళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన గోయల్ సభలో ఇంతటి గందరగోళం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని విచారం వ్యక్తం చేశారు. భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అలా సభలోకి చొచ్చుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు అలా వాకౌట్ చేయడంపై మేయర్ చందోలియా విచారం వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్ష సభ్యులకు ధన్యావాదాలు చెబుదామనుకునే సభలోకి వచ్చానని, అయితే కనీసం సభా కార్యకలాపాలు ముగిసేంతవరకు కూడా సభ్యులు సభలో ఉండకపోవడం బాధ కలిగించిందని చందోలియా అన్నారు.
రానున్న వానాకాలంలో పరిశుభ్రత, వరదల నియంత్రణ తమ ప్రథమ కర్తవ్యాలుగా ఉంటాయని చందోలియా తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభజనకు ముందు 2010-11, 2011-12లో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సేవలందించారు. బీజేపీ కౌన్సిలర్ రవీంద్రగుప్తా డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. మున్సిపల్ పదవుల్లో ఇది రెండో అత్యున్నత పదవి. బీజేపీ నుంచి రేఖాగుప్తా, సంజీవ్ నయ్యర్, కాంగ్రెస్ నుంచి పృథ్వీసింగ్ రాథోడ్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.