ఆల్ ద బెస్ట్
నేడే ఎంసెట్
ఏర్పాట్లు పూర్తి
325 స్పెషల్ బస్సుల ఏర్పాటు
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్
సాక్షి, సిటీబ్యూరో: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ‘ఇంజనీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్)-2014’కు సర్వం సిద్ధమైంది. నగరంలోని ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరాన్ని ఎనిమిది జోన్లుగా విభజించారు. అభ్యర్థుల నివాసాలకు ఐదు కి లోమీటర్ల రేడియస్‌లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
ఈ కేంద్రాలుండే మార్గంలో ఆర్టీసీ 325 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంసెట్ రాయనున్న అభ్యర్థులు చేయాల్సిందల్లా.. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరడమే. నిర్దేశిత సమయం కన్నా నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించమని అధికారులు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓఎంఆర్ షీట్‌ను నింపేటపుడు ఇన్విజిలేటర్ సూచనలు పాటించాలి.
సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలను లోనికి అనుమతించరు. అభ్యర్థులు వెంట హాల్‌టికెట్, బాల్‌పాయింట్ పెన్నులు, ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఎంసెట్‌కు హాజరవుతున్న అభ్యర్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’ మరి.
ఏ జోన్ పరిధిలో ఏఏ ప్రాంతాలంటే..
కూకట్పల్లిః ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు
కుత్బుల్లాపూర్: బోరంపేట్, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్
మెహదీపట్నం: టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట,
గచ్చిబౌలి
మాసబ్‌ట్యాంక్: ఖెరతాబాద్, లక్డీకాపూల్, సైఫాబాద్, నాంపల్లి, సోమాజిగూడ, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్
ఓయూః విద్యానగర్, రామాంతపూర్, అంబర్‌పేట, హబ్సిగూడ, నాచారం, తార్నాక, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్
సికింద్రాబాద్ : రాణిగంజ్, ఎస్పీరోడ్, ఆర్పీరోడ్, ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్ మారేడ్‌పల్లి, జూబ్లీ బస్టాండ్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్
ముషీరాబాద్: గగన్‌మహల్, నారాయణగూడ, బషీర్‌బాగ్, బర్కత్‌పుర, చిక్కడపల్లి, హిమయత్ నగర్, హనుమాన్ తెక్డీ
రాజేంద్రనగర్: బండ్లగూడ, అప్పా జంక్షన్, మొయినాబాద్
ఆరు గంటలకు సెట్‌కోడ్ విడుదల
ఎంసెట్-2014 ఇంజనీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను గురువారం ఉదయం ఆరు గంటలకు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. జేఎన్టీయూహెచ్లోని అకడమిక్ స్టాఫ్ కళాశాల ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఎంసెట్-2014 చైర్మన్, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి డాక్టర్ రామేశ్వరరావు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.