amar sinha
-
భారత కాన్సులేట్ కోసం తుపాకీ పట్టిన గవర్నర్
కాబూల్: అఫ్గనిస్థాన్‌లోని భారత కాన్సులేట్ రక్షణార్థం సాక్షాత్తూ అక్కడి గవర్నర్ తుపాకీ పట్టి కాసేపు పహారా కాసారు. బాల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్ అయిన అతా మహమ్మద్ నూర్ సోమవారం తుపాకీ పట్టుకొని మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయంలో కనిపించారు. భారత కాన్సులేట్ లక్ష్యంగా ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని అఫ్గన్ భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో బాల్ఖ్ రాజధాని అయిన మజర్ ఇ షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి నూర్ మద్దతుగా నిలిచారు. కాన్సులేట్ వద్ద పహారా కాస్తున్న సైనికులతో ఆయన కాసేపు ముచ్చటించి.. పరిస్థితి సమీక్షించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా తుపాకీ పట్టుకొని.. గురి చూసి కాలుస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను నూర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ఆన్లైన్ లో హల్చల్ చేశాయి. 'మజర్ ఆపరేషన్ పూర్తికావొస్తుంది. పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగాయి. గవర్నర్ నూర్ వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాన్సులేట్ లోని అందరూ క్షేమంగా ఉన్నారు' అని అఫ్గన్‌లోని భారత రాయబారి అమర్ సిన్హా ట్వీట్ చేశారు. ఆపదలో ఒక స్నేహితుడిలా అండగా నిలిచి.. గవర్నర్ తుపాకీ పట్టారంటూ స్థానిక జర్నలిస్టు చేసిన ట్వీట్ ను కూడా అమర్ సిన్హా రీట్వీట్ చేశారు. నూర్ మాజీ ముజాహిద్దీన్. అఫ్గన్ లో సొవియట్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ పోరాడిన ఆయన సైనిక శిక్షణ పొందారు. అఫ్గన్ లో తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అహ్మద్ షా మసూద్ సైన్యంలో కమాండర్ గా పనిచేవారు. భారత కాన్సులేట్ ముట్టడికి ఉగ్రవాదులు చేసిన దాడిని అఫ్గన్ బలగాలు విఫలం చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో ఈ ఆపరేషన్ సోమవారం రాత్రితో ముగిసింది. -
కాబూల్‌లో పేట్రేగిపోయిన తాలిబన్లు
గెస్ట్‌హౌస్‌పై దాడి.. 14 మంది మృతి మృతుల్లో నలుగురు భారతీయులు.. ఓ అమెరికన్ భారత రాయబారే టార్గెట్ కాబూల్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఓ అతిథి గృహంపై దాడి చేసి నలుగురు భారతీయులు, ఒక అమెరికా పౌరుడు సహా 14 మందిని తుపాకులతో కాల్చి చంపారు. భారత రాయబారే ముష్కరుల టార్గెట్ అయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి కలోలా పుష్తా ప్రాంతంలోని పార్క్ ప్యాలెస్ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి ముగ్గురు ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టారు. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఏడు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ముష్కరులు హతమయ్యారు. మొత్తం 54 మందిని బలగాలు కాపాడాయి. ఈ అతిథి గృహంలో భారత రాయబారి అమర్ సిన్హా ఉన్నట్లు ఉగ్రవాదులు భావించి ఉంటారని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సన్నిహితుడు అహ్మద్ జియా మసూద్ పేర్కొన్నారు. ఈ గెస్ట్‌హౌస్‌లో మరికొద్దిసేపట్లో సంగీత కచేరి మొదలవుతుందనగా ఉగ్రవాదులు దాడి చేశారు. కచేరీ జరుగుతుండగా ముష్కరులు దాడి చేసి ఉంటే చాలామంది వారి తూటాలకు బలయ్యేవారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన నలుగురు భారతీయుల్లో ఇద్దరు ప్రైవేటు ఆడిటర్లు, ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఉన్నారు. కాల్పులకు తెగబడింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికన్లతోపాటు వివిధ దేశాలకు చెందినవారు వచ్చే అవకాశం ఉండడంతో దాడి చేసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ఈ ఘటన తెలియగానే చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ.. అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీకి ఫోన్ చేసి మాట్లాడారు.