Meeting of the Council of Ministers
-
కేబినెట్ అజెండాపై నేడు స్క్రీనింగ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన మంత్రి మండలి సమావేశం అజెండాపై పరిశీలనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదించిన మంత్రివర్గ సమావేశం అజెండాలోని అంశాలపై సవివరమైన నోట్స్ పంపాలని ఆయా శాఖలకు సీఎస్ బుధవారం యువో నోట్ జారీ చేశారు. సవివరమైన నోట్ పంపాలని శాఖలకు ఆదేశం ఫొని తుపాను సహాయక చర్యలపై సవివరమైన కేబినెట్ అజెండా నోట్‌ను రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు పంపాలని రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్), ఆర్టీజీఎస్లను సీఎస్ ఆదేశించారు. తాగునీటిపై సవివరమైన కేబినెట్ అజెండా నోట్ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, కరువు, ఉపాధి హామీకి సంబంధించి కేబినెట్ అజెండా నోట్ పంపాలని ఆయా శాఖలకు సూచించారు. ‘కోడ్’ ఏం చెబుతోందంటే... ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్ అజెండా అంశాలను అధ్యయనం చేసేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. కేబినెట్ అజెండా అంశాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉన్నాయా లేదా? అనే విషయాన్ని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే బిజినెస్ రూల్స్, నిబంధనల మేరకు కేబినెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఆ అంశాలకు ఉందా లేదా అనేది కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తి రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి సంబంధిత ఉన్నతాధికారులు, సీఎస్‌తో సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చని ఎన్నికల ప్రవర్తన నియమావళి స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ అజెండాను సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. ఈనెల 14న కేబినెట్ సమావేశం ఉంటుందా లేదా? అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. స్క్రీనింగ్ కమిటీ పంపే అజెండా నోట్‌పై సందేహాలుంటే ఈసీకి వివరణ పంపాల్సి ఉంటుందని తెలిపారు. -
టోల్ తీశారు
వాహనదారుల జేబుకు చిల్లు రాష్ట్ర రహదారులపై కూడా ఇక టోల్ వసూలు మంత్రి మండలి నిర్ణయం బెంగళూరు : రాష్ట్ర రహదారులపై కూడా ఇక నుంచి టోల్‌ను వసూలు చేయాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన శనివారమిక్కడి విధానసౌధలో మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర పశుసంవర్థ, న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మీడియాకు వెల్లడించారు. అందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు.... ► రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లోని చిన్నారులపై జరుగుతున్న దౌర్జన్యాలకు ఇకపై సదరు విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనితో పాటు పిల్లల రక్షణ కోసం పోలీసు, విద్యాశాఖ రూపొందించిన పలు మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం ► రూ.58.6 కోట్లతో ఉత్తర కర్ణాటక జిల్లా దాండేలి వద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ► 4వ ఆర్థిక కమిషన్ ఏర్పాటుకు అనుమతి. అధ్యక్షుడితో సహా ముగ్గురు సభ్యులు. నివేదిక ఇవ్వడానికి ఏడాదిన్నర సమయం. ► ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గొల్ల, కాడుగొల్ల, అడవిగొల్లలను ఎస్టీ వర్గానికి చేర్చడానికి వీలుగా మంత్రి మండలి నిర్ణయం. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు ► రూ.12.60 కోట్లతో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖకు నూతన భవన నిర్మాణం ►యలహంక నుంచి గౌరిబిదనూరు మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకూ దాదాపు 76 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి, నిర్మాణం తదితర పనులను ప్రభుత్వ, ప్రైవేటు విధానంలో (పీపీపీ) రూ.152 కోట్ల నిధులతో చేపడుతారు. ఇందుకు రామలింగం, కేఎంసీ కంపెనీలకు అనుమతి. ►వివిధ ప్రభుత్వ శాఖల వద్ద భూములను ‘ఆశ్రయ’ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి వీలుగా రాజీవ్‌గాంధీ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఉచితంగా భూములు ఇవ్వడానికి నిర్ణయం. ►వివిధ ప్రభుత్వ శాఖల వద్ద భూములను ధార్మిక సంస్థలతో సహా వేర్వేరు శాఖలకు, వేర్వేరు పనులకు కేటాయింపునకు నిర్ధిష్ట ధరలను నిర్ణయించడం. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఇకపై ధార్మిక సంస్థలు కూడా కొంత మొత్తాన్ని చెల్లించే భూములను కొనుగోలు చేయడంకాని, లీజు రూపంలో అందుకోవాల్సి ఉంటుంది. ► పిరియపట్టణ, హళియాళ పట్టణ పంచాయతీలను పురసభలుగా మార్చడానికి అంగీకారం. ►పశుసంవర్థకశాఖకు సంబంధించి బెంగళూరులోని వివిధ చోట్ల ఖాళీగా ఉన్న స్థలాల్లో నూతన భవననాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనుల కోసం దాదాపు రూ.41 కోట్ల నిధులు విడుదల ► నూతనంగా 100 పశు చికిత్స కేంద్రాలు ఏర్పాటుకు అంగీకారం. ► ఈ ఏడాది జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘న్యూ ల్యాండ్ అక్విజియేషన్ యాక్ట్’కు అనుగుణంగా రూపొందించిన రూల్స్‌కు మంత్రిమండలి ఆమోదం. ఈ విధంగా ‘యాక్ట్’కు రూల్స్ రూపొందించింది ఇప్పటి వరకూ కర్ణాటక మాత్రమే అని టీ.బీ జయచంద్ర వెల్లడించారు. -
అవినీతి పాలనొద్దు
మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతల యత్నం కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ = ఆందోళనాకారులను అదుపులోకితీసుకున్న పోలీసులు చెరకు మద్దతు ధరపై రైతుల నిరసన మినీ విధానసౌధఎదుట ధర్నా మద్దతు ధరను ఒకే విడతలో చెల్లించాలంటూ నినాదాలు బెంగళూరు : గుల్బర్గా నగరంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవినీతి కూడా పెచ్చుమీరిపోయిందని నినదించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ మంత్రి మండలి సమావేశం జరుగుతున్న మిని విధానసౌధను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు రేవూనాయక బెళమగి, సునీల్ వల్ల్యాపుర, దత్తాత్రేయ పాటిల్, అమరనాథ పాటిల్, ఎంవై పాటిల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక ఇదే సందర్భంలో రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన మద్దతు ధరను విడతల వారీగా చెల్లించవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ స్థానిక చెరకు రైతులు సైతం మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న మిని విధానసౌధ ఎదుట ధర్నాకు దిగారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన ధరను ఒకే విడతలో చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో సిద్ధరామ భూనసూర అనే రైతు తీవ్ర అవ్వస్థతకు గురికావడంతో అతన్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.