ఎవరీ వేటగాడు
కేంద్ర మంత్రులు మేనకాగాంధీ-ప్రకాశ్ జవదేకర్ మధ్య గురువారం మాటల యుద్ధం... నేషనల్ మీడియాలో కథనాల ప్రవాహం... కారణం ‘వేట’... బీహార్‌లోని మకామా ప్రాంతంలో ఓ వేటగాడు బ్లూబుల్స్‌ని కాల్చిచంపిన ఘటన..!
మంత్రుల మధ్య మాటల యుద్ధానికి ‘కేంద్ర’మైన వేటగాడు ఎవరో కాదు. నగరంలోని రెడ్‌హిల్స్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీఖాన్. ఆయన నేపథ్యం ఏమిటి..? - సాక్షి, సిటీబ్యూరో
అసలేం జరిగింది...
బీహార్‌లోని మకామా ప్రాంతం..
బ్లూబుల్స్ స్వైర విహారం..
రైతులకు తీవ్రనష్టం...
వీటిని కట్టడి చేసేందుకు సర్కార్ శతవిధాలా ప్రయత్నించింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిటీహంటర్ షఫత్ అలీఖాన్ సాయం కోరింది. సమాచారం అందుకున్న ఖాన్ ఈ నెల 5న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బీహార్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కలిసి పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. బ్లూబుల్స్‌ని కాల్చి చంపడమే పరిష్కారమని తేల్చారు. ఆ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అలీఖాన్ రంగంలోకి దిగారు. నాలుగు రోజుల్లో 300 బ్లూబుల్స్‌ని చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తన సహచర మంత్రి ప్రకాశ్‌జవదేకర్, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లను తీవ్రస్థాయిలో విమర్శించారు. జవదే కర్ సైతం ఘాటుగా స్పందించారు. మంత్రుల మధ్య మాటల యుద్ధానికి సిటీ హంటర్ షఫత్ అలీఖాన్ కేంద్రబిందువయ్యారు.
వేటగాడి చరిత్ర...
పేరు: నవాబ్ షఫత్ అలీఖాన్
నివాసం: రెడ్‌హిల్స్
కుటుంబ నేపథ్యం: అలీఖాన్ తాత బహదూర్ బ్రిటిష్‌ఇండియాకు అటవీ సలహాదారు. బ్రిటీష్ హయాంలో 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు.
వేటలో ఓనమాలు
1976లో 19 ఏళ్ల వయసులో అలీఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెచ్‌డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. తర్వాత కాలంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న 7 ఏనుగులు, 3 పులులు, 12 చిరుతల్ని హతమార్చారు. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న 1500 అడవి గేదెలు, వేల సంఖ్యలో అడవి పందులు, వందలాది అడవి కుక్కల్ని చంపారు.
ప్రత్యేకత
మ్యాన్-యానిమల్ కన్‌ఫ్లిక్ట్, తుపాకీ కాల్చడం వంటి అంశాల్లో తర్ఫీదు ఇవ్వడంలో దిట్ట. వివిధ రాష్ట్రాల్లోని అటవీ శాఖ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుత హోదా
బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం సలహాదారు.
జంతుప్రేమికుడు...
ఇతడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు.
‘‘హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాల నుంచి జంతువుల్ని వేటాడుతోంది’’ - కేంద్ర మంత్రి మేనకాగాంధీ
‘‘మూడు తరాల నుంచి మా కుటుంబం సమాజం కోసమే వేటాడుతోంది’’ - సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్