
అవినీతి పాలనొద్దు
మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతల యత్నం
కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ = ఆందోళనాకారులను అదుపులోకితీసుకున్న పోలీసులు
చెరకు మద్దతు ధరపై రైతుల నిరసన
మినీ విధానసౌధఎదుట ధర్నా
మద్దతు ధరను ఒకే విడతలో చెల్లించాలంటూ నినాదాలు
బెంగళూరు : గుల్బర్గా నగరంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవినీతి కూడా పెచ్చుమీరిపోయిందని నినదించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ మంత్రి మండలి సమావేశం జరుగుతున్న మిని విధానసౌధను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు రేవూనాయక బెళమగి, సునీల్ వల్ల్యాపుర, దత్తాత్రేయ పాటిల్, అమరనాథ పాటిల్, ఎంవై పాటిల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఇక ఇదే సందర్భంలో రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన మద్దతు ధరను విడతల వారీగా చెల్లించవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ స్థానిక చెరకు రైతులు సైతం మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న మిని విధానసౌధ ఎదుట ధర్నాకు దిగారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన ధరను ఒకే విడతలో చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో సిద్ధరామ భూనసూర అనే రైతు తీవ్ర అవ్వస్థతకు గురికావడంతో అతన్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.