మేఘాకు ఎనర్షియా అవార్డు
హైదరాబాద్: ఇన్‌ఫ్రా సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (మేఘా)కు ప్రతిష్టాత్మకమైన ఎనర్షియా అవార్డు లభించింది. దక్షిణాదిలోనే తొలిసారిగా అనంతపురంలో వినూత్న టెక్నాలజీతో 50 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినందుకు గాను కంపెనీ ఈ పురస్కారం దక్కించుకుంది.
న్యూఢిల్లీలో జరిగిన 8వ ఎనర్షియా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి తరుణ్ కపూర్ చేతుల మీదుగా మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పి.పి. రెడ్డి దీన్ని అందుకున్నారు. సంప్రదాయక ఫోటోవోల్టాయిక్ పద్ధతిలో కాకుండా అత్యంత సంక్లిష్టమైన కాన్సన్‌ట్రేటెడ్ సోలార్ పవర్ (సీఎస్‌పీ) విధానంలో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మేఘా డెరైక్టర్లు పి. రవిరెడ్డి, దొరయ్య, జనరల్ మేనేజర్ ఎన్‌ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.