టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్‌కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్‌తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్‌ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్‌ను కోల్పోవడం హమాస్‌కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు.