ఆ సమయంలో అక్కడే సోదరులు?
ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ను ఉరి తీసే సమయంలో ఆయన సోదరులు సులేమాన్ తదితరులు నాగ్ పూర్ జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మెమన్ భార్య రహిన్ మాత్రం గురువారం ఉదయమే ముంబై నుంచి నాగ్ పూర్ బయల్దేరి వెళ్లారు. మెమన్ భౌతిక కాయాన్ని తమకు అప్పగించాల్సిందిగా ఆమె జైలు అధికారులను కోరనున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల నుంచి 6.50 గంటల మధ్యలో ఉరిశిక్ష అమలైంది.
తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్ ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. అనంతరం ప్రార్థనలు కూడా జరిగాయి. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. తెల్లటి జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది.