Michael Carrick
-
ఇక ప్రతీ మ్యాచ్ కీలకమే
మైకేల్ కారిక్ ఇంటర్వ్యూ ఈసారి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్ తమ జట్టుకు మిశ్రమంగా ఉందని 11 ఏళ్లుగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తరఫున ఆడుతున్న మిడ్‌ఫీల్డర్ మైకేల్ కారిక్ తెలిపాడు. అయినా తాము టాప్–4లో కచ్చితంగా చోటు దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. విజయాలతో పాటు పరాజయాలు ఎదుర్కొంటున్న ఈ జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆదివారం అర్సెనల్‌తో జరిగే కీలక పోరులో తలపడబోతున్న యునైటెడ్ జోస్ మౌరిన్హో పర్యవేక్షణలో దూసుకెళుతుందని గాయంతో బాధపడుతున్న కారిక్ చెబుతున్నాడు. ప్రస్తుతం మీ జట్టుకు కఠిన మ్యాచ్‌లు ఎదురవుతున్నాయి. మాంచెస్టర్ సిటీ తర్వాత ఇప్పుడు అర్సెనల్ను ఎదుర్కొనబోతున్నారు. ఆ తర్వాత టాటెన్హమ్తో తలపడాల్సి ఉంది. ఇదంతా జట్టుకు కష్టంగా సాగబోతుందా? మేము అలా భావించడం లేదు. దీన్ని ఓ అవకాశంగా తీసుకుని పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. విజయాలు సాధించి జట్టు పాయింట్లు పెంచడంపైనే మా దృష్టి ఉంది. అదే జరిగితే ఈ సీజన్ మాకు మేలు చేస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లను ఒత్తిడిగా భావించడం లేదా? లేదు. ఈ సీజన్‌ను మెరుగ్గా ముగించేందుకే మేం ఎదురుచూస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవాలని కోరుకుంటున్నాం. టాప్–4లో నిలవాలంటే అర్సెనల్‌తో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారా? ఇక మా చేతుల్లో ఎక్కువగా మ్యాచ్‌లు లేవు. అందుకే టాప్–4లోకి వెళ్లాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమే. ఇప్పుడు విజయాలు మాకు అవసరం. ఈ సీజన్లో మీ జట్టు ఎక్కువగా ‘డ్రా’లు సాధించింది. విజయానికి దగ్గరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇది మీకు నిరాశ కలిగించిందా? అవును. ముఖ్యంగా సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌ల్లో ఇలాంటి ఫలితం రావడం చికాకు తెప్పించింది. సీజన్లో మా ఫామ్‌పై ఆందోళన లేదు. అద్భుతంగా ఆడుతున్నా ఫలితం అనుకూలంగా రావడం లేదు. దీంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. -
డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం
మైకేల్ కారిక్... మాంచెస్టర్ యునైటెడ్ కీలక ఆటగాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఆ జట్టుకు దశాబ్దానికిపైగా సేవలందిస్తున్నాడు. ఈ సీజన్లో మాంచెస్టర్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ల్ని డ్రా చేసుకోవడం వల్లే పాయింట్ల పట్టికలో వెనుకబడ్డామని చెబుతున్న ఈ 35 ఏళ్ల ఆటగాడు తప్పకుండా తమ జట్టు పుంజుకుంటుందన్నాడు. లీగ్ జరిగేకొద్ది చక్కని ప్రదర్శనతో ముందంజ వేస్తామని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే... గత 8 మ్యాచ్‌ల్లో 6 డ్రాగానే ముగియడంతో ఒత్తిడంతా మీ మీదే ఉన్నట్లుంది? నిజమే... ఈ నేపథ్యంలో టొటెన్హామ్తో మ్యాచ్ చాలా కీలకమైంది. ఇందులో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా దిశా దశా మార్చే మ్యాచ్ ఇది. ముఖ్యంగా మాకు ఈ మూడు పాయింట్లు కీలకం. ఇందులో గెలిస్తే తర్వాత మ్యాచ్‌లకు ఒత్తిడి లేకుండా ఆడేందుకు దోహదపడుతుంది. అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి అందనంత దూరంలో ఉన్న మీరు నాకౌట్కుచేరుకుంటారా? ఈ సీజన్లో మాకన్నీ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకడమే మాకు అతిపెద్ద సవాల్. అయితే జట్టు సమతుల్యంతో ఉంది. దేన్నైనా ఎదుర్కొనేలా జట్టును కోచ్ సన్నద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తుంటే... లీగ్ జరిగేకొద్ది మేం పుంజుకుంటామనే ధీమాతో ఉన్నాం. మాంచెస్టర్‌ను దురదృష్టం వెంటాడిందన్న కోచ్ మౌరిన్హోతో మీరు ఏకీభవిస్తారా ? మేం ఆడిన మ్యాచ్‌లన్నీ ఇంచుమించు ఒకలాగే సాగాయి. విజయాలు సాధించనప్పటికీ అవి గెలవాల్సి ఉందని నమ్ముతున్నాం. అందువల్లే దీన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. జట్టు విజయాలకొసం కోచ్ బాగా శ్రమిస్తున్నాడు. ఈ సీజన్లో జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉందిగా? కచ్చితంగా కాదు. ఫలితాలను పక్కనపెట్టి మా ప్రదర్శనను విశ్లేషించి చూడండి. వ్యక్తిగతంగా మెరుగైన ఆటతీరును కనబరుస్తూ సమష్టిగా జట్టు విజయం కోసం మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. తప్పకుండా గెలుపుబాట పట్టే జట్టు మాది.