శాంతిభద్రతలే తొలి ప్రాధాన్యత
డీజీపీకి సూచించిన యూపీ సీఎం
⇒ 15 రోజుల్లో అధికారులు ఆస్తులు వెల్లడించాలి
⇒ అలహాబాద్‌లో బీఎస్పీ నేత హత్యపై సీరియస్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నట్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్, డీజీపీ జావీద్ అహ్మద్, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేబాషిష్ పాండాలతో సమావేశమ్యారు. వారికి బీజేపీ మేనిఫెస్టోను అందజేసిన సీఎం.. వీటి అమలు దిశగా కార్యాచరణను మొదలుపెట్టాలని ఆదేశించారు.
అలహాబాద్‌లో జరిగిన బీఎస్పీ కార్యకర్త హత్యపై స్పందిస్తూ.. శాంతిభద్రతల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డీజీపీకి సూచించారు. దీంతోపాటుగా రాష్ట్రంలోని 75 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు, ఇతర పాలనాపరమైన సమస్యపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం.. సోమవారం అధికారులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో స్థిర, చరాస్తుల వివరాలన్నీ అందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ కూడా ఆదిత్యనాథ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 47 మంది మంత్రులకు త్వరలోనే శాఖలు కేటాయించనున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలహాబాద్‌లో బీఎస్పీ నేత హత్య: అలహాబాద్ సమీపంలోని మవాయిమా పోలీసుస్టేషన్ సమీపంలో బీఎస్పీకి చెందిన మహ్మద్ షమీ (60) అనే నేతను గుర్తుతెలియని ఆదివారం రాత్రి వ్యక్తులు కాల్చి చంపారు. సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే ఈ ఘటన జరగటం కలకలం రేపింది. కాగా, నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా పశువులను వధిస్తుండటంతో అలహాబాద్‌లో రెండు కబేళాలను అధికారులు మూసేశారు.