కాబూల్‌లో పేట్రేగిపోయిన తాలిబన్లు
గెస్ట్‌హౌస్‌పై దాడి.. 14 మంది మృతి
మృతుల్లో నలుగురు భారతీయులు.. ఓ అమెరికన్
భారత రాయబారే టార్గెట్
కాబూల్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఓ అతిథి గృహంపై దాడి చేసి నలుగురు భారతీయులు, ఒక అమెరికా పౌరుడు సహా 14 మందిని తుపాకులతో కాల్చి చంపారు. భారత రాయబారే ముష్కరుల టార్గెట్ అయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి కలోలా పుష్తా ప్రాంతంలోని పార్క్ ప్యాలెస్ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి ముగ్గురు ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టారు. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఏడు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ముష్కరులు హతమయ్యారు. మొత్తం 54 మందిని బలగాలు కాపాడాయి.
ఈ అతిథి గృహంలో భారత రాయబారి అమర్ సిన్హా ఉన్నట్లు ఉగ్రవాదులు భావించి ఉంటారని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సన్నిహితుడు అహ్మద్ జియా మసూద్ పేర్కొన్నారు. ఈ గెస్ట్‌హౌస్‌లో మరికొద్దిసేపట్లో సంగీత కచేరి మొదలవుతుందనగా ఉగ్రవాదులు దాడి చేశారు. కచేరీ జరుగుతుండగా ముష్కరులు దాడి చేసి ఉంటే చాలామంది వారి తూటాలకు బలయ్యేవారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన నలుగురు భారతీయుల్లో ఇద్దరు ప్రైవేటు ఆడిటర్లు, ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఉన్నారు. కాల్పులకు తెగబడింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికన్లతోపాటు వివిధ దేశాలకు చెందినవారు వచ్చే అవకాశం ఉండడంతో దాడి చేసినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన తెలియగానే చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ.. అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీకి ఫోన్ చేసి మాట్లాడారు.