రెండో రౌండ్లో సాకేత్
* సోమ్‌దేవ్, బాలాజీ కూడా
* చెన్నై ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, శ్రీరామ్ బాలాజీలు క్వాలిఫయింగ్ విభాగంలో శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సాకేత్ మైనేని భారత్‌కే చెందిన సనమ్ సింగ్‌పై 6-2, 6-4తో విజయం సాధించాడు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ 6-2, 6-3తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)పై, శ్రీరామ్ బాలాజీ 6-2, 6-4తో హాన్స్ కాస్టిలో (చిలీ)పై నెగ్గారు. మరోవైపు శనివారం మెయిన్ ‘డ్రా’ను విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. భారత ప్లేయర్ రామ్‌కుమార్ తొలి రౌండ్లో డానియల్ గిమెనో (స్పెయిన్)తో ఆడతాడు. ప్రధాన టోర్నీ సోమవారం మొదలవుతుంది.