Mazar-i-Sharif
-
తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు. మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్గాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్‌కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు. -
భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్
కాబూల్: అఫ్గనిస్థాన్‌లోని భారత కాన్సులేట్ రక్షణార్థం సాక్షాత్తూ అక్కడి గవర్నర్ తుపాకీ పట్టి కాసేపు పహారా కాసారు. బాల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్ అయిన అతా మహమ్మద్ నూర్ సోమవారం తుపాకీ పట్టుకొని మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయంలో కనిపించారు. భారత కాన్సులేట్ లక్ష్యంగా ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని అఫ్గన్ భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో బాల్ఖ్ రాజధాని అయిన మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి నూర్ మద్దతుగా నిలిచారు. కాన్సులేట్ వద్ద పహారా కాస్తున్న సైనికులతో ఆయన కాసేపు ముచ్చటించి.. పరిస్థితి సమీక్షించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా తుపాకీ పట్టుకొని.. గురి చూసి కాలుస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను నూర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ఆన్లైన్ లో హల్చల్ చేశాయి. 'మజర్ ఆపరేషన్ పూర్తికావొస్తుంది. పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగాయి. గవర్నర్ నూర్ వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాన్సులేట్ లోని అందరూ క్షేమంగా ఉన్నారు' అని అఫ్గన్‌లోని భారత రాయబారి అమర్ సిన్హా ట్వీట్ చేశారు. ఆపదలో ఒక స్నేహితుడిలా అండగా నిలిచి.. గవర్నర్ తుపాకీ పట్టారంటూ స్థానిక జర్నలిస్టు చేసిన ట్వీట్ ను కూడా అమర్ సిన్హా రీట్వీట్ చేశారు. నూర్ మాజీ ముజాహిద్దీన్. అఫ్గన్ లో సొవియట్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ పోరాడిన ఆయన సైనిక శిక్షణ పొందారు. అఫ్గన్ లో తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అహ్మద్ షా మసూద్ సైన్యంలో కమాండర్ గా పనిచేవారు. భారత కాన్సులేట్ ముట్టడికి ఉగ్రవాదులు చేసిన దాడిని అఫ్గన్ బలగాలు విఫలం చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో ఈ ఆపరేషన్ సోమవారం రాత్రితో ముగిసింది.