భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్ | Afghan provincial governor wields gun to save Indian mission | Sakshi
Sakshi News home page

భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్

Published Tue, Jan 5 2016 10:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్

భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్

కాబూల్: అఫ్గనిస్థాన్లోని భారత కాన్సులేట్ రక్షణార్థం సాక్షాత్తూ అక్కడి గవర్నర్ తుపాకీ పట్టి కాసేపు పహారా కాసారు. బాల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్ అయిన అతా మహమ్మద్ నూర్ సోమవారం తుపాకీ పట్టుకొని మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయంలో కనిపించారు. భారత కాన్సులేట్ లక్ష్యంగా ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని అఫ్గన్ భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో బాల్ఖ్ రాజధాని అయిన మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి నూర్ మద్దతుగా నిలిచారు. కాన్సులేట్ వద్ద పహారా కాస్తున్న సైనికులతో ఆయన కాసేపు ముచ్చటించి.. పరిస్థితి సమీక్షించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా తుపాకీ పట్టుకొని.. గురి చూసి కాలుస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను నూర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ఆన్లైన్ లో హల్చల్ చేశాయి.

'మజర్ ఆపరేషన్ పూర్తికావొస్తుంది. పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగాయి. గవర్నర్ నూర్ వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాన్సులేట్ లోని అందరూ క్షేమంగా ఉన్నారు' అని అఫ్గన్లోని భారత రాయబారి అమర్ సిన్హా ట్వీట్ చేశారు. ఆపదలో ఒక స్నేహితుడిలా అండగా నిలిచి.. గవర్నర్ తుపాకీ పట్టారంటూ స్థానిక జర్నలిస్టు చేసిన ట్వీట్ ను కూడా అమర్ సిన్హా రీట్వీట్ చేశారు.

నూర్ మాజీ ముజాహిద్దీన్. అఫ్గన్ లో సొవియట్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ పోరాడిన ఆయన సైనిక శిక్షణ పొందారు. అఫ్గన్ లో తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అహ్మద్ షా మసూద్ సైన్యంలో కమాండర్ గా పనిచేవారు. భారత కాన్సులేట్ ముట్టడికి ఉగ్రవాదులు చేసిన దాడిని అఫ్గన్ బలగాలు విఫలం చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో ఈ ఆపరేషన్ సోమవారం రాత్రితో ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement