Mecca Masjid blast
-
2007 మక్కా మసీదు పేలుళ్లు.. మాసిపోని మరక
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. అది 2007, మే 18వ తేదీ మధ్యాహ్నం. సుమారు 1.15 గం.ల సమయంలో మక్కా మసీదు వజుఖానా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో ఊహించే లోపే అక్కడంతా అల్లకల్లోలంగా మారింది. ఐఈడీ బాంబు పేలుడుతోనే ఈ ఘోరం సంభవించినట్లు పోలీసులు తర్వాత నిర్ధారించారు. మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. పేలుడు సంభవించిన స్థలానికి సమీపంలోనే.. పేలని మరో ఐఈడీ బాంబ్ ని గుర్తించారు పోలీసులు. అరెస్టుల పర్వం ►జూన్ 2010 లో ఈ కేసులో CBI నిందితుల ఛార్జీషీట్ లో సునీల్ జోషి పేరును చేర్చింది. అయితే డిసెంబర్ 29, 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ జోషి హత్యకు గురయ్యాడు. ► ఆపై నవంబర్ 19, 2010న హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) నిందితుడిగా గుర్తించారు. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ► డిసెంబర్ 18, 2010న మక్కా మసీదు పేలుడు కేసులో అసీమానంద అరెస్ట్ అయ్యాడు. ► 2011 డిసెంబర్ 3 న మక్కా మసీదు పేలుడు కేసులో మరో అరెస్ట్ జరిగింది. జరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్ అయ్యాడు. ► ఏప్రిల్ 2011లో ఈ కేసుని సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ కి బదిలీ చేసింది. ► 2013 మార్చి 2న మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ ని పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ► మార్చి 23, 2017న హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అసీమానందకు బెయిల్ మంజూరు అయ్యింది. ► ఏడేళ్ల తర్వాత అసీమానందకు విముక్తి. మార్చి 31, 2017న అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ► ఏప్రిల్ 16, 2018 న ఈ కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చిన నాంపల్లి కోర్టు. ► నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులపై ఉన్న కేసును కొట్టివేసీన నాంపల్లి కోర్టు. -
నిగ్గు తేలని నిజం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ళ కేసులో అయిదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం దర్యాప్తు సంస్థల నిర్వాకానికి తాజా నిద ర్శనం. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ప్రార్థన సమయంలో హైదరాబాద్ పాత బస్తీలోని మక్కామసీదులో సెల్‌ఫోన్ ద్వారా బాంబులు పేల్చడం వల్ల తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాంబు పేలుళ్ళ తర్వాత మసీదు వెలుపల కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్ళు రువ్విన కారణంగా పోలీసులు జరిపిన కాల్పులలో అయిదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు ఇంతకాలం న్యాయం కోసం వేచి చూసి తీర్పు వివరాలు తెలు సుకొని నిరాశ చెందారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు క్రమంలో సుమారు రెండు వందలమంది అనుమా నితులను ప్రశ్నించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ప్రథమంగా బిలాల్ అనే ఉగ్రవాదిని పేలుళ్ళకు సూత్రధారిగా అనుమానించారు. పాకిస్తాన్లో స్థావరం కలిగిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–జిహాద్–ఇ–ఇస్లామీ (హెచ్యూజేఐ)లో బిలాల్ సభ్యుడని దర్యాప్తు అధికారులు భావించారు. కానీ అనుమానాన్ని ధ్రువీక రించడానికి తగిన ఆధారాలు లభించలేదు. న్యాయస్థానం బిలాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అద నపు సమాచారం అందింది. 2006–07లో మక్కామసీదుతో పాటు మరో మూడు ప్రాంతాలలో సెల్‌ఫోన్ ద్వారా జరిపిన పేలుళ్ళు సంభవించాయి. మహారాష్ట్రలోని మాలేగాంలో 2006లో పేలుళ్ళు జరిగాయి. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లోనూ, అజ్మీర్ దర్గాలోనూ 2007లో అదే ఫక్కీలో బాంబులు పేలాయి. ఈ ఘాతుకాల వెనుక ఒకే సంస్థ ఉన్నదనే అభిప్రాయానికి వచ్చిన సీబీఐ ఆ దిశగా దర్యాప్తు కొనసాగించింది. ‘అభినవ్ భారత్’ అనే హిందూ తీవ్రవాద సంస్థ ఈ నేరం చేసినట్టు గుర్తించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దేవేందర్‌సింగ్, వ్యాపారి లోకేశ్ శర్మ, ఆయన గురువు సునీల్ జోషీలు మక్కామసీదు కాల్పుల వెనుక ఉన్నారని నిర్ధారించింది. ‘అభినవ్ భారత్’ మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూత్వవాదులు ఇండోర్ కేంద్రంగా నడుపుతున్న సంస్థ అని సీబీఐ అభిప్రాయం. దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం లేకుండానే అనూహ్యమైన పరిస్థితులలో సునీల్ జోషీని మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సీబీఐ మొత్తం 68 మంది సాక్షులను విచారించగా వారిలో 54 మంది ఎదురు తిరిగారు. ఈ దశలో నాలుగు పేలుళ్ళ కేసుల దర్యాప్తు బాధ్య తను సీబీఐ నుంచి ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ–జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించారు. ఈ సంస్థ చేసిన దర్యాప్తులో అసీమానంద అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, గుజరాత్ ఆశ్రమ నివాసి ప్రధాన నిందితుడని తేలింది. ఆయనతో పాటు మరి పదిమందిపై అభియోగాలు చేశారు. 2017 మార్చిలో దేవేందర్ గుప్తాను అజ్మీర్ దర్గా పేలుళ్ళ కేసులో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో అసీమానందను నిర్దోషిగా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. కానీ మక్కామసీదు కేసులో మాత్రం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అయిదుగురిని మాత్రమే విచారించి మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. వారిపైన ఎన్ఐఏ చేసిన అభియోగా లను నిరూపించేందుకు తగిన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోయిం దని భావించిన 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె. దేవేందర్‌రెడ్డి అయిదు గురినీ నిర్దోషులుగా ప్రకటించారు. నిందితుడైన దేవేందర్ గుప్తా సిమ్ కొన్నట్టు కానీ, మరో నిందితుడు రాజేందర్ చౌదరి బాంబు పేల్చినట్టు కానీ రుజువులు లేవని జడ్జి నిర్ణయించారు. ఇంతటి కీలకమైన కేసులో తీర్పు చెప్పిన వెంటనే రాజీనామా లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్‌కు పంపించి జడ్జి రవీందర్‌రెడ్డి సంచలనం కలిగించారు. రాజీనామాకు దారితీసిన కారణాలపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జడ్జిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ సారథ్యంలోనైనా దర్యాప్తు వేగం, సామర్థ్యం పెంచి దోషులను పట్టు కొని, తగిన ఆధారాలు సేకరించి, శిక్ష పడేవిధంగా ప్రాసిక్యూషన్ వాదించి ఉంటే దర్యాప్తు సంస్థ మోపిన అభియోగాలు నిజమని నిర్ధారణ జరిగేది. సీబీఐ కానీ ఎన్ఐఏ కానీ నిందితులపైన పెట్టిన కేసులలో వీగిపోయినవే అత్యధికం. ఎన్ఐఏ డైరెక్టర్‌గా శరద్ కుమార్ సేవలను పొడిగించడం ఒక వివాదాస్పదమైన అంశం. అసీమానం దకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో అప్పీలు చేయాలని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎన్ఐఏ అధికారులు కేంద్ర కార్యాలయానికి సిఫార్సు చేసినప్పటికే ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళ కేసులో అసీమానందకు బెయిల్ మంజూరైనప్పుడు కూడా ఎన్ఐఏ పైకోర్టులో అప్పీలు చేయలేదు. ఈ కేసులో ఇంద్రేశ్ కుమార్, ప్రజ్ఞాఠాకూర్ వంటి చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులకు మిన హాయింపు మంజూరు చేశారు. అసీమానంద స్వయంగా మక్కామసీదు పేలుళ్ళను ఎట్లా జరిపారో వివరంగా న్యాయస్థానంలోనూ, మీడియా ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా అసీమానందను నిర్దోషిగా కోర్టు నిర్ణయించడం విశేషం. 2010 డిసెంబర్ 8న అసీమానంద కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట నేరం అంగీకరించారు. ‘నాకు మరణదండన విధించే అవకాశం ఉన్నదని నాకు తెలుసు. అయినా సరే నేరం అంగీకరిస్తూ ప్రకటన చేయదలిచాను’ అంటూ మాట్లాడారు. పోలీసు కస్టడీలో తీసుకున్న నేరాంగీకార వాంగ్మూలం చెల్లనేరదని జడ్జి రవీందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ కేసులో తీర్పుపైన బీజేపీ ఆనందం వెలిబుచ్చింది. కర్ణాటక ఎన్నికల ముందు ఇటువంటి తీర్పు రావడం రాజకీయంగా బీజేపీకి సాను కూలమైన పరిణామం. దేశంలో దర్యాప్తు సంస్థలు ఏ స్థాయిలో ఉన్నా ఏ పేరుమీద ఉన్నా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితులు లేవనే వాస్తవాన్ని చాలాకాలం క్రితమే ప్రజలు అర్థం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థ సైతం అంత నిజాయితీగా, నిర్భయంగా విధ్యుక్తధర్మం నెరవేర్చడం లేదనడానికి హైదరాబాద్‌లో ఒకే ఒక నెలలో అవినీతి ఆరో పణలపైన ముగ్గురు జడ్జీలు అరెస్టు కావడం నిదర్శనం. పదకొండు సంవత్సరాల పాటు దర్యాప్తూ, విచారణా జరిగినప్పటికీ మక్కామసీదులో ఆనాడు పేలుళ్ళు జరిపిన వ్యక్తులు ఎవ్వరనే శేషప్రశ్న జాతిని వెక్కిరిస్తూనే, వేధిస్తూనే ఉంటుంది. -
‘మక్కా’ నిందితులకి బెయిల్
హైదాబాద్ : పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులుగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద, భరత్ భాయ్లకు బెయిల్ మంజూరైంది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను 2010లో పోలీసులు అరెస్టు చేశారు. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ ,‘సంఝౌతా ఎక్స్ ప్రెస్‌లో పేలుడు’ కేసుల్లో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన అసిమానంద బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. -
‘మక్కా’ నిందితులు మరణించారా?
- వాంటెడ్‌గా ఉన్న రామ్‌చంద్ర, సందీప్ ధాంగే - 2008లో ‘చనిపోయారన్న’ ఏటీఎస్ మాజీ అధికారి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని మక్కా మసీదు లో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో వాంటెడ్ నిందితులుగా ఉన్న రామ్‌చంద్ర కస్సంగ్రా, సందీప్ ధాంగే ‘మరణించారా’..? మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) మాజీ ఇన్స్పెక్టర్ మహబూబ్ ముజావర్ ఇటీవల అక్కడి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ఈ అను మానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ముజావర్ గత వారం ఓ జాతీయ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆ ఇద్దరూ 2008లోనే ఏటీఎస్ కస్టడీలో చనిపోయారని ప్రకటించారు. తనకు ‘ఆ విషయం’ తెలిసినందుకే తనపై అక్రమం గా కేసులు బనాయించి అప్రతిష్టపాలు చేశారని పేర్కొన్నారు. మక్కా మసీదు పేలుడు ఘటనలో 9 మంది ప్రాణాలు విడువగా.. ఆ తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. 58 మంది క్షతగా త్రులయ్యారు. హుస్సేనిఆలం పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు.. అక్కడ నుంచి సీబీఐ వెళ్లాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ముంబై దాడుల రోజే: ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ముజావర్ ప్రకటనతో ‘మక్కా’తో పాటు మాలే గావ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, అజ్మీర్ దర్గా బ్లాస్ట్ కేసులు కొత్త మలుపు తిరిగాయి. ఈ కేసులన్నింటిలోనూ రామ్‌చంద్ర, సందీప్ నిందితు లుగా ఉన్నారు. వీరిద్దరినీ మాలేగావ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు 2008లోనే పట్టుకున్నారని ముజావర్ పేర్కొన్నారు. ఆ టీమ్‌లో తానూ సభ్యుడిగా ఉన్నానని, 26/11 ముంబై దాడులు జరిగిన 2008 నవంబర్ 26న వీరిద్దరూ ఏటీఎస్ కస్టడీలో చనిపోయారని సంచల నాత్మక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అంశాలను న్యాయస్థానం ముందు ఉంచుతానం టూ షోలాపూర్ మేజిస్ట్రేట్ కోర్టులో గత నెల మొదటి వారంలో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు, నిఘా వర్గాల కన్ను ముజావర్తో పాటు ఏటీఎస్‌పై పడింది. ఆదాయానికి మించి ఆస్తులు, ఆయుధ చట్టం కింద నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముజావర్ అఫిడవిట్ ఎంత వరకు వాస్తవమనేది ఆరా తీస్తున్నాయి. ‘మాలేగావ్’తో వీడిన చిక్కుముడి.. మక్కా మసీదులో పేలుడు జరిగిన 3 నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో బాంబు పేలింది. ఈ రెంటికీ సారూప్యతలు ఉండటంతో ఒకే మా డ్యుల్ పనిగా అనుమానించారు. మహా రాష్ట్రలోని మాలేగావ్ పేలుడు(రెండోసారి) కేసు లో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్‌కు చెం దిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌ను 2008 అక్టోబర్ 28న అరెస్టు చేశారు. వీరి విచార ణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్ పేర్లు వెలుగులోకి వచ్చా యి. 2010 ఏప్రిల్ 28న రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మను పట్టు కున్నారు. విచారణలో ‘మక్కా’ పనీ తమదేనని అంగీకరించడంతో మూడేళ్ల తర్వాత చిక్కుముడి వీడింది. ‘మక్కా’ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. మూడేళ్ల తర్వాత సీబీఐ.. దేవేంద్ర, లోకేష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకురావడంతోపాటు స్వామి అశిమా నందను అరెస్టు చేశారు. మరో నిందితుడు సునీ ల్జోషి 2007లోనే హత్యకు గురయ్యాడని తేలిం ది. రామ్‌చంద్ర, సందీప్ థాంగే ఇప్పటికీ పరారీ లోనే ఉన్నారని అధికారులు అంటున్నారు. -
మక్కా పేలుళ్లు జరిగి నేటికి ఏడేళ్లు
చార్మినార్: పాతబస్తీ మక్కా మసీదులో పేలుడు జరిగి ఆదివారానికి ఏడేళ్లవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2007 మే 18న మక్కా మసీదులో సంభవించిన పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా పలుచోట్ల ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఇక మక్కా మసీదు వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మక్కా మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రే ష్ట త్రిపాఠీ తెలిపారు. 6 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 7 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలతో పాటు దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. అశ్విక దళాలు గస్తీ తిరుగుతున్నాయన్నారు. పాతబస్తీలో నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. వెంటాడుతున్న విషాదం... చార్మినార్ : మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి ఏడేళ్లైనా.. ఆ నాటి విషాద ఘటన పాతబస్తీ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. 2007 మే 18న వుధ్యాహ్నం 1.18 గంటలకు బాంబు పేలింది. ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి మృతుల కుంటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ వారిని ఎన్ని లక్షలు వెచ్చించినా తీసుకు రాలేవు కదా.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి రాష్ర్ట ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష, ఇతరు నుంచి కూడా ఆర్థిక సహాయం అందిందనప్పటికీ... తమ వారు లేని లోటు తీర్చలేనిదంటున్నారు. బాంబు పేలుడు ఘటన ...తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు తమకు తీరని నష్టం జరిగిదంటున్నారు. నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన ఇర్ఫాన్షరీఫ్ మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం అందింది. ఆ డబ్బుతో అతని ఇద్దరు తోబుట్టువుల వివాహాలు చేశారు. అలాగే మిశ్రీగంజ్‌కు చెందిన అక్రం అలీ ఖాన్ కుమారుడు సాజిద్ అలీఖాన్ మక్కామసీదు బాంబు పేలుడు ఘటనలో మృతి చెందడంతో...అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 6 లక్షల ఆర్థిక సహాయం లభించింది. దీంతో ఆమె వచ్చిన డబ్బుతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. అటు కుమారుడు లేక...ఇటు కోడలు లేక వయోవృద్ధుడైన అక్రం అలీ నిర్జీవంగా ఇంట్లో కాలం గడుపుతున్నాడు. ప్రస్తుతం తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ.... తమ వారు లేని లోటును ఎవరు తీరుస్తారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు.