లక్నోలో సమావేశం తర్వాత యోగికి మిఠాయి తినిపిస్తున్న బీజేపీ నాయకుడు
యూపీ సీఎంగా రాజపుత్ర వర్గానికి చెందిన ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేయటం ద్వారా మరోసారి బ్రాహ్మణేతరులకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ. మొదటి సీఎం కల్యాణ్‌సింగ్ లోధా (బీసీ) కాగా, తర్వాత సీఎంలు రాంప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్ (రాజ్‌పూత్)లు అగ్రవర్ణాలవారు. అయితే, బ్రాహ్మణాధిపత్యం ఎక్కువనే ప్రచారం ఉన్నప్పటికీ ఈ వర్గానికి ఇంతవరకు సీఎం పదవిని ఇవ్వలేదు. 1946 నుంచీ కాంగ్రెస్ తరఫున 10 మంది సీఎంలు అయితే.. వారిలో ఆరుగురు (పండిత గోవిందవల్లభ్ పంత్, సుచేతా కృపలాణీ, కమలాపతి త్రిపాఠీ, హెచ్‌ఎన్ బహుగుణ, ఎన్‌డీ తివారీ, శ్రీపతి మిశ్రా) బ్రాహ్మణులే.
21 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ పాలన తర్వాత 1967లో జాట్‌నేత చౌధరీ చరణ్ సింగ్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ పాలనలో బ్రాహ్మణ, కాయస్థ, వైశ్య వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రులయ్యారు. బ్రాహ్మణుల తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బీసీ నేతగా రాంనరేశ్ యాదవ్ తొలిసారి 1977లో (జనతాపార్టీ) సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే రాజపుత్ర నేతలు వీపీ సింగ్ (1980లో), వీర్‌బహాదూర్ సింగ్(1985లో) సీఎంలయ్యారు. మధ్యలో 6నెలలు కాంగ్రెసేతర సంకీర్ణ సర్కారును నడిపిన సీఎం త్రిభువన్ నారాయణ్ సింగ్ కూడా రాజపూత్ వర్గానికి చెందినవారే.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్