సమాఖ్యను మార్చేందుకు యత్నం
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్న నెపంతో స్వయం సహాయక సంఘానికి చెందిన సమాఖ్య లీడర్‌ను తొలగించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళను అధ్యక్షురాలిగా నియమించేందుకు ప్రయత్నించడంతో పీవో స్థాయి అధికారిని మహిళలు నిలదీశారు. దీంతో సదరు అధికారి వెనుదిరగాల్సి వచ్చింది. బాధిత మహిళల కథనం మేరకు.. తిరుపతి కొర్లగుంట సంజయ్‌గాంధీ కాలనీలో ఆదివారం మదర్‌థెరిస్సా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ మెప్మా ఇన్చార్జి అధికారి జయరామ్, సీవో మల్లికార్జున్, సీఆర్పీ పద్మావతి హాజరయ్యారు.
ప్రస్తుతం ఉన్న స మాఖ్య అధ్యక్షురాలు ఈ.శాంతిని తొలగిస్తూ, ఆమె స్థానంలో మరొక మహిళను ఎన్నుకునేలా మెప్మా అధికారి జయరామ్ ప్రయత్నం చేశారు. దీంతో సమాఖ్య సభ్యులు ఒక్కసారిగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని అధ్యక్షురాలిని ఎందుకు తొలగిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. తమ అనుమతి లేకుండా లీడర్లను మారిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. దీంతో మీకు సంఘాలు జరిపించేది లేదని మెప్మా అధికారి జయరామ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
టీడీపీకి ఓట్లు వేయలేదని: సమాఖ్య సమావేశాన్ని నిర్వహించకుండా అధికారులు వెళ్లిపోవడంతో మహిళలు మీడియాకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన విలేకరులతో పలువురు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ఎన్నికలలో తామంతా టీడీపీకి కాకుండా, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామని తమపై రాజకీయ ముద్ర వేయడం బాధాకరమన్నారు. టీడీపీకి ఓట్లు వేయలేదు కాబట్టి మీరు లీడర్లుగా వద్దు, మాకు అనుకూలంగా ఉన్న వారిని లీడర్లుగా ఏర్పాటు చేసుకుంటామని మెప్మాలోని అధికారులు చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
తమకు రాజకీయరంగు పులమడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు ఈ.శాంతి, కార్యదర్శి లీలావతి, కోశాధికారి కళావతి, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఉప కార్యదర్శి రాజేశ్వరి, ఎస్ఎల్ఆర్పీ పద్మజతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. దీనిపై ఇన్చార్జ్ మెప్మా అధికారి జయరామ్ ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ బైలా ప్రకారం సంఘాల్లోని సభ్యుల వివరాలు సక్రమంగా లేవన్నారు. దీనిపై వివరణ అడిగినా లీడర్లు సమాధానం ఇవ్వడం లేదన్నారు. పైగా తాను రాజకీయాలు మాట్లాడినట్టు ఆరోపించడం బాధాకరమని, తనకు ఆ అవసరం లేదని అన్నారు.