పోలీసులపై కూలిన టెంట్
ధారూరు: మెథడిస్ట్ జాతర ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పోలీసులపై కూలిపడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. స్టేషన్ ధారూరు సమీపంలోని మెథడిస్ట్ జాతర ఆవరణలో నిర్వాహకులు పోలీసుల కోసం ఓ టెంట్ ఏర్పాటు చేశారు. అందులో పోలీసులు సిగ్నలింగ్ కోసం ప్రత్యేకంగా టవర్ ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భారీ వర్షంతో కూడిన గాలిరావడంతో టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో టెంట్ కింద ఉన్న పలువురు పోలీసులు భయాందోళనకు గురయ్యారు. టెంట్ కూలిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, లేకుంటే పెనుప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో యాత్రికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.