Menakagandhi
-
జీవరాశిని కాపాడుకోవాలి: మేనకాగాంధీ
శామీర్‌పేట్: కీటకాలు మొదలు పెద్ద జంతువు వరకు ఉన్న జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరముందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో శుక్రవారం జంతు సంబంధిత చట్టాల అధ్యయన కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. మేనకాగాంధీ మాట్లాడుతూ ‘జంతు సంరక్షణ అంటే వాటి పట్ల ప్రేమ చూపడమే కాదు. పర్యావరణ పరిరక్షణ కూడా’అని పేర్కొన్నారు. జంతు సంబంధమైన చట్టాలను రూపొందించాలంటే జంతువులపై ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర స్థాయిలోని పర్యావరణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్యావరణ చట్టాల రూపకల్పనకు సహకరిస్తున్నదని, అదేవిధంగా నల్సార్ జంతు సంబంధ చట్టాల కేంద్రం కూడా జంతు సంరక్షణ చట్టాల రూపకల్పనకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కేంద్రం జంతు సంబంధ చట్టాల్లోని సమస్యలు, జంతు సంక్షేమ చట్టాల రూపకల్పనకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్న లకు ఆమె ఓపిగ్గా సమాధానం చెప్పారు. అనంతరం హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్ఎస్ఐ) మేనేజింగ్ డైరెక్టర్ జయసింహాను ఈ కేంద్రానికి గౌరవ డైరెక్టర్‌గా నియమించారు. కార్యక్రమంలో నల్సార్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరీ వేటగాడు
కేంద్ర మంత్రులు మేనకాగాంధీ-ప్రకాశ్ జవదేకర్ మధ్య గురువారం మాటల యుద్ధం... నేషనల్ మీడియాలో కథనాల ప్రవాహం... కారణం ‘వేట’... బీహార్‌లోని మకామా ప్రాంతంలో ఓ వేటగాడు బ్లూబుల్స్‌ని కాల్చిచంపిన ఘటన..! మంత్రుల మధ్య మాటల యుద్ధానికి ‘కేంద్ర’మైన వేటగాడు ఎవరో కాదు. నగరంలోని రెడ్‌హిల్స్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీఖాన్. ఆయన నేపథ్యం ఏమిటి..? - సాక్షి, సిటీబ్యూరో అసలేం జరిగింది... బీహార్‌లోని మకామా ప్రాంతం.. బ్లూబుల్స్ స్వైర విహారం.. రైతులకు తీవ్రనష్టం... వీటిని కట్టడి చేసేందుకు సర్కార్ శతవిధాలా ప్రయత్నించింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిటీహంటర్ షఫత్ అలీఖాన్ సాయం కోరింది. సమాచారం అందుకున్న ఖాన్ ఈ నెల 5న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బీహార్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కలిసి పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. బ్లూబుల్స్‌ని కాల్చి చంపడమే పరిష్కారమని తేల్చారు. ఆ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అలీఖాన్ రంగంలోకి దిగారు. నాలుగు రోజుల్లో 300 బ్లూబుల్స్‌ని చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తన సహచర మంత్రి ప్రకాశ్‌జవదేకర్, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లను తీవ్రస్థాయిలో విమర్శించారు. జవదే కర్ సైతం ఘాటుగా స్పందించారు. మంత్రుల మధ్య మాటల యుద్ధానికి సిటీ హంటర్ షఫత్ అలీఖాన్ కేంద్రబిందువయ్యారు. వేటగాడి చరిత్ర... పేరు: నవాబ్ షఫత్ అలీఖాన్ నివాసం: రెడ్‌హిల్స్ కుటుంబ నేపథ్యం: అలీఖాన్ తాత బహదూర్ బ్రిటిష్‌ఇండియాకు అటవీ సలహాదారు. బ్రిటీష్ హయాంలో 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. వేటలో ఓనమాలు 1976లో 19 ఏళ్ల వయసులో అలీఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. తర్వాత కాలంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న 7 ఏనుగులు, 3 పులులు, 12 చిరుతల్ని హతమార్చారు. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న 1500 అడవి గేదెలు, వేల సంఖ్యలో అడవి పందులు, వందలాది అడవి కుక్కల్ని చంపారు. ప్రత్యేకత మ్యాన్-యానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీ కాల్చడం వంటి అంశాల్లో తర్ఫీదు ఇవ్వడంలో దిట్ట. వివిధ రాష్ట్రాల్లోని అటవీ శాఖ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత హోదా బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం సలహాదారు. జంతుప్రేమికుడు... ఇతడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు. ‘‘హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాల నుంచి జంతువుల్ని వేటాడుతోంది’’ - కేంద్ర మంత్రి మేనకాగాంధీ ‘‘మూడు తరాల నుంచి మా కుటుంబం సమాజం కోసమే వేటాడుతోంది’’ - సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ -
మేనకాగాంధీ వర్సెస్ జవదేకర్
జంతు వధపై కేంద్ర మంత్రుల మధ్య రచ్చ * పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనక * రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే చంపామన్న జవదేకర్ న్యూఢిల్లీ: జంతు వధ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. అరుదైన జంతువులను చంపే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. ఇటీవల బిహార్‌లో 200 అరుదైన బ్లూబుల్స్ (నీల్గాయ్)ను కాల్చి చంపిన నేపథ్యంలో ఈ అంశంపై జంతువుల హక్కుల ఉద్యమకర్త అయిన మేనక తీవ్రంగా స్పందించారు. దీనిని అతిపెద్ద ఊచకోతగా అభివర్ణించిన ఆమె.. కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి జంతువులను చంపేందుకు ఒక జాబితా తయారు చేస్తే తాము అందుకు అనుమతిస్తామని కోరిందని ఆరోపించారు. జంతువులను చంపాలనే పర్యావరణ శాఖ ఆరాటం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని ఆమె చెప్పారు. బిహార్‌లో నీల్గాయ్లు, పశ్చిమబెంగాల్లో ఏనుగులు, హిమాచల్ ప్రదేశ్‌లో కోతులు, గోవాలో నెమళ్లు, చంద్రపూర్‌లో అడవి పం దుల సంహారానికి కేంద్రం అనుమతిచ్చిం దని ఆరోపించారు. అయితే పర్యావరణ శాఖ నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి జవదేకర్ సమర్థించుకున్నారు. పంటలు, ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే జంతు సంహారానికి అనుమతి ఇచ్చామని, దీనిని నిర్ధిష్ట ప్రాంతాలకు, నిర్ధిష్ట కాల వ్యవధికే పరిమితం చేశామని చెప్పారు. రైతుల పొలాలు ధ్వంసమవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదన పంపితే అప్పుడే తాము అనుమతి ఇస్తామని చెప్పారు. మంత్రుల మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.మోదీ ప్రభుత్వంలో టీమ్ వర్క్ అనేదే లేదని ఎద్దేవా చేశాయి. వివిధ శాఖల మధ్య వివాదాలు ఇదే తొలిసారి కాదని, టీమ్ వర్క్ లేకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని జేడీయూ, ఎన్సీపీ విమర్శించాయి.