అతివాదికి అందలం
హిందువులను క్రైస్తవంలోకి మార్చేందుకే మదర్ థెరీసా భారత్‌కు వచ్చారు – థెరీసాపై యోగి వివాదాస్పద వ్యాఖ్య
షారుక్ ఖాన్.. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాషలో మాట్లాడుతున్నారు. ప్రజలు నీ సినిమాలు చూడకపోతే రోడ్డున పడతావ్ - యోగి
యూపీని, భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చేంతవరకూ విశ్రమించను. –2005లో ఘర్‌వాపసీ’ కార్యక్రమంలో..
హిందూ అతివాదిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్‌కు యూపీ పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు లేనప్పటికీ... సొంతగా ‘హిందూ యువ వాహిని’ని స్థాపించిన యోగి హిందూత్వ అతివాదిగా ముద్ర పడ్డారు. మతమార్పిడులపై, బుజ్జగింపు రాజకీయాలపై (మైనారిటీలను సంతృప్తి పర్చే రాజకీయాలపై), హిందూత్వ అతివాద భావాలపై ముక్కుసూటిగా, తన భావాలను వ్యక్తపరుస్తారు. స్వతంత్రంగా వ్యహరించే స్వభావమున్న ఈ గోరక్‌నాథ్ మఠాధిపతి అధికారం పీఠంపై కూర్చున్నాక... సరైన ‘చెక్’ లేకపోతే మోదీ అండ్ కోకు ఇబ్బందికరంగా మారొచ్చనే విమర్శలొస్తున్నాయి.
మఠాధిపతిగా..
చరిత్రాత్మక గోరఖ్‌పూర్ పట్టణంలో 52 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొన్న గోరఖ్‌నాథ్ మఠం చాలా సుప్రసిద్ధం. గోరఖ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మఠం ప్రభావం చాలా ఉంటుంది. ఈ మఠాధిపతులు 1967 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఈ మఠం పీఠాధిపతి అయిన అవైద్యనాథ్ ఓసారి ఉత్తరాఖండ్‌లోని తన ఊరినుంచి అజయ్ మోహన్ బిస్త్ అనే సైన్స్ గ్రాడ్యుయేట్‌ను గోరఖ్‌పూర్‌కు తీసుకువచ్చారు. 23 ఏళ్ల వయసులో సన్యాసం ఇప్పించి.. ఆదిత్యనాథ్‌గా నామకరణం చేసి 1994లో తన వారసుడిగా ప్రకటించారు. 1997లో స్థానికంగా బ్రాహ్మణులు– ఠాకూర్ల మధ్య గొడవల్లో ఠాకూర్ల నాయకుడు చనిపోవటంతో ఆదిత్యనాథ్ నాయకత్వ బాధ్యతలు అందుకున్నారు.
1998లో తొలిసారిగా బీజేపీ టికెట్‌పై గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచి 26 ఏళ్ల వయసులో లోక్‌సభలో అడుగుపెట్టారు. 12వ లోక్‌సభలో ఆయనే అత్యంత పిన్న వయస్కుడు. అప్పటినుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. హిందువులపై ఎక్కడే చిన్నదాడి జరిగినా.. ఆయన అక్కడికి వెంటనే తన అనుచరులతో కలిసి వెళ్లిపోతారు. 2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన మతఘర్షణల సమయంలో అరెస్టు అయి 15 రోజులు జైల్లో ఉన్నారు. 2014 సెప్టెంబరులో అవైద్యనాథ్ పరమపదించడంతో గోరఖ్‌నాథ్ మఠానికి ఈయన మహంత్ (మఠాధిపతి) అయ్యారు. ఈయనపై హత్యాయత్నంతో పాటు పలు క్రిమినల్ కేసులున్నాయి. అల్లర్లను రెచ్చగొట్టడం, ఖబరస్తాన్‌ల్లోకి బలవంతంగా చొచ్చుకెళ్లడం, ఇతరుల ప్రాణాలకు, భద్రతకు ముప్పు కలిగించడం, భయబ్రాంతులకు గురిచేయడం.. ఇలా పలు అభియోగాలు ఆయనపై ఉన్నాయి.
దర్బార్‌తో ప్రజలకు చేరువ
గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం ఆదిత్యనాథ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. జనం బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వందల కొద్దీ లేఖలను రాస్తుంటారు. మఠానికి అనుబంధంగా ఉండే ఆయుర్వేద ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి ప్రజలకు వైద్య సేవలు అందేలా చేశారు. మఠాధిపతిగా గౌరవం.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడం ఆయనపై అభిమానాన్ని మరింత పెంచింది.
బీజేపీతో సంబంధాలు
కమలం గుర్తుపై పోటీచేస్తున్నప్పటికీ తన అవసరం బీజేపీకి ఉంది కాని... పార్టీ అవసరం తనకు లేదనే ధోరణి ఆయనది. పలు సందర్భాల్లో పార్టీ విప్‌ను బహిరంగంగానే ధిక్కరించారు. 2014లో ఐదోసారి ఎంపీగా గెలిచిన యోగికి పూర్వాంచల్ కోటాలో మంత్రి పదవి ఇవ్వొచ్చు. కానీ మోదీ ఇవ్వలేదు. 2016లో ఎయిమ్స్ శంకుస్థాపన వచ్చినపుడు గోరఖ్‌నాథ్ మఠానికి వచ్చిన ప్రధానిని కలిసిన కొందరు సాధువులు.. యోగిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరగా మోదీ మౌనం వహించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనతో ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో 2016లో మంత్రిపదవి ఇవ్వజూపగా తిరస్కరించారు.
సీఎం పదవిపై ఎప్పటినుంచో ఆశలు
యూపీ రాజకీయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన నేత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా ఢిల్లీకి మారడం, పలువురు సీనియర్లు క్రియాశీల రాజకీయాలకు దూరమవటంతో సీఎం పదవిపై యోగి చాలాకాలంగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ వ్యూహాత్మకంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. తన అనుచరులకు కోరినన్ని టికెట్లు ఇవ్వకున్నా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొన్న ఆదిత్యనాథ్.. కమళ దళపతి అమిత్ షాకు ఈసారి బాగా సహకరించారు. యూపీ అంతటా కలియదిరిగి ప్రచారం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ తర్వాత స్టార్ క్యాంపెయినర్ యోగియే.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్