
చేయనుగాక చేయను
- రాజీనామా డిమాండ్‌పై హోం శాఖ మంత్రి
- పరిషత్‌లో నల్లకండువాలు ప్రదర్శించిన బీజేపీ
సాక్షి, బెంగళూరు : ఎలాంటి పరిస్థితిల్లోనూ తాను రాజీనామా చేసేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ తేల్చి చెప్పారు. విధానపరిషత్‌లో విపక్ష సభ్యులు శుక్రవారం చేసిన డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. సభా కార్యాక్రమాలకు బీజేపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే విపక్ష నేత కె.ఎస్. ఈశ్వరప్ప మాట్లాడుతూ... ప్రశ్నోతర్త సమయాన్ని వాయిదా వేసి ఫ్రేజర్ టౌన్ ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ సభాపతి శంకరమూర్తిని డిమాండ్ చేశారు. ఇందుకు పరిషత్ నేత, మంత్రి ఎస్‌ఆర్ పాటిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారమే సభా కార్యక్రమాలు జరగాలని పేర్కొన్నారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎమ్మెల్సీ మధుసూదన్ కలుగజేసుకుని ఫ్రేజర్‌టౌన్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కె.జె.జార్జ్ రాజీనామా చేయాలని అన్నారు. ఆయనకు జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్సీలు మద్దతు పలికారు.
ఇందుకు మంత్రి జార్జ్ సమాధానమిస్తూ ఎవరెన్ని చెప్పినా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేందుకు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ అసమర్థతే కారణమంటూ సభ్యులు మండిపడ్డారు. సభాపతి జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.