
టోల్ తీశారు
వాహనదారుల జేబుకు చిల్లు
రాష్ట్ర రహదారులపై కూడా ఇక టోల్ వసూలు
మంత్రి మండలి నిర్ణయం
బెంగళూరు : రాష్ట్ర రహదారులపై కూడా ఇక నుంచి టోల్‌ను వసూలు చేయాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన శనివారమిక్కడి విధానసౌధలో మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర పశుసంవర్థ, న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మీడియాకు వెల్లడించారు. అందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు....
► రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లోని చిన్నారులపై జరుగుతున్న దౌర్జన్యాలకు ఇకపై సదరు విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనితో పాటు పిల్లల రక్షణ కోసం పోలీసు, విద్యాశాఖ రూపొందించిన పలు మార్గదర్శకాలకు మంత్రి మండలి ఆమోదం
► రూ.58.6 కోట్లతో ఉత్తర కర్ణాటక జిల్లా దాండేలి వద్ద స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
► 4వ ఆర్థిక కమిషన్ ఏర్పాటుకు అనుమతి. అధ్యక్షుడితో సహా ముగ్గురు సభ్యులు. నివేదిక ఇవ్వడానికి ఏడాదిన్నర సమయం.
► ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గొల్ల, కాడుగొల్ల, అడవిగొల్లలను ఎస్టీ వర్గానికి చేర్చడానికి వీలుగా మంత్రి మండలి నిర్ణయం. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు
► రూ.12.60 కోట్లతో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖకు నూతన భవన నిర్మాణం
►యలహంక నుంచి గౌరిబిదనూరు మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకూ దాదాపు 76 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి, నిర్మాణం తదితర పనులను ప్రభుత్వ, ప్రైవేటు విధానంలో (పీపీపీ) రూ.152 కోట్ల నిధులతో చేపడుతారు. ఇందుకు రామలింగం, కేఎంసీ కంపెనీలకు అనుమతి.
►వివిధ ప్రభుత్వ శాఖల వద్ద భూములను ‘ఆశ్రయ’ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి వీలుగా రాజీవ్‌గాంధీ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఉచితంగా భూములు ఇవ్వడానికి నిర్ణయం.
►వివిధ ప్రభుత్వ శాఖల వద్ద భూములను ధార్మిక సంస్థలతో సహా వేర్వేరు శాఖలకు, వేర్వేరు పనులకు కేటాయింపునకు నిర్ధిష్ట ధరలను నిర్ణయించడం. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఇకపై ధార్మిక సంస్థలు కూడా కొంత మొత్తాన్ని చెల్లించే భూములను కొనుగోలు చేయడంకాని, లీజు రూపంలో అందుకోవాల్సి ఉంటుంది.
► పిరియపట్టణ, హళియాళ పట్టణ పంచాయతీలను పురసభలుగా మార్చడానికి అంగీకారం.
►పశుసంవర్థకశాఖకు సంబంధించి బెంగళూరులోని వివిధ చోట్ల ఖాళీగా ఉన్న స్థలాల్లో నూతన భవననాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనుల కోసం దాదాపు రూ.41 కోట్ల నిధులు విడుదల
► నూతనంగా 100 పశు చికిత్స కేంద్రాలు ఏర్పాటుకు అంగీకారం.
► ఈ ఏడాది జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘న్యూ ల్యాండ్ అక్విజియేషన్ యాక్ట్’కు అనుగుణంగా రూపొందించిన రూల్స్‌కు మంత్రిమండలి ఆమోదం. ఈ విధంగా ‘యాక్ట్’కు రూల్స్ రూపొందించింది ఇప్పటి వరకూ కర్ణాటక మాత్రమే అని టీ.బీ జయచంద్ర వెల్లడించారు.