MEGA Engineering and Infrastructures
-
ఒలెక్ట్రా జోరు.. కేఎస్ఆర్టీసీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజా గా కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్ఆర్టీసీ) 25 ఈ–బస్‌లను సరఫరా చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో ఈ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కంపెనీ తయారీ బస్‌లు సేవలు అందిస్తున్నాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 1,100 పైగా ఈ–బస్‌లు 10 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని చెప్పారు. -
అమ్మకానికి కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కొనుగోలు రేసులో మేఘా ఇంజినీరింగ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీఈఎంఎల్లో 26 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్), టాటా మోటర్స్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్జ్ తదితర సంస్థలు షార్ట్‌లిస్ట్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా వాటితో పాటు ఈ నాలుగు సంస్థలు.. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాయి. వీటికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) డాక్యుమెంట్‌ను జారీ చేయడం సహా బీఈఎంఎల్ డేటా రూమ్, ఉత్పత్తి కేంద్రాలను సందర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. చైనా, పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలేమైనా ఉంటే వెల్లడించాలంటూ కూడా ఆయా సంస్థలకు సూచించినట్లు పేర్కొన్నాయి. పృథ్వీ మిసైల్ లాంచర్ వంటి మిలిటరీ హార్డ్‌వేర్‌ను తయారు చేసే బీఈఎంఎల్ రక్షణ..ఏరోస్పేస్, మైనింగ్.. నిర్మాణం, రైల్..మెట్రో వంటి మూడు ప్రధాన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి. బీఈఎంఎల్లో కేంద్రానికి 54 శాతం వాటాలు ఉన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఇందులో కొంత భాగాన్ని విక్రయించడంతో పాటు యాజమాన్య హక్కులను కూడా బదలాయించే ఉద్దేశ్యంతో జనవరి 4న ప్రభుత్వం ఈవోఐలను ఆహ్వానించింది. ఈవోఐలను సమర్పించేందుకు మార్చి 1 ఆఖరు తేదీగా ముందు ప్రకటించినా ఆ తర్వాత దాన్ని 22 వరకూ పొడిగించారు. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ కొనుగోలుకు సంబంధించి కూడా షార్ట్‌లిస్ట్ అయిన సంస్థల్లో ఎంఈఐఎల్ ఉంది. -
మేఘాకు ఎనర్షియా అవార్డు
హైదరాబాద్: ఇన్ఫ్రా సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (మేఘా)కు ప్రతిష్టాత్మకమైన ఎనర్షియా అవార్డు లభించింది. దక్షిణాదిలోనే తొలిసారిగా అనంతపురంలో వినూత్న టెక్నాలజీతో 50 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినందుకు గాను కంపెనీ ఈ పురస్కారం దక్కించుకుంది. న్యూఢిల్లీలో జరిగిన 8వ ఎనర్షియా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి తరుణ్ కపూర్ చేతుల మీదుగా మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పి.పి. రెడ్డి దీన్ని అందుకున్నారు. సంప్రదాయక ఫోటోవోల్టాయిక్ పద్ధతిలో కాకుండా అత్యంత సంక్లిష్టమైన కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ (సీఎస్పీ) విధానంలో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మేఘా డెరైక్టర్లు పి. రవిరెడ్డి, దొరయ్య, జనరల్ మేనేజర్ ఎన్ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.