mechanism
-
టెక్నాలజీ తోడై..!, పెన్ను వేలెడు.. రాత బారెడు
కీచైన్‌కు వేలాడుతూ వేలెడంత కనిపించే ఈ పెన్ను మన్నిక తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. నానో ఇంకుతో పనిచేసే ఈ పెన్ను వంద పెన్సిళ్ల మన్నిక కంటే ఎక్కువే! టిటానియమ్తో రూపొందించిన ఈ పెన్నులో ఒక నానో ఇంకు కాట్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒక జీవితకాలం మన్నుతుంది. దీనికి రీఫిల్ వేసుకోవడం, ఇంకు నింపుకోవడం, కాట్రిడ్జ్ మార్చుకోవడం వంటి అవసరమే ఉండదు. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ క్యాప్ పెన్ను మొనను సురక్షితంగా ఉంచుతుంది. ‘ఇన్నోజూమ్’ అనే అమెరికన్ స్టార్టప్ సంస్థ క్రౌడ్‌ఫండింగ్ ద్వారా దీని రూపకల్పనకు నడుం బిగించింది. కనీస స్థాయిలో ఈ నానో ఇంకు పెన్నును మార్కెట్లోకి విడుదల చేయాలంటే 20 వేల డాలర్లు (రూ.16.67 లక్షలు) అవసరమవుతాయని ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు మూడువేల డాలర్లు (రూ.2.50 లక్షలు) మాత్రమే పోగయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ఎంత త్వరగా పూర్తి డబ్బు సమకూరితే, అంత త్వరగా ఈ పెన్ను మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ పెన్ను ధర డిజైన్, నాణ్యతను బట్టి 29 నుంచి 99 డాలర్ల వరకు (రూ. 2,418 నుంచి రూ.8,255) ఉండవచ్చని అంచనా. -
యాదాద్రి ప్రసాదానికి యంత్రాంగం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సందర్శిం చే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా ఆధునిక యంత్రాలతో మానవప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది. మార్చి 28న లక్ష్మీనరసింహసింహ స్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ప్రసాదం తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రోజుకు 70వేలకు పైగా లడ్డూలు, రోజుకు నాలుగుసార్లు ఒకేసారి 1,000 కిలోల పులిహోర తయారు చేసేలా రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు.పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు రూ.5కోట్ల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. ప్రత్యేక మెషీన్లు..: ప్రసాదం కాంప్లెక్స్‌లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషీన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకొచ్చే విధంగా పనులు పూర్తిచేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషీన్‌ను బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటర్లతో బెల్ట్‌ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషీన్ వద్దకు తీసుకువెళ్లేందుకు బెల్ట్‌ను బిగించారు. భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా 13 కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదాన్ని అధికారులు హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులకు అప్పగించగా..గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ప్రసాదం నాణ్యత,రుచిని పరిశీలించారు. మంగళవారం మూడోసారి ట్రయల్ రన్ చేశారు. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణనిస్తున్నారు. -
మీకిదే ఆఖరి ఛాన్స్: కేంద్రంపై సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల విషయానికి సంబంధించి శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. వారంలోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కృష్ణన్ కౌల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. గతంలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా 2017 సెప్టెంబర్ 1న త్వరలోనే పూర్తి చేస్తామంటూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో ఈ విషయంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 'భారత ప్రభుత్వ విధానం బలమైనది. దాన్ని మీరు ప్రతి రోజు ఎప్పుడంటే అప్పుడు మార్చలేరు' అని కేంద్రం తరపున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది అజిత్ సిన్హాను అత్యున్నత ధర్మాసనం మందలించింది. 'మీరు చెప్పినట్లుగా మీరు నడుచుకోలేదు. మీరు 2017లో ఇచ్చిన అఫిడవిట్లో శాశ్వత మెకానిజానికి సంబంధించి స్పష్టంగా లేదు. మీరు ఎప్పుడు ఆ పని పూర్తి చేయనున్నారు.. అసలు దానిపై ప్రభుత్వ వ్యూహాం ఏమిటి? అసలు ఆ విధానం కావాలనుకుంటున్నారా? వద్దని అనుకుంటున్నారా? మీరు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో సంతృప్తికరమైన వివరణ ఏదీ లేదు. మాకు ఇప్పుడు చెప్పడానికి మీ దగ్గర ఒక్క మాట లేకపోవచ్చు.. కానీ మీకు మాత్రం బహుశా ఇదే చివరి అవకాశం' అని కోర్టు హెచ్చరించింది. -
ఎన్నికల్లో డబ్బు నియంత్రణకు యంత్రాంగం
హైదరాబాద్: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలను, అభ్యర్థులను నియంత్రించేందుకు ఒక అర్థవంతమైన యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. జాతి ప్రయోజనం కోసమే ఇది తప్పనిసరి అని, దీని వల్ల నల్లధనం కూడా బయటకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై నమోదైన కేసులో కోర్టు సహాయకులు (అమి కస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, వేదుల వెంకటరమణను నియమించింది. ఈ కేసు రికార్డులను వారికివ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఎన్నికల్లో డబ్బు నియం త్రణపై దాఖలైన పిల్‌పై చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉపాధికి ఊతం
ఎటపాకలోని ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్(వీటీఐ) ద్వారా ప్రస్తుతం 82 మంది శిక్షణ పొందుతున్నారు. జీపు డ్రైవింగ్, మెకానిజం, ప్లంబింగ్, కనస్ట్రక్షన్, బోర్వెల్ మెకానిక్ తదితర ట్రేడ్లలో తర్ఫీదు ఇస్తున్నారు. మూడు నెలల ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఐటీడీఏ ద్వారా ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జీపు డ్రైవింగ్ నేర్చుకున్న వారికి లెసైన్సు ఇప్పించటంతో పాటు, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే వాహనాలను వారే నడిపించేందుకు అవకాశం కల్పించనున్నారు. బోర్వెల్ మెకానిక్‌లో శిక్షణ పొందిన వారికి పంచాయతీల్లో, కన్స్ట్రక్షన్ తర్ఫీదు పొందిన వారికి గృహ నిర్మాణ సంస్థల్లో పనులు కల్పించనున్నారు. వీటీఐకి పూర్వవైభవం గిరిజన నిరుద్యోగ యువతీ, యువకలకు ఉపాధిని కల్పించేందుకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎటపాక సమీపంలో 1997లో వీటీఐను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.1.04 కోట్లను ఖర్చు చేసి 1,503 మంది గిరిజనుల స్వయం ఉపాధి కోసం వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ సంస్థ కూడా గుర్తింపునిచ్చింది. కొండరెడ్లకు వెదురు ఉత్పత్తుల తయారీనే ప్రధాన జీవనాధారమని గుర్తించిన అప్పటి అధికారులు, ఈ కేంధ్రం ద్వారా బాంబో క్రాప్ట్స్ తయారీపై శిక్షణ ఇప్పించారు. తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కూడా కల్పించి వారికి ఇతోధికంగా సహాయపడ్డారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థకు నిధుల కొరత కారణంగా 2011లో మూతపడింది. ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టు అధికారులు దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వీటీఐ మూత పడినట్లేనని అంతా భావించారు. కానీ ప్రస్తుత పీఓ దివ్య మళ్లీ దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఉపాధికి మళ్లీ పునాది ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌లో ఎక్కువ మంది ఉపాధి కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఉన్నప్పటికీ, ఇలా దర్బార్‌కు ఎందుకొస్తున్నారని పీఓ దివ్య ఆరా తీశారు. కొన్నేళ్లుగా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ద్వారా నియామకాలు లేకపోవడమే కారణమని తెలుసుకున్న ఆమె దీనిపై సమీక్షించారు. ఏజెన్సీలోని ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్నపాటి ఉద్యోగమైన ఎంప్లాయిమెంట్ సిఫార్సు ద్వారా కల్పించాలని ఆదేశాలు ఇస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీటీ ఐ మూత పడిన విషయాన్ని తెలుసుకున్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు వీటీఐ అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన పీవో దీన్ని తెరిపించేందుకు ప్రతిపాద నలు తెప్పించుకున్నారు. శిక్షణ కోసం రూ. 9.17 లక్షలు విడుదల చేశారు. దీంతో వీటీఐలో 19వ బ్యాచ్ ప్రారంభమైంది. శాశ్వత కేటాయింపులు లేకనే... వీటీ ఐను మంచి ఆశయంతో నిర్వహిస్తున్నప్పటికీ, ఐటీడీఏ అధికారుల ద యా దాక్షణ్యాలుంటేనే శిక్షణలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ సంస్థ గుర్తింపు ఉన్నప్పటికీ దీనికి శాశ్వత నిధులు లేకపోవటం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. సొంత మార్కు కాకుండా గిరిజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాలనే సాగించే అధికారులున్నంత కాలం దీని నిర్వహణ ఢోకా లేకున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు మారినప్పుడల్లా ఇది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే మూడేళ్ల పాటు మూత వేయాల్సి వచ్చింది. దీని నిర్వహణకు ఆటంకం లేకుండా ప్రభుత్వం ద్వారా తగిన నిధులు రాబట్టేందుకు ప్రస్తుత పీఓ దృష్టి సారించాలని గిరిజన యువత కోరుతోంది. ఇది పీఓ దివ్య వల్ల సాధ్యమవుతుందనే నమ్మకాన్ని కూడా గిరిజన సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రలో విలీనంతో పయనమెటు..? వీటీఐ ఉన్న ఎటపాక ప్రాంతం ఏపీలో విలీనమైంది. దీని కోసం ఇటీవల నిర్మించిన భవనాల్లో ఏపీ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చే యాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న సంస్థను జిల్లాలోని వేరే చోటికి తరలించక తప్పలేదు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఐటీడీఏ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.