వరాల వాన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఇందూరుకు వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాపై వరాల వాన కురిపించారు. నాలుగేళ్లలో అన్ని పనులు సాధించి తీరుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలో నిమ్స్ తరహాలో మెగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెలంగాణలోనే దీనిని తొలి పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పారు.
జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆర్మూరులో కీలక అంశంగా ఉన్న ఎర్రజొన్నల బకాయిలు రూ.10.83 కోట్లు వారం రోజులలో చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సాగు నీరు, వైద్యం, పర్యాటక, కనీస సౌకర్యాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు. జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టిన ప్రజల కోసం ఏమై నా చేస్తానన్నారు. గురువారం ఆయన ఆర్మూర్, అంకాపూర్, నిజామాబాద్‌లో పర్యటించారు.
ఆరేళ్ల ‘ఎర్రజొన్నల’కు మోక్షం
ఆరేళ్లుగా నలుగుతున్న ఎర్రజొన్నల వివాదానికి కేసీఆర్ ఎట్టకేలకు తెరదించారు. వారం రోజులలో ఎర్రజొన్నల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ మేరకు ఉత్తర్వులు కూడ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రైతుల ఇళ్లకే వెళ్లి బకాయిలు చెల్లించాలని సూచించారు. దీంతో ఆరేళ్ల క్రితం పోలీసు కాల్పులకు దారితీసిన ఎర్రజొన్నల బకాయిలకు మోక్షం కలిగినట్లయ్యింది. ఆర్మూరులో రూ.114.11 కోట్లతో శంకుస్థాపన చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి తానే ప్రారంభిస్తానన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాలోని ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రాలీల కు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. వచ్చే దసరా, దీపావళి పండగల మధ్యలో వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున ఫించను అందజేస్తామన్నారు.
గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి గుట్టు రట్టయ్యాక, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.3.50 లక్షలు వెచ్చించి రెండు పడక గదుల పక్కా ఇళ్లను నిర్మిస్తామని, మొదట ఆర్మూరు, అంకాపూర్‌లో మోడల్ కాలనీలను రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఈ పంద్రాగస్టు నుంచే పంపిణీ చేస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద పెళ్లి చేసుకునే ప్రతి గిరిజన, దళిత యువతికి ప్రభుత్వం రూ.50 వేలు అందజేస్తుందన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక కార్యాచరణ
నిజాంసాగర్, గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన సీఎం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చనున్నట్లు ప్రకటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతాలైన ఆర్మూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలకు సాగునీరు అం దిస్తామన్నారు. అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచి బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి, ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలంలోని 18 గ్రామాలకు సాగునీరందే ఏర్పాటు చేస్తామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపైనా దృష్టి సారిం చనున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని పటిష్టం చేయనున్నామన్నారు.
నగరంపైనా దృష్టి
జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ), బైపాస్ రహదారి అసంపూర్తిగా ఉండటం నగర ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆ రెండు ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేసేలా మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమాలలో కేసీ ఆర్ వెంట రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు పాతూరి సుధా కర్‌రెడ్డి, డి.రాజేశ్వర్, సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత ఉన్నారు.