‘స్టాండింగ్’ లేని సమావేశం
– హాజరు కాని జెడ్పీటీసీలు
– కోరం లేక ప్రధాన శాఖల చర్చలు వాయిదా
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం దిశానిర్దేశం లేకుండా గురువారం ముగిసింది. సగానికి పైగా సభ్యులు హాజరు కాక పోవడంతో కోరం లేక రెండు ప్రధాన శాఖలకు సంబంధించిన చర్చను వాయిదా వేశారు. జెడ్పీ చైర్మన్ చమన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలతో కూడిన అజెండాను సభ్యులకు సీఈఓ సూర్యనారాయణ అందజేశారు. తాగునీటి సమస్యనే ప్రధానంగా పలువురు సభ్యులు చర్చించారు. రూ. కోట్లు కుమ్మరిస్తున్నా.. ప్రజలకు అవసరమైన మేరకు తాగునీరు అందించలేకపోతున్నట్లు విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య నానాటికీ జఠిలమవుతోందని మండిపడ్డారు. డ్వామా పీడీ నాగభూషణం మాట్లాడుతూ...జిల్లాను ఉపాధి హామీ పనులు కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.